KCR Health: కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రముఖుల ప్రార్థనలు, ప్రధాని మోడీ ట్వీట్
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. కేసీఆర్ ఎడమ కాలి తుంటి ఎముక మార్పిడి చేయాలని వెల్లడించారు.
బీఆర్ఎస్ అధినేత (Brs Chief), తెలంగాణ మాజీ సీఎం ( Ex Chief Minister ) కేసీఆర్(KCR) త్వరగా కోలుకోవాలని జనసేనాని చీఫ్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆకాంక్షించారు. కేసీఆర్ కు గాయమైందని తెలిసి బాధపడ్డానన్న ఆయన....కేసీఆర్ సంపూర్ణంగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నో సవాళ్లను అధిగమించిన కేసీఆర్, ఈ అనారోగ్య పరిస్థితులనూ మనోధైర్యంతో అధిగమిస్తారనే నమ్మకం తనకు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. పూర్తి ఆరోగ్యంతో మళ్లీ ప్రజలకు, సమాజానికి తన సేవలు కొనసాగిస్తారని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
శ్రీ కేసీఆర్ గారు సంపూర్ణంగా కోలుకోవాలి - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/59kXk83p3V
— JanaSena Party (@JanaSenaParty) December 8, 2023
నిలకడగా కేసీఆర్ ఆరోగ్యం
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. కేసీఆర్ ఎడమ కాలి తుంటి ఎముక మార్పిడి చేయాలని వెల్లడించారు. బాత్‌రూమ్‌లో జారిపడటంతో కేసీఆర్ ఎడమ కాలి తుంటి ఎముక విరిగిందన్న వైద్యులు, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. ఎడమ కాలి తుంటి ఎముక మార్పిడి చేయాలని, కేసీఆర్ కోలుకునేందుకు 6 నుంచి 8 వారాలు పడుతుందన్నారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఉన్నారని హెల్త్ బులెటిన్‌లో తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆరా
గులాబీ దళపతి కేసీఆర్ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కేసీఆర్ ఆరోగ్యంపై సమాచారాన్ని తనకు తెలియజేయాలని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీకి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి రిజ్వీ వెళ్లారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడిన రిజ్వీ...ఆ తర్వాత సీఎం రేవంత్ కు పరిస్థితిని వివరించారు.
కేసీఆర్ వేగంగా కోలుకోవాలన్న ప్రధాని మోడీ
కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పందించారు. కేసీఆర్‌కు గాయమైన విషయం తెలియగానే చాలా బాధపడ్డట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యంతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
Distressed to know that former Telangana CM Shri KCR Garu has suffered an injury. I pray for his speedy recovery and good health.
— Narendra Modi (@narendramodi) December 8, 2023
చాలా బాధపడ్డానన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
కేసీఆర్ ఆరోగ్యంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy)స్పందించారు. కేసీఆర్‌కు గాయమైన విషయం తెలియగానే చాలా బాధపడ్డట్లు ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యంతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. వీరితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కేసీఆర్ కోలుకోవాలని ఆకాంక్షించారు.