KCR: సినిమాల్లో తెలంగాణ యాస ఉంటేనే హీరో క్లిక్ అవుతున్నడు, అప్పట్లో అడిగే దిక్కులేదు - కేసీఆర్
KCR In Assembly: భారీ ఉద్యోగాల ప్రకటన సందర్భంగా బుధవారం (మార్చి 9) అసెంబ్లీలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పండుగలు, సంస్కృతికి ఎనలేని ప్రాధాన్యం పెరిగిందని గుర్తు చేశారు.
Telangana Assembly: తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇక్కడి యాసకు, సంస్కృతికి ఎనలేని ప్రాధాన్యం పెరిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇప్పుడు సినిమాల్లో తెలంగాణ యాస పెడితేనే హీరో క్లిక్ అవుతున్నాడని గుర్తు చేశారు. ఒకప్పుడు జోకర్లకు తెలంగాణ భాష ఉండేదని, ఇప్పుడు యాసకు ఎనలేని గుర్తింపు దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు భారీ ఉద్యోగాల ప్రకటన సందర్భంగా బుధవారం (మార్చి 9) అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పండుగలకు, సంస్కృతికి ఎనలేని ప్రాధాన్యం పెరిగిందని గుర్తు చేశారు.
‘‘మేం చేసే పనిలో మా ఏకాగ్రతను దెబ్బ తీసే డిట్రాక్టర్స్ ఉన్నారు. మా లక్ష్యం దెబ్బతినవద్దని మేం సంయమనంగా ఉంటున్నాం. ప్రజలు వారి గుండె కోసి మా చేతుల్లో పెట్టిన్రు కాబట్టి, బాధ్యతగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నం. అందులో సఫలం చెందాం. ఉద్యమం సమయంలో ప్రధానంగా నీళ్లు - నిధులు - నియామకాలు లక్ష్యంగా పోరాటం సాగింది. అవే కాక, తెలంగాణ అస్తిత్వం, సంస్కృతి, భాషా పరిరక్షణ వంటివి కూడా ఉన్నాయి.’’
‘‘తెలంగాణ వచ్చాక భాషా పరిరక్షణ జరిగింది. తెలంగాణ భాష పెడితేనే తెలుగు సినిమాలల్లో హీరో క్లిక్ అయితున్నడు. ఒకప్పుడు జోకర్లకు పెట్టిన్రు. తెలంగాణ సంస్కృతి, బతుకమ్మ, బోనాలు, పోచమ్మ ఎంత వైభవంగా జరుపుకుంటున్నం ఇప్పుడు. ఆ వేడుకల కోసం ఇంకా ఎక్కువ నిధులు అడిగేవాళ్లు. తెలంగాణ పండుగలు, రాష్ట్ర వైభవం అప్పట్లో ఎక్కడిది. ఎవరైనా అడిగితే మాట్లాడే దిక్కులేదు. సేవాలాల్ మహారాజ్ జయంతి, సమ్మక్క సారలమ్మ జయంతిని ఈరోజు మనం అధికారికంగా జరుపుకుంటున్నం. ఎన్నో పండుగులను వైభవంగా జరుపుకుంటున్నం’’ అని అన్నారు.
నిరుద్యోగుల కల నెరవేర్చిన కేసీఆర్
నిరుద్యోగులకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ ఉద్యోగుల విభజన జరిగిన తర్వాత 91,142 ఖాళీలు ఏర్పడ్డాయని.. వీటిని వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. అంతేకాక, మరో 11,103 వేల కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 80,039 వివిధ శాఖల్లోని ఉద్యోగాలకు తక్షణం నోటిఫికేషన్ విడుదల చేస్తామని అన్నారు. వీటిలో విద్యాశాఖలోనే 25 నుంచి 30 వేల ఉద్యోగాలు ఉన్నట్లు చెప్పారు. ఇకపై తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగాలు ఉండబోవని స్పష్టం చేశారు. ఇకపై ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుందని వెల్లడించారు.
అంతులేని వివక్షతో తెలంగాణ ఎన్నో ఇబ్బందులు పడిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ అన్నారు. 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకూ ఇదే పరిస్థితి కొనసాగిందని అన్నారు. తెలంగాణ రైతులను కూడా పూర్తిగా పాతాళంలోకి నెట్టేశారని గుర్తు చేశారు. ఎన్నో ఆకలి చావులు, నిరుద్యోగులు, రైతుల మరణాలు చూశామని వెల్లడించారు. తెలంగాణ తనను తాను నిర్వచించుకోవాలనే ఉద్దేశంతో తాను ఉద్యమానికి శ్రీకారం చుట్టానని అన్నారు. విద్యార్థులు కూడా ఎంతో మంది తెలంగాణ కోసం ఉద్యమించారని అన్నారు.