Priyanka Gandhi Hyderabad tour: కాసేపట్లో హైదరాబాద్‌కు ప్రియాంక, సరూర్‌నగర్ స్టేడియంలో యువ సంఘర్షణ సభకు హాజరు
Priyanka Gandhi Hyderabad tour: హైదరాబాద్ లోని సరూర్ నగర్ స్టేడియంలో జరగనున్న యువ సంఘర్షణ సభకు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Priyanka Gandhi Hyderabad tour: హైదరాబాద్ లోని సరూర్ నగర్ స్టేడియంలో జరగనున్న యువ సంఘర్షణ సభకు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు. రానున్న ఎన్నికల్లో యువతను ఆకట్టుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర కాంగ్రెస్ ఈ సాయంత్రం జరగనున్న సభలో యూత్ మేనిఫెస్టో ప్రకటించనుంది. గతేడాది వరంగల్ లో నిర్వహించిన సభలో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఇవాళ జరగనున్న సభలో ప్రియాంకా గాంధీ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ను ప్రకటించనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి వంటివి ప్రకటించనున్నారు.
ట్రాఫిక్ మళ్లింపు...
కర్ణాటక నుంచి సోమవారం సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి వస్తారు. అక్కడి నుంచి బయల‌్దేరి 4.45 గంటలకు సరూర్ నగర్ స్టేడియానికి చేరుకుంటారు. 5.45 గంటల వరకు సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత నేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని.. 6.30 సమయంలో ఢిల్లీకి బయలు దేరుతారని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి.
వేలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి సాయంత్రం 4 గంటలకు ఎల్బీనగర్ శ్రీకాంతాచారి విగ్రహం నుంచి సరూర్ నగర్ స్టేడియం వరకు నిరుద్యోగ జంగ్ సైరన్ ర్యాలీ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కాంగ్రెస్ ముఖ్య నాయకులు అంతా ఈ ర్యాలీలో పాల్గొంటారు. ఈ ర్యాలీ మేరకు అలాగే సరూర్ నగర్ లో జరగనున్న సభ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సరూర్ నగర్, ఎల్బీ నగర్ పరిసరాల్లో మధ్యాహ్నం 2 నుండి రాత్రి 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. విజయవాడ హైవే, సాగర్ రోడ్డు నుంచి వచ్చే వాహనాలను చంపాపేట వైపు, నాగోల్ వైపు మళ్లించనున్నారు. దిల్‌సుఖ్‌నగర్ నుంచి వచ్చే వాహనాలను చైతన్యపురి సిగ్నల్ నుండి నాగోల్ వైపు మళ్లిస్తారు.
నిరుద్యోగులకు, యువతకు హామీల వెల్లువ
చదువుకున్న అందరికీ వారి వారి విద్యార్హతల మేరకు ఉపాధి కల్పిస్తామనే హామీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య నిరుద్యోగులు 60 లక్షల మంది ఉంటారని అంచనా. అందులో దాదాపు 25 లక్షల మంది పట్టభద్రులు. వారి కోసం ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి వంటివి ఇస్తామని యూత్ డిక్లరేషన్ లో హామీ ఇచ్చే అవకాశం ఉంది. యూపీఎస్సీ తరహాలోనే టీఎస్పీఎస్సీని బలోపేతం చేసి అక్రమాలకు తావులేకుండా చూస్తామని, ఏటా జాబ్ కాలెండర్ ను ప్రకటిస్తామని భరోసా కల్పించనున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు టెలీ కమ్యూనికేషన్స్ మాజీ ఇంజినీర్ శ్యామ్ పిట్రోడా నేతృత్వంలో ఏర్పాటు చేసిన నాలెడ్జ్ సొసైటీ అధ్యయన నివేదిక మేరకు.. విద్య, ఉపాధి రంగాల్లో రాష్ట్ర యువతకు పలు వరాలు ప్రకటించే అవకాశం ఉంది. ఉపాధి కల్పనతో పాటు విద్యా రంగంలో భరోసా కల్పించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీల తరహాలో బీసీ, ఈబీసీలకు పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్ మెంట్ అమలు చేస్తామని, ప్రతి ఉమ్మడి జిల్లాలో ఐఐటీ ఏర్పాటు కృషి చేస్తామని రాష్ట్ర కాంగ్రెస్ ప్రకటించనుంది.