Sigachi Incident : సిగాచి విషాదం: 8 మంది బూడిద, కుటుంబాలకు తీరని శోకం! పరిహారం, నివేదికపై తాజా అప్డేట్!
Sigachi Incident : సిగాచి ప్రమాదంలో కనిపించకుండా పోయిన 8మంది ఆచూకీ లభించడం కష్టమని అధికారులు తేల్చేశారు. కనీసం దహన సంస్కారాలకు ఎముకలు కూడా ఇవ్వలేమని ప్రకటించారు.

Sigachi Incident : తెలంగాణలోని పాశమైలారం పారిశ్రామికవాడలో సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాద ఘటనలో అధికారులు కీలక ప్రకటన చేశారు. దుర్ఘటన జరిగినప్పటి నుంచి అదృశ్యమైన వారిని చనిపోయిన జాబితాలో చేర్చారు. వారి కుటుంబాలకు విషయాన్ని చేరవేశారు. వారి ఆనవాళ్లు ప్రమాద స్థలంలో లేకపోవడంతో వారంతా కాలి బూడిదైపోయినట్టు తేల్చారు.
సంగారెడ్డి జిల్లా సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగి పది రోజులు అయ్యింది. ఈ దుర్ఘటనలో 44 మంది మరణించారు. కానీ ఇంకో ఎనిమిది మంది ఆచూకి మాత్రం లభించలేదు. వారి కోసం గాలింపు చేపట్టారు. ఫ్యాక్టరీలో అణువణువూ గాలించారు. మృతులకు సంబంధించిన డీఎన్ఏ వివరాలు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(CFSL)లో ఉన్నాయి. ఇన్ని చేసినప్పటికీ రాహుల్, వెంకటేష్, శివాజీ, విజయ్, జస్టిన్, అఖిలేష్, రవి, ఇర్ఫాన్ గురించి ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వారిని కూడా చనిపోయిన వారి జాబితాలో చేర్చారు.
బుధవారం అధికారులు ప్రకటించిన వివరాల ప్రకారం చనిపోయిన వారి సంఖ్య 52కి చేరింది. కనిపించకుండా పోయిన 8 మందిని కూడా మృతుల జాబితాలో చేర్చారు. వారికి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. వారి బంధువులతో మాట్లాడారు. జూన్ 30న జరిగిన ప్రమాదంలో వారి ఆనవాళ్లు పూర్తిగా నాశమైనట్టు తేల్చారు. కనీసం డీఎన్ఏ టెస్టులకు కూడా ఏమీ మిగల్లేదని కుటుంబ సభ్యులకు చెప్పేశారు.
సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంలో కనిపించకుండా పోయిన 8 మంది పూర్తిగా కాలిబుడిదైపోయినట్టు సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ వెల్లడించారు. ఆయా కుటుంబాలతో మాట్లాడి తక్షణ సాయం కింద 15 లక్షలు అందజేయాలని నిర్ణయించారు. మిగతా ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేస్తామని వారికి వివరించారు. ప్రమాదం గురించి తెలుసుకున్నప్పటి నుంచి బాధిత కుటుంబాలు స్పాట్‌లోనే ఉన్నారు. ఏ క్షణం తమ వారి ఆచూకీ తెలుస్తుందని ఎదురు చూశారు. కానీ వారి ఎముకలు కూడా ఇవ్వలేమని అధికారులు చేతులెత్తేశారు.
మూడు నెలల తర్వాత అందర్నీ పిలిచి మరణ ధ్రువీకరణ పత్రాలు, ఎక్స్‌గ్రేషియో ఇస్తామని అధికారులు తెలిపారు. విచారణ ఇంకా కొనసాగుతుందని వారికి సంబంధించిన ఎలాంటి సమాచారం దొరికినా కచ్చితంగా తెలియజేస్తామని అన్నారు. సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరుగుతున్న టైంలో 140మందికిపైగా పని చేస్తున్నారు. ప్రమాదం నుంచి 60 మంది సురక్షితంగా బయటపట్టారు. 52 మంది మరణించగా 30 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడులో మరణించిన వారికి ఆ సంస్థ కోటి రూపాయలు పరిహారం ప్రకటించింది. క్షతగాత్రులకు పది లక్షల నుంచి 5 లక్షల వరకు ఎక్స్‌గ్రేషియో ఇస్తామని తెలిపింది. మరోవైపు ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు లక్ష రూపాయలు, క్షతగాత్రులకు 50వేల పరిహారం తక్షణ సాయం కింద అందజేసింది.
సిగాచిలో ప్రమాదంపై రకరకాల వాదనలు వినిపించాయి. అందుకే దీనిపై నిజాలు నిగ్గుతేల్చేందుకు ప్రభుత్వం నిపుణుల కమిటీ వేసింది. ఈ కమిటీ ఇప్పటికే ఫ్యాక్టరీలో పర్యటించింది. అక్కడ పని చేసే సిబ్బందితో మాట్లాడుతోంది. క్షతగాత్రులు ఇతరులతో కూడా చర్చిస్తోంది. దీనిపై స్టడీ చేస్తున్న కమిటీ మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వబోతోంది. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చేపట్టాల్సిన చర్యల గురించి కూడా సూచనలు సలహాలు ఇవ్వనుందీ కమిటీ





















