Telangana Ration Card News: తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం- వీళ్లకు రేషన్ కట్
Telangana Latest News: ఆరు నెలలుగా రేషన్ తీసుకోని వారిని లబ్ధిదారుల జాబితా నుంచి తప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది.

Telangana Latest News: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుల విషయంలో పారదర్శకత పెంచి అనుమానాస్పద లబ్ధిదారులను తప్పించాలని చూస్తోంది. దీని కోసం ఇప్పటికే క్షేత్రస్థాయి సర్వే చేపట్టింది. వాటి ఆధారంగా కొందరు లబ్ధిదారుల నుంచి తప్పించాలని నిర్ణయానికి వచ్చింది.
రేషన్ కార్డు లబ్ధిదారుల్లో చాలా మందికి ప్రభుత్వం ఇచ్చే రేషన్ కంటే దాని వల్ల వచ్చే ఇత ప్రయోజనాల కోసమే చూస్తుంటారు. అందుకే అలాంటి వారు రేషన్ కార్డు తీసుకున్నా రేషన్ సరకులు మాత్రం తీసుకోరు. కార్డును బేస్ చేసుకొని ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాలు అంటే ఆరోగ్యశ్రీ లాంటి వాటి నుంచి లబ్ధి పొందుతుంటారు.
ఇలా ఆరు నెలలుగా రేషన్ తీసుకోని జాబితాను కేంద్రం గుర్తించి తెలంగాణ ప్రభుత్వానికి పంపించింది. ఈలిస్ట్‌ను రాష్ట్రప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపించింది. రాష్ట్రవ్యాప్తంగా 76 వేల మందికిపైగా ఆరు నెలలుగా రేషన్ తీసుకోవడం లేదని తేలింది. ఇలాంటి సమస్యలు ఉన్న వారు ఎక్కువమంది హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మేడ్చల్ జిల్లాల్లోనే ఉన్నారు.
ఈ లిస్టులో ఉన్న వారిపై స్థానిక అధికారులు విచారణ చేపట్టారు. ఫైనల్ జాబితాను జిల్లా అధికార యంత్రాంగానికి ఇచ్చారు. ఇప్పుడు పూర్తి జాబితా పౌరసరఫరాల అధికారుల వద్ద ఉంది. ఆరు నెలలుగా రేషన్ ఎందుకు తీసుకోవడం లేదు. ఇక్కడే ఉన్నారా లేకుంటే వేరే ప్రాంతాల్లో ఉంటున్నారా... సమస్య ఎక్కడ ఉందనే విషయాలపై ఆరా తీస్తారు. అసలు రేషన్ కార్డు పొందేందుకు వాళ్లు అర్హులేనా లేకుంటే అనర్హులా అనేది తేల్చారు. క్షేత్రస్థాయిలో విచారణ పూర్తి అయిన తర్వాత పై నుంచి వచ్చిన జాబితాను స్క్రూట్నీ చేశారు.
క్షేత్రస్థాయిలో విచారణ తర్వాత వచ్చిన ఫైనల్ జాబితా ఆధారంగా పౌరుసరఫరా అధికారులు చర్యలు తీసుకుంటారు. వారికి ఇస్తున్న రేషన్‌ను కొద్ది రోజుల్లోనే ఆపేస్తారు. ఇప్పుడు గుర్తించిన లిస్ట్‌లో చాలా వరకు డబుల్ ఎంట్రీ ఉందని, చనిపోయిన వాళ్లు, వలస వెళ్లిపోయిన వాళ్లు కూడా ఉన్నట్టు గుర్తించారు.





















