Kavitha Politics: కవిత 'రెబల్' అవతారం: KCR వ్యూహమా? BRSలో ప్రకంపనలా? లేఖ, సవాళ్లతో సంచలనం!
BRS MLC కవిత ఇప్పటి వరకు చేపట్టిన అన్ని కార్యక్రమాల్లో గులాబీ కండువా ఎక్కడా వేసుకోకపోవడం, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ ఈ కార్యక్రమాలకు హాజరుకాకపోవడం రాజకీయాలు మారాయి.

Kavitha vs BRS Party | కల్వకుంట్ల కవిత, బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ మహిళా నాయకురాలు, తెలంగాణ ఉద్యమ నాయకురాలు. గులాబీ పార్టీ నుండి ఎంపీగా గెలిచిన మహిళా నేత. ప్రస్తుతం ఆ పార్టీ నుండే ఎమ్మెల్సీగా పని చేస్తున్నారు. అంతేకాకుండా, స్వయానా బీఆర్ఎస్ చీఫ్ కూతురుగా పార్టీలో గుర్తింపు పొందిన నేత. అయితే గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత రాజకీయ పరిణామాలకు తగ్గట్టుగా తనదైన రాజకీయ భాష్యాన్ని తన చర్యల ద్వారా కవిత చెప్పకనే చెబుతున్నారు. సొంత పార్టీతోనే ఢీ అంటే ఢీ అనేలా సవాల్ విసురుతున్నారు. వ్యూహాత్మక కార్యాచరణతో గులాబీ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. కవిత రాజకీయంగా వేస్తున్న అడుగులు చూస్తుంటే గులాబీ తోట నుండి కల్వకుంట్ల కవిత చాలా దూరం వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అదేంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
సొంత దారిలో సాగుతున్న కల్వకుంట్ల కవిత
మద్యం కుంభకోణం ఆరోపణలతో జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కవిత తన సొంత ఎజెండాతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్‌కు రాసిన లేఖ బయటకు రావడం, ఆ తర్వాత మీడియా సమావేశంలో తన లేఖను బయటపెట్టిన వారి పేర్లు వెల్లడి చేయాలని పార్టీని డిమాండ్ చేయడం తెలిసిందే. సమయం, సందర్భం చిక్కినప్పుడల్లా గులాబీ ముఖ్య నేతలపై కవిత రాజకీయ విమర్శలు చేస్తూనే ఉన్నారు. పార్టీలో తనకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని బహిరంగంగానే మీడియా ముందు కవిత తన ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.
అంతటితో మౌనంగా ఉండని కవిత, తన ఆధ్వర్యంలో నడిచే తెలంగాణ జాగృతి సంస్థను బలోపేతం చేసే దిశగా పలు చర్యలు చేపట్టారు. మరోవైపు, కాళేశ్వరం కమిషన్ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇందిరా పార్కు వద్ద ధర్నాకు దిగారు. బీఆర్ఎస్ పార్టీ చేయనిది తాను కేసీఆర్ కోసం ఈ ధర్నా చేపడుతున్నట్లు ప్రకటించి, పార్టీకి, పార్టీ కార్యకర్తలకు తనదైన శైలిలో రాజకీయ సందేశం పంపారు. ఆ తర్వాత బీసీ ఉద్యమ కార్యాచరణను ఎత్తుకొని మరోసారి ఇందిరా పార్కు వద్ద ధర్నా చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ అనుమతి లేకుండానే తాను ఆయా రాజకీయ పార్టీల నేతలను కలుసుకుని మద్దతు కోరడం విశేషం. ఈ చర్యలతోనే కవిత తన సొంత దారి తాను చూసుకుంటున్నానన్న సందేశం చెప్పకనే చెప్పారు.
గులాబీ కండువాకు దూరంగా ఉంటున్న కవిత
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు రాసిన లేఖ బయటపడిన నాటి నుండి కవిత తెలంగాణ భవన్ గడప తొక్కలేదు. అంతేకాదు, కేసీఆర్ నుండి కూడా ఎలాంటి ఆహ్వానం రాలేదు. చివరకు ఫాంహౌస్ నుండి కాళేశ్వరం కమిషన్ ఎదుటకు కేసీఆర్ బయలుదేరే సమయంలో కూడా కవిత దూరం దూరంగానే తండ్రిని ఫాలో అవ్వడం, మీడియాకు రిలీజ్ చేసిన దృశ్యాల్లో కనిపించడం విశేషం. అయితే అక్కడ ఏం జరిగిందన్నది మనం చెప్పలేం కానీ, రాజకీయ చతురుడైన కేసీఆర్ మీడియా ముందు ఏం చేసినా దానికి ఒక లెక్క ఉంటుందని, మీడియా ముందు ఎవరితో మాట్లాడినా, భుజం మీద చేయి వేసినా కూడా ఒక లెక్క ఉంటుందన్న విషయం గులాబీ పార్టీలో అందరికీ తెలిసిన విషయమే. అలాంటిది సొంత కూతురు, పార్టీలో సీనియర్ మహిళా నేత అయిన కవిత దూరంగా ఉండటం, కేసీఆర్ కూడా దూరంగా ఉన్నట్లు కనిపించడం కొట్టిపారేసే విషయం ఏమీ కాదు.
ఇదిలా ఉంటే, కవిత ఇప్పటి వరకు చేపట్టిన అన్ని కార్యక్రమాల్లో గులాబీ కండువా ఎక్కడా వేసుకోకపోవడం, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ ఈ కార్యక్రమాలకు హాజరుకాకపోవడం గమనించాల్సిన మరో విషయం. కేసీఆర్ కోసం ఇందిరా పార్కు వద్ద చేసిన ధర్నాలోనూ తన సొంత సంస్థ అయిన తెలంగాణ జాగృతి కండువా కప్పుకొని పాల్గొన్నారు. ఆ తర్వాత బీసీ ఉద్యమంలోనూ తన కండువాతో పాటు, బీసీ ఉద్యమానికి సూచిక అయిన నీలి రంగు కండువా కప్పుకున్నారు. ఇక తాజాగా హెచ్ఎంఎస్ కార్మిక సంఘం నేతలతో జరిగిన సమావేశంలోనూ హెచ్ఎంఎస్ కండువా కప్పుకొని మీడియా ముందు కనిపించడం కూడా రాజకీయ సందేశంగానే చెప్పుకోవాలి. ఈ పరిణామాలన్నీ గమనిస్తే కవిత గులాబీ కండువాను దూరం పెట్టిందని తెలుస్తోంది.
బీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అంటూ సవాల్ విసురుతున్న కవిత
ఇక తాజా విషయానికి వస్తే, బీఆర్ఎస్ పార్టీ తనను ఒంటరి చేస్తోందని చెబుతున్న కవిత అందుకు తగ్గట్టుగా తన రాజకీయం ఏంటో చూపిస్తున్నట్లుంది. తెలంగాణలో సింగరేణి కార్మికుల ప్రభావం ఎక్కువే. చాలా నియోజకవర్గాల్లో వీరి ప్రభావం కనిపిస్తుంది. బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి కవిత గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఓటమి తర్వాత టీజీబీకేఎస్ పదవి నుండి కవితను తప్పించారు. ఆ స్థానంలో కొద్ది రోజుల క్రితమే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను పార్టీ నియమించింది. ఈ పరిణామానికి కవిత కూడా దూకుడుగా స్పందిస్తుండటం చూస్తే ఢీ అంటే ఢీ అని బీఆర్ఎస్ కు సవాల్ విసురుతున్నట్లు కనిపిస్తుంది.
ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకునే కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి సంస్థకు అనుబంధంగా కార్మిక విభాగాన్ని పటిష్టం చేశారు. కొత్త శాఖలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా, ఏ పార్టీతో సంబంధం లేని హెచ్‌ఎంఎస్ కార్మిక సంఘంతో భేటీ అయి వారితో కలిసి పని చేయనున్నట్లు ప్రకటించారు. ఇది చూస్తుంటే రానున్న రోజుల్లో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగితే సింగరేణితో సహా ఆయా పారిశ్రామిక సంస్థల్లో బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘాల ఓటమికి కవిత పని చేయాల్సి ఉంటుందనడంలో సందేహం లేదు. ఇదే జరిగితే బీఆర్ఎస్ తో కవిత అమీ తుమీ తేల్చుకునేందుకు సిద్ధపడినట్లే. ఈ పరిణామాలు రానున్న రోజుల్లో బీఆర్ఎస్ లో ఎలాంటి రాజకీయ మార్పులు తెస్తాయో వేచి చూడాల్సిందే.
కవిత పార్టీ లక్ష్మణ రేఖ దాటినట్లేనా?
బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉంటూ, పార్టీ అనుబంధ కార్మిక సంఘాలు ఉన్నా, మరో పోటీ కార్మిక సంఘంతో కవిత చేతులు కలపడం అనేది పార్టీ లక్ష్మణ రేఖ దాటినట్లేనని బీఆర్ఎస్ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇది రాజకీయంగా బీఆర్ఎస్ ను బలహీనపరిచే చర్యగా అభివర్ణిస్తున్నారు. పార్టీని కాదని కవిత చేసిన ధర్నాలు ఒక ఎత్తయితే, మరో కార్మిక సంఘంతో కలిసి పని చేస్తానని చెప్పడం మరో ఎత్తు. ఇది నేరుగా పార్టీకి సవాల్ విసిరినట్లే అని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ చర్యల ద్వారా తాను బలమైన నాయకురాలిని అన్న సంకేతాన్ని పార్టీ అధినేత కేసీఆర్‌కు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పంపుతున్నట్లు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఇప్పటి దాకా అటు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం, కవితపై క్రమశిక్షణ చర్యలు చేపట్టకపోవడం లేదా ఈ అసమ్మతిని తగ్గించేలా పిలిచి మాట్లాడకపోవడం అనేది వ్యూహమా లేక ఇది దీర్ఘకాలికంగా పార్టీకి నష్టం చేస్తుందా అన్నది మాత్రం వేచి చూడాలి.






















