Weight Loss Dangers : బరువు తగ్గాలనుకుని ICU పాలైన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్.. మీరూ ఈ తప్పు చేస్తున్నారా?
Life-Threatening Diet : బరువు తగ్గాలనే ఉద్దేశంతో ఓ యువతి కఠినమైన డైట్ ఫాలో అయింది. ఆమె అనుకున్నట్లు బరువు తగ్గింది కానీ ఆరోగ్య సమస్యలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఇంతకీ ఆమె ఏమి చేసిందంటే..

Weight Loss Goal to ICU : బరువు తగ్గడానికి సమతుల్య ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. కానీ త్వరగా బరువు తగ్గిపోవాలనే ఉద్దేశంతో ఫాలో అయ్యే డైట్స్ శరీరానికి కావాల్సిన పోషకాలు అందించవు. దీనివల్ల బరువు తగ్గడం అటుంచి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. చైనాలోని 25 ఏళ్ల సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్.. సన్నబడాలనే కోరికతో చాలా కఠినమైన డైట్ పాటించింది. అది ఆమె ప్రాణాలకే ప్రమాదకరంగా మారింది. ఎక్కువకాలం ఒకే రకమైన, కొవ్వు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఆమె తీవ్రమైన అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
6 నెలల పాటు అవే తిన్నది.. అదే తప్పు
చైనీస్ మీడియా నివేదికల ప్రకారం.. ఈ యువతి గత ఆరు నెలలుగా తన ఆహారాన్ని ఉడికించిన చికెన్ బ్రెస్ట్, కూరగాయలకు మాత్రమే పరిమితం(Boiled Vegetables and Chicken Breast for Six Month) చేసింది. అప్పుడప్పుడు రుచి మార్చడానికి.. ఆమె ఆహారంలో కొద్దిగా ఉడికించిన బంగాళాదుంపను చేర్చుకునేది. బరువు తగ్గడానికి తన ప్రయాణాన్ని ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. ఆమె ఫాలోవర్లు ఆమె క్రమశిక్షణకు ఎంతగానో ప్రభావితమై.. ఆమెను "సెల్ఫ్-డిసిప్లైన్ దేవత" అని కూడా పిలిచారు.
ఈ కఠినమైన డైట్ వల్ల యువతి బరువు తగ్గింది. కానీ అదే సమయంలో ఆమె శరీరంపై దాని దుష్ప్రభావాలు కూడా కనిపించడం మొదలయ్యాయి. దీంతో ఆమె నిరంతరం అలసట, బలహీనత, ముఖం రంగు మారడం వంటి సమస్యలతో బాధపడుతోంది. అయినప్పటికీ, ఆమె ఈ సంకేతాలను పట్టించుకోకుండా తన డైట్‌ను కొనసాగించింది.
బయటపడిన ప్రాణాంతక వ్యాధి
కొంతకాలం తర్వాత ఆమె ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. కడుపులో భరించలేని నొప్పి రావడం ప్రారంభించింది. ఆ తర్వాత ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చేసిన పరీక్షలలో ఆమె శరీరంలో సీరం అమైలేజ్ స్థాయి సాధారణం కంటే సుమారు 10 రెట్లు పెరిగినట్లు తేలింది. అమైలేజ్ అనేది జీర్ణక్రియకు సహాయపడే ఒక ఎంజైమ్. ఇది ప్యాంక్రియాస్ నుంచి వస్తుంది. ఈ ఎంజైమ్ అసాధారణంగా పేరుకుపోవడం వల్ల ప్యాంక్రియాస్‌లో వాపు వచ్చిందని.. దానివల్ల ఆ అవయవం తనను తాను దెబ్బతీసుకోవడం ప్రారంభించిందని వైద్యులు తెలిపారు. దీనివల్ల యువతికి తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్ (Acute Pancreatitis) వచ్చింది. ఇది తీవ్రమైన, ప్రాణాంతక వ్యాధిగా చెప్తారు.
ఇలాంటి డైట్ ప్రమాదకరం
ఎక్కువ కాలం లో ఫ్యాట్, ఒకేలాంటి డైట్ ఫాలో అవ్వడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. చికెన్ బ్రెస్ట్, కూరగాయలు వంటివి ఆరోగ్యకరమైనవిగా చెప్పినప్పటికీ.. అవి శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను అందించలేవని నిపుణులు స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం యువతికి చికిత్స కొనసాగుతోందని, ఆమె పరిస్థితి ఇప్పుడు సాధారణ స్థితికి వస్తోందని చెబుతున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో.. వినియోగదారులు కూడా ఒకే డైట్‌ను పాటించడం ప్రమాదకరమని.. శరీరానికి ప్రతి పోషకం అవసరమంటూ వీడియోలు చేస్తున్నారు.
కాబట్టి సోషల్ మీడియాలో లేదా ఏ ఇతర ప్లాట్ ఫారమ్‌లో చూసిన డైట్లను ఫాలో అవ్వకుండా బరువు తగ్గాలనుకుంటే మీరు కచ్చితంగా ఆరోగ్య నిపుణుల సలహాలు తీసుకోవాలి. శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందించాల్సి ఉంటుంది. మీరు తీసుకునే ఫుడ్ రూపంలో అవి చేర్చకపోతే సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. బరువు తగ్గేప్పుడు కేవలం ఫుడ్ మీదనే కాకుండా వ్యాయామం కూడా చేయాలి. అప్పుడు హెల్తీగా బరువు తగ్గుతారు. మీరు బరువు తగ్గడం ప్రారంభించినప్పుడు హెల్త్ టెస్ట్‌లు చేయించుకుంటే.. శరీరంలో ఏమేమి జరుగుతున్నాయో తెలుసుకుని దానికి అనుగుణంగా డైట్ మార్చుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.






















