(Source: ECI/ABP News/ABP Majha)
Revanth Reddy : అమెరికా పర్యటన ముగించుకొని దక్షిణ కొరియాలో అడుగు పెట్టిన రేవంత్ బృందం- హైదరాబాద్‌లో పర్యటించేందుకు LS కార్పొరేషన్ అంగీకారం
Telangana: అమెరికా పర్యటన ముగించుకొని కొరియాలో అడుగు పెట్టిన రేవంత్ బృందం LS కార్పొరేషన్‌తో చర్చలు జరిపింది. వాళ్లు హైదరాబాద్‌లో పర్యటించేందుకు ఓకే చెప్పినట్టు సీఎం తెలియజేశారు.
Revanth Reddy Tour In South Korea : అమెరికాలో పర్యటించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు దక్షిణకొరియాలో పెట్టుబడుల అన్వేషణలో పడ్డారు. అమెరికా పర్యటన విజయవంతమైందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. దాదాపు 30వేల కోట్లకుపైగా పెట్టుబడులు తెలంగాణలో పెట్టేందుకు వివిధ సంస్థల ప్రతినిధులు అంగీకారం తెలిపారని అంటున్నారు. అమెరికా పారిశ్రామికవేత్తలను ఆకర్షించడంలో రేవంత్ విజయవంతమయ్యారని అంటున్నారు.
ప్రస్తుతం దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి కొరియన్ పర్యటన చాలా సానుకూలంగా ప్రారంభమైందని ట్వీట్ చేశారు. LG గ్రూప్‌లో భాగమైన LS కార్పొరేషన్‌తో చర్చలు ప్రారంభించామన్నారు. ఎల్‌ఎస్ గ్రూప్ ఛైర్మన్ మిస్టర్ కూ జా యున్ ప్రతినిధుల బృందంతో సమావేశమైనట్టు వెల్లడించారు. తెలంగాణలో ఎలక్ట్రిక్ కేబుల్స్, గ్యాస్, ఎనర్జీ, బ్యాటరీల తయారీ పెట్టుబడులు సహా వివిధ అంశాలపై మాట్లాడుకున్నట్టు తెలిపారు. తన ఆహ్వానం మేరకు LS బృందం త్వరలో రాష్ట్రానికి రానుందన్నారు. రాబోయే రోజుల్లో వారిని పెట్టుబడిదారుగా స్వాగతించబోతున్నామని అన్నారు రేవంత్ రెడ్డి.
Good morning from Korea. Delighted to share with all of you that our Korean tour started off on a very positive note. We started our day with wide ranging conversations with one of Korea’s biggest industrial conglomerates - the LS Corp, which was formerly a part of the LG group.… pic.twitter.com/MlrgpiSk5g
— Telangana CMO (@TelanganaCMO) August 12, 2024
ప్రపంచంలోనే అగ్రశ్రేణి సంస్థలుగా ఉన్న వారంతా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంటోంది. అమెరికా వేదికగా తెలంగాణను ఫ్యూచర్ స్టేట్‌గా రేవంత్ ప్రకటించడం, కొత్త నిర్మించబోయే నగరం ఏలా ఉంటుందో చెప్పడం కూడా పర్యటన విజయవంతమవడానికి కారణమయ్యాయి అంటున్నారు. అందుకే 31532 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు దాదాపు 19లతో అవగాహన ఒప్పందాలు చేసుకున్నట్టు చెబుతున్నారు. ఈ కంపెనీలు లైవ్‌లోకి వస్తే దాదాపు 30వేలకుపైగా ఉద్యోగాలు లభించనున్నాయని అంటున్నారు.
ఈ నెల 3వ తేదీన పారిశ్రమికమంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లారు. వారం రోజుల పాటు అక్కడ పర్యటించారు. దాదాపు యాభైకిపైగా బిజినెస్ మీటింగ్స్, 3 రౌండ్ టేబుల్ మీటింగ్స్‌లో పాల్గొన్నారు. అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ ఎలక్ట్రానిక్ రంగాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. వారితో ఎక్కువ మంతనాలు జరిపారు.
హైదరాబాద్‌లో కొత్త నిర్మించబోయే నగరాన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి పర్యటన సాగింది. ప్రపంచంలో అగ్రశ్రేణి సంస్థళైన కాగ్నిజెంట్, చార్లెస్ స్క్వాబ్, ఆర్సీసియం కార్నింగ్, ఆమ్జెన్, జొయిటిస్, హెచ్సీఏ హెల్త్ కేర్, వివింట్ ఫార్మా, థర్మో ఫిసర్, ఆరమ్ ఈక్విటీ, ట్రైజిన్ టెక్నాలజీస్, మోనార్క్ ట్రాక్టర్ కంపెనీలు తమ విస్తరణ ప్రాజెక్టులను తెలంగాణలో పెట్టేందుకు ఆసక్తి చూపించాయి. అమెజాన్ కూడా తమ డేటా సెంటర్ విస్తరణకు ఓకే చెప్పింది. ఈ సంస్థలే కాకుండా యాపిల్, గూగుల్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో కూడా రేవంత్ బృందం చర్చలు జరిపింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ అమెరికా పర్యటనపై ఆనందం వ్యక్తం చేశారు. టాప్ క్లాస్ కంపెనీలతో చర్చలు జరిపామని వారంతా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపారని అన్నారు. స్కిల్ యూనివర్సిటీ, ఫ్యూచర్ సిటీ ఏర్పాటుకు అమెరికా పారిశ్రామికవేత్తల నుంచి భారీ మద్దతు లభించిందని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి దోహదపడేలా ప్రపంచంలోనే టాప్ కంపెనీలు తరలి వస్తామని చెప్పడం మంచి పరిణామం అన్నారు.
తెలంగాణను అమెరికా పారిశ్రామికవేత్తలకు సరికొత్తగా పరిచయం చేశామన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అనుకూల అంశాలను భవిష్యత్‌లో చేపట్టబోయే ప్రాజెక్టుల గురించి తెలియజేశామని అన్నారు. ప్రభుత్వానికి సహకరించేందుకు అంతా ముందుకు వచ్చారని పేర్కొన్నారు.
పారిశ్రామిక వేత్తలతోపాటు తెలంగాణ నుంచి వెళ్లి అమెరికాలో సెటిల్ అయిన తెలుగు వారిని కూడా రేవంత్ రెడ్డి బృందం పలకరించింది. వారితో కూడా చర్చించి పెట్టుబడులు వచ్చేలా చేయాల్సిన ప్రయత్నాలు వివరించింది. వారి అనుమానాలు, వారి ఆలోచనలు తెలుసుకున్న రేవంత్ బృందం రేపు సరికొత్త పారిశ్రామిక విధానం చూస్తారంటూ మాట ఇచ్చింది.