Telangana Latest News: 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
Telangana Latest News: 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లు చర్చ సందర్భంగా కీలకాంశాలను బీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందు ఉంచింది.

Telangana Latest News: తెలంగాణ శాసనసభ కీలక బిల్లులను ఇవాళ(17 మార్చి 2025) ఆమోదించింది. అన్నింటిలో ముఖ్యమైంది బీసీ రిజర్వేషన్ బిల్లు. దీంతో ఇప్పుడు ఈ బిల్లును కేంద్రానికి పంపించనున్నారు. అక్కడ ఆమోదం కోసం పార్టీలన్నీ ఐక్యంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రభుత్వం కోరింది. దీనికి బీఆర్‌ఎస్ ఓకే చెప్పింది.
ఎప్పటి నుంచే పెద్ద చర్చకు దారి తీసిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు సభ ముందుకు ప్రభుత్వం ఇవాళ (17 మార్చి 2025) తీసుకొచ్చింది. తీసుకొచ్చింది. బీసీ రిజర్వేషన్ బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ పెడితే... ఎస్సీ వర్గీకరణ బిల్లును మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రవేశ పెట్టారు.
బిల్లు ప్రవేశ పెట్టే సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఇదో చారిత్రాత్మక ముందడుగుగా అభివర్ణించారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా కులగణన చేపట్టి రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశంతో పక్కా లెక్కలతో సభ ముందుకు బిల్లు తీసుకొచ్చామని వివరించారు. అన్ని పార్టీలు దీన్ని ఉద్దేశాన్ని గ్రహించి బిల్లుకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఈ బిల్లు సందర్భంగా మాట్లాడిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే బాధ్యత అన్ని పార్టీలు తీసుకోవాలని సూచించారు. దీన్నో రాజకీయ ఎత్తుగడగా ప్రభుత్వం చూడొద్దని సూచించారు. తమిళనాడు స్ఫూర్తితో పార్టీలను ప్రభుత్వం ముందుండి నడిపించాలని అన్నారు.
శాసనసభలో ప్రవేశ పెట్టిన బీసీ బిల్లుపై మాజీ మంత్రి హరీష్ రావు కూడా మాట్లాడారు. పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టిన బీసీ బిల్లును బీఆర్ఎస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్టు తెలిపారు. చట్టం వచ్చే వరకు అన్ని విధాలుగా మద్దతు ఉంటుందని తేల్చి చెప్పారు. విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చినప్పుడే ఆ వర్గాలు నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతాయన్నారు. స్థానిక సంస్థల్లో, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 42 శాతం రిజర్వేషన్ ఫలితాలు అందినప్పుడు సంతోషపడతాయని అభిప్రాయపడ్డారు. ఆ ఫలితాలు వారికి అందాలని ఆకాంక్షించారు.
కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మార్కెట్ కమిటీ ఛైర్మన్‌లో డైరెక్టర్లలో బీసీలకు 50%రిజర్వేషన్ తెచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ కృషి చేసిందన్నారు. మొట్టమొదటిసారి దేశంలో ఎక్కడాలేని విధంగా గౌడన్నల కోసం మద్యం షాపుల్లో రిజర్వేషన్ తెచ్చింది గుర్తు చేశారు.
రాష్ట్ర శాసనసభలో బీసీ రిజర్వేషన్ బిల్లు ఏర్పాటు చేయడంతోపాటు పార్లమెంటులో పోరాటానికి కూడా బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తుందని హరీష్ ప్రకటించారు. ఈ బిల్లు పాస్ కావాలంటే ప్రతిపక్షంలో 100 మంది ఎంపీలు ఉన్నారని.. దీనిపై రాహుల్ గాంధీ గట్టిగా పూనుకంటే బిల్లు మద్దతు పొందుతుందన్నారు.
మంగళవారం (18 మార్చి 2025)ప్రవేశ పెట్టే బడ్జెట్‌లో మూడు అంశాలను చేర్చాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్‌రావు సూచించారు. బీసీలపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే నిజమైన ప్రేముంటే భేషజాలకు పోకుండా ప్రభుత్వం వాటిని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని మొదటి డిమాండ్ చేశారు. బిల్లులో ఈ అంశం చేర్చడానికి ఢిల్లీ పర్మిషన్ అవసరం లేదన్నారు. ప్రభుత్వం అనుకుంటే మంగళవారం నుంచే రాష్ట్రంలో బీసీలకు 42% కాంట్రాక్టు పనుల్లో అవకాశం లభిస్తుందన్నారు.
బీసీలకు సబ్ ప్లాన్ అమలు చేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని క్యారీ ఫార్వర్డ్ విధానంలో అమలు చేయాలని హితవుపలికారు హరీష్. క్యారీ ఫార్వర్డ్ విధానంలో కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు చేశారని గుర్తు చేశారు. బీసీ బిల్లు ఆమోదం కోసం ఢిల్లీకి సైతం వచ్చి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఆమోదం విషయం పార్లమెంట్ చేతిలో ఉంది కాబట్టి భేషజాలకు పోకుండా ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో బీసీ సబ్ ప్లాన్ చేర్చాలని సూచించారు. బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయలు నిధులు పెట్టాలన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

