Sigachi Incident: నిర్లక్ష్యం ప్రాణాల మీదకు తెచ్చింది! అధికారుల హెచ్చరికలు పట్టించుకోని సిగాచీ యాజమాన్యం?
Sigachi Incident: సిగాచీ పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంపై విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. గతేడాది ఫాక్టరీని సందర్శించి, లోపాలు గుర్తించి, హెచ్చరించినా పట్టించుకోలేదని తేలింది.

Sigachi Incident: అడుగడుగునా నిర్లక్ష్యం, ప్రాణాలు పోతాయంటూ హెచ్చరించినా పట్టించుకోని సిగాచీ పరిశ్రమ యాజమాన్యం. తాజాగా అధికారులు బయటపెట్టిన ఈ నివేదిక సంచలనంగా మారింది. పాశమైలారం సిగాచీలో భారీ పేలుడుతో ఏకంగా 52 మంది కార్మికులు మృతి చెందారు. 16 మంది ఇంకా ఆసుపత్రిలోనే తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఇంతలా తెలంగాణలోనే అతి పెద్ద ఘోర ప్రమాదంగా సిగాచీ బాధితుల కుటుంబాల్లో పెను విషాదం నింపింది.
లోపాలు గతేడాది గుర్తించిన అధికారులు
పేలుడు తీవ్రత ఏ మాత్రం ఊహలకందని స్దాయిలో ఉండటంతో, కారణాలపై ఇన్నాళ్లూ ఓ క్లారిటీ రాలేదు. యాజమాన్యంపై విమర్శలు వెల్లుతెత్తినప్పటికీ సరైన ఆధారాలు లభించలేదు. తాజాగా సిగాచీ పేలుడు గుట్టువిప్పారు ఫ్యాక్టరీస్ భద్రత పర్యవేక్షించే అధికారులు. గత ఏడాది డిసెంబర్ నెల 12వ తేదీన సిగాచీ పరిశ్రమను సందర్శించారు ఇన్సెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు. సిగాచీలో భద్రతాపరమైన లోపాలు గుర్తించారు. కనీస ప్రమాణాలను కూడా పాటించకుండా ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నారని, కార్మికుల ప్రాణాలను ఫణంగా పెట్టి పనిచేయాల్సిన అత్యంత ప్రమాదకర పరిస్దితులు సిగాచీలో ఉన్నాయని గతేడాదే నిర్దారించారు అధికారులు. అగ్ని ప్రమాదం జరిగితే కనీసం కార్మికులు బయటకు తప్పించుకునే మార్గాలు లేవని తేల్చారు.
కనీస భద్రతపై అవగాహన లేదు
ముఖ్యంగా కెమికల్స్ ప్రభావం ఎక్కువగా ఉండి,పేలుడుకు అవకాశం ఉండే గదిలో నిత్యం వందల మంది కార్మికులు పనిచేస్తున్నప్పటికీ , అత్యవరసర పరిస్దితిలో, బ్లాస్ట్ జరిగినప్పుడు కార్మికులు తప్పించుకుని బయటపడే మార్గాలు లేవని తేల్చేశారు. యంత్రాలు నిర్వహణ సక్రమంగా లేవకపోవడం, కాలం చెల్లిన పరికరాలు సైతం వాడటం గుర్తించారు. భారీ పేలుడు సంభవించినప్పుడు కార్మికులకు పర్సనల్ ప్రొటెక్టివ్ పరికరాలు, ఆటోమెటిక్ అగ్నిమాపక పరికరాలు ఇలా చెప్పుకుంటే పోతే కనీసం ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కూడా లేవంటే సిగాచీలో ఎంతటి ప్రమాదకర పరిస్దితిలో కార్మికులు పనిచేస్తున్నారో అర్దం చేసుకోవచ్చు. ఫ్యాక్టరీలో ఇల్యూమినేటెడ్ మార్కింగ్ లేదు. ముఖ్యంగా ఏదైనా ప్రమాదం జరిగితే కార్మికులు ప్రాణాలతో బయటపడేందుకు ఫైర్ ఫైటింగ్ శిక్షణ ఇస్తారు. సిగాచీలో మాత్రం అలా కనీసం కార్మికులకు భద్రతపై అవగాహన కల్పించలేదు.
ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్సెక్టర్ నివేదిక పట్టించుకోని సిగాచి యాజమాన్యం
జీ ప్లస్ టూ గా ఉన్న సిగాచీ పరిశ్రమలో ఎగ్జిట్ మార్గాలు లేకపోవడం వల్లనే కార్మికులు తప్పించుకునే అవకాశం లేక ప్రాణాలు కోల్పోయారనేది తాజాగా వెలుగు చూసిన ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్సెక్టర్ నివేదిక స్పష్టం చేస్తోంది. గత ఏడాది కేవలం తనిఖీలు చేసి ,నివేదిక ఇవ్వడమే కాదు, సిగాచీ యాజమాన్యాన్ని సైతం అధికారులు హెచ్చరించారు. ఇలా ఉండే కార్మికుల ప్రాణాలకు ప్రమాదమని ముందే చెప్పారు. అధికారులు గుర్తించిన భద్రతాపరమైన లోపాలను చూపిస్తూనే, వెంటనే చేపట్టాల్సిన చర్యలను సైతం సిఫార్సు చేశారు.కానీ సిగాచీ యాజమాన్యం మాత్రం అధికారుల సూచనలు లైట్ తీసుకుంది. కార్మికుల ప్రాణాలు పోతాయని తెలిసి కూడా ఏం పట్టనట్లుగా వ్యవహరించింది. కార్మికుల కుటుంబాల అంతులేని రోదనకు కారణమైయ్యింది.
గత ఏడాది ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్సెక్టర్ నివేదికను సిగాచీ యాజమాన్యం సీరియస్ గా తీసుకుంటే ఇంతటి ఘోర ప్రమాదం జరిగేది కాదంటూ బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సిగాచీ ప్రమాదం ప్రాంతాన్ని పరిశీలించిన జాతీయ విపత్తు నిర్వహణ బృందం సైతం ఇదే అంశాన్ని స్పష్టం చేస్తూ , యాజమాన్యంపై సీరియస్ అయ్యింది. ఇలా ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న వాస్తవాలు సిగాచీ అంతులేని నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేస్తున్నాయి.





















