Hanumakonda Additional Collector : ఏసీబీకి చిక్కిన అడిషనల్ కలెక్టర్ - రైతుల సంబరాలు - ఇంతగా కాల్చుకుతిన్నారా?
Corrupt Collector: రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి. దీంతో రైతులంతా సంబరాలు చేసుకున్నారు.

Additional Collector caught by ACB: హనుమకొండ జిల్లాలోని దామెరకు చెందిన నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే రైతులు హనుమకొండ కలెక్టరేట్ ఎదుట బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. దీనికి కారమం తమను పట్టి పీడిస్తున్న అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకోవడమే. రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డికి రైతుల ఉసురు తగిలిందని గ్రీన్ ఫీల్డ్ హైవే రైతులు పేర్కొన్నారు. తమ భూములకు సరైన పరిహారం అందజేయకుండా అడ్డుకున్న వెంకట్ రెడ్డి ఏసీబీకి చిక్కడం సంతోషంగా ఉందన్నారు.
కలెక్టరేట్‌లోనే లంచం తీసుకున్న అడిషనల్ కలెక్టర్
తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ అధికారులు హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా, జిల్లా ఇన్‌చార్జ్ డీఈవోగా పనిచేస్తున్న వెంకట్ రెడ్డిని రూ.60 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్‌లో జరిగింది. ఆయనతో పాటు జూనియర్ అసిస్టెంట్ మనోజ్‌ను కూడా అరెస్టు చేసిన ఏసీబీ, కలెక్టరేట్‌లో దాడులు చేసి ప్రాథమిక పరిశోధనలు పూర్తి చేసింది. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది, ఎందుకంటే కలెక్టర్ స్థాయి అధికారి అలాంటి అవినీతిలో చిక్కడం అరుదు.
హనుమకొండ జిల్లా కొత్తూరు లోని ఒక ప్రైవేట్ హైస్కూల్ అనుమతి పునరుద్ధరణ కోసం సంస్థ నిర్వాహకులు వెంకట్ రెడ్డిని సంప్రదించారు. ఈ ప్రక్రియలో వేగంగా పని చేయాలని, అడ్డంకులు లేకుండా అనుమతి ఇవ్వాలని కోరుకున్నారు. అయితే, వెంకట్ రెడ్డి రూ.60 వేల లంచం డిమాండ్ చేశాడు. ఈ డిమాండ్‌పై సంస్థ నిర్వాహకులు ఏసీబీకి కంప్లైంట్ చేశారు. ఈ కంప్లైంట్ ఆధారంగా ఏసీబీ DSP సాంబయ్య ఆధ్వర్యంలో ట్రాప్ వేసి, శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లోనే లంచం స్వీకరిస్తుండగా వెంకట్ రెడ్డిని పట్టుకున్నారు. ఆయనతో పాటు ఈ లావాదేవీలో సహాయం చేసిన జూనియర్ అసిస్టెంట్ మనోజ్‌ను కూడా అరెస్టు చేశారు.
ఏసీబీ అధికారులు ఘటనా స్థలంలోనే రసాయన పరీక్షలు చేసి, లంచం డబ్బు వెంకట్ రెడ్డి చేతిలో ఉండటాన్ని ధృవీకరించారు. ఈ ఘటన తర్వాత కలెక్టరేట్‌లో రైడ్స్ చేసిన ఏసీబీ టీమ్ పలు ఆధారాలను స్వాధీనం చేసుకుంది. ఈ లావాదేవీకి సంబంధించిన డాక్యుమెంట్లు, మొబైల్ ఫోన్‌లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అధికారులు వెంకట్ రెడ్డి రూమ్‌లోని డాక్యుమెంట్లు, కంప్యూటర్‌లు, ఫైళ్లను స్కాన్ చేశారు. ఈ రైడ్స్‌లో అదనపు ఆస్తులు లేదా మరిన్ని అవినీతి ఆధారాలు దొరికాయా అనేది ఇంకా స్పష్టం కాలేదు.
ఏసీబీ అవినీతి అధికారులపై చర్యలు తీసుకుంటోంది. రంగారెడ్డి జిల్లాలో ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేసి, రూ.100 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు గుర్తించింది. ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ స్థాయి అధికారి దొరికారు. ఆయన రైతుల్ని కూడా పీడించి పెద్ద ఎత్తున లంచాలు వసూలు చేశారని.. వారు చేసుకున్న సంబరాలతోనే అర్థం అవుతోంది.





















