Damaged Kidney Recovery : కిడ్నీ చెడిపోయినా ఆరోగ్యంగా మార్చవచ్చా? తాజా అధ్యయనంలో ఇంట్రెస్టింగ్ విషయాలు
Kidney Treatment : వైద్యులు దెబ్బతిన్న కిడ్నీని బాగు చేసే టెక్నాలజీని కనుగొన్నారు. ఇది కిడ్నీ సమస్యలతో బాధపడే రోగులకు మంచి ప్రయోజనాలు ఇచ్చే అవకాశముందని అంటున్నారు.

New Way to Repair Damaged Kidneys : నేటి కాలంలో శాస్త్రవేత్తలు టెక్నాలజీతో పాటు చాలా ముందుకు వెళ్లారు. ఒకప్పుడు చిన్న చిన్న వ్యాధుల కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోయేవారు. కానీ నేడు శాస్త్రవేత్తలు నయం చేయడం కష్టమని భావించే చాలా వ్యాధులకు చికిత్సలను కనుగొన్నారు. అలాంటి నయం చేయలేని ఆరోగ్య సమస్యల్లో కిడ్నీలు దెబ్బతినడం కూడా ఒకటి. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా కేసుల్లో వాటిని నయం చేయడం కూడా కష్టంగా ఉంది. అయితే ఇప్పుడు వైద్యులు దెబ్బతిన్న కిడ్నీలను నయం చేసే మార్గాన్ని కనుగొన్నారు. మరి ఈ పద్ధతి ఎంత ప్రభావవంతంగా ఉంటుందనేది తెలియాల్సి ఉంది.
సమస్యకు పరిష్కారం కనుగొన్న శాస్త్రవేత్తలు
ఇటీవల శాస్త్రవేత్తలు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధిని నిర్మూలించే మార్గాన్ని కనుగొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఉటా హెల్త్ పరిశోధనలో సెరామైడ్ అనే కొవ్వు కణాలు.. కిడ్నీలు దెబ్బతినడానికి కారణమవుతున్నాయని తేలింది. ఈ కణాలు శరీరానికి శక్తినిచ్చే మైటోకాండ్రియాపై దాడి చేస్తాయి. దీని కారణంగా కిడ్నీలకు శక్తినిచ్చే కణాలు సరైన మొత్తంలో శక్తిని ఉత్పత్తి చేయలేవు.
దీనిలో భాగంగా బ్యాకప్ డ్రగ్ కాండిడేట్ సహాయంతో.. ఎలుకల కిడ్నీలకు జరిగిన నష్టాన్ని నిరోధించారు శాస్త్రవేత్తలు. వాటికి శక్తినిచ్చే మైటోకాండ్రియా కణాల నిర్మాణంలో మార్పులు తీసుకువచ్చారు. అయితే ఈ పరిశోధనపై మాత్రమే ఆధారపడకూడదని చాలా మంది వైద్యులు అంటున్నారు. మానవ శరీరంపై ఈ పరిశోధన జరిగే వరకు, మరిన్ని పరీక్షల తర్వాత మాత్రమే అంచనాకు రావాలంటున్నారు.
కిడ్నీలు దెబ్బతినడానికి ప్రధాన కారణాలు ఇవే
మధుమేహం, అధిక రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యల వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. ఈ వ్యాధుల వల్ల కిడ్నీలలోని రక్త నాళాలు పాడవుతాయి. దీనివల్ల కిడ్నీలు శరీరంలోని టాక్సిన్‌లను సరిగ్గా ఫిల్టర్ చేయలేవు. అధిక రక్తపోటులో ఈ రక్త నాళాలపై చాలా ఒత్తిడి ఉంటుంది. దీనివల్ల కొంతకాలం తర్వాత అవి దెబ్బతింటాయి. దీనితో పాటు పెయిన్‌కిల్లర్‌లను తీసుకోవడం, శరీరంలో నీటి కొరత, శరీరంలో పదేపదే ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలను తీసుకోవడం వల్ల కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంది.
కిడ్నీలు దెబ్బతినడానికి ప్రారంభ లక్షణాలు
శరీరంలో కిడ్నీ వ్యాధులు రాకముందే శరీరంలో అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి. కానీ ప్రజలు వాటిని విస్మరిస్తారు. దీని కారణంగా తరువాత చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మీకు తరచుగా అలసట అనిపిస్తే, కాళ్లు లేదా కళ్లలో వాపు రావడం, మూత్రం రంగులో మార్పు రావడం, రాత్రి సమయంలో తరచుగా మూత్రం రావడం కిడ్నీలు దెబ్బతినడానికి ప్రారంభ లక్షణాలు. అంతేకాకుండా ఆకలి తగ్గడం, వెన్నునొప్పి, కిడ్నీల దగ్గర నొప్పి ఉంటే తేలికగా తీసుకోవద్దని నిపుణులు చెప్తున్నారు. వెంటనే వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు. కొన్నిసార్లు శరీరంపై దురద లేదా పొడిబారడం వంటి సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.
కిడ్నీలు దెబ్బతినకుండా నిరోధించే సహజ మార్గాలు
మీ శరీరం, మనస్సుపై ఒత్తిడిని తగ్గించుకోండి. శరీరంలో నీటి కొరత రాకుండా చూసుకోవాలి. డీహైడ్రేషన్ కూడా కిడ్నీలను డ్యామేజ్ చేస్తుంది. ఎక్కువ ఉప్పు, ఎక్కువ తీపి తీసుకోకూడదు. బయట వేయించిన ఆహారాలకు దూరంగా ఉండండి. పెయిన్‌కిల్లర్‌లను పదేపదే తీసుకోకూడదు. దీనితో పాటు వ్యాయామం చేస్తూ ఉండాలి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.






















