Minister Mallareddy: నేను గొడవ పెట్టుకునే రకం కాదు, కానీ కావాలనే పెద్దది చేసి చూపిస్తున్నారు: మంత్రి మల్లారెడ్డి
Minister Mallareddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనపై చిసిన వ్యాఖ్యలను మీడియానే పెద్దగా చేసి చూపిస్తుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. తాను గాంధేయవాదినని, ఎవరితో గొడవ పెట్టుకునే రకం కాదని చెప్పారు.
Minister Mallareddy: మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు తనపై చేసిన వ్యాఖ్యలను మీడియానే పెద్దది చేసి చూపిస్తోందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. తమది క్రమశిక్షణ గల పార్టీ అని.. ఇంటి సమస్యను తామే పరిష్కరించుకుంటామని చెప్పారు. పదవుల కేటాయింపుల వియంలో మల్లారెడ్డి వైఖరిపై అధికార పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు అసంతృప్తి వెళ్లగక్కిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. పదవులు ఇచ్చేది సీఎం కేసీఆర్ అని, మంత్రి కేటీఆర్ తప్ప తాను కాదని.. తాను గాంధేయ వాదిని అని చెప్పుకొచ్చారు. తాను ఎరితోనూ గొడవ పెట్టుకునే రకం కాదని పేర్కొన్నారు. జిల్లా పార్టీకి చెందిన పార్టీ ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి మాట్లాడతానన్నారు. అయితే తమ మధ్య అంత పెద్ద సమస్య ఏం లేదని చెప్పారు. అవసరం అయితే వాళ్లందరినీ తన ఇంటికే ఆహ్వానిస్తానని మంత్రి మల్లారెడ్డి వివరించారు.
అసలేం జరిగిందంటే..?
మేడ్చల్ జిల్లా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సమావేశం రహస్య భేటీ కాదన్నారు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్. చాలా రోజుల నుంచి జిల్లాకు చెందిన సీనియర్ నేత మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును కలుద్దామని పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు చాలా రోజులనుంచి అనుకుంటున్నామని, ఈరోజు వీలైందన్నారు. తాము జీహెచ్ఎంసీ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేం అని, గతంలో జరిగిన ఎన్నికల్లో మేడ్చల్ జిల్లాలోనే ఎక్కువ స్థానాలు సాధించామన్నారు. జిల్లాకు పదవులు ఇస్తామని పార్టీ పెద్దలు మాట ఇచ్చారని, కానీ జిల్లాకు రావాల్సిన పదవులు మొత్తం కేవలం మేడ్చల్ నియోజకవర్గానికి మాత్రమే ఇస్తున్నారని ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ ఆరోపించారు.
జిల్లా మొత్తానికి చెందిన ఓ పదవి సైతం ఇటీవల మేడ్చల్ నియోజకవర్గానికి ఇచ్చారని, టర్మ్ పూర్తి కాకముందే వేరే వారికి అవకాశం ఇచ్చారని చెప్పారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లామని, కానీ రాత్రికి రాత్రే జీవో పాస్ చేసి భాస్కర్ యాదవ్ తో ప్రమాణ స్వీకారం చేయించారని తెలిపారు. అయితే మంత్రి కేటీఆర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో ఎలాంటి చర్చలు జరపలేదని, కొందరి ప్రభావంతో వేరే నేతలకు పదవులు వెళ్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాకు తమ ఎమ్మెల్యేల సమావేశం లీక్ కావడంతో అసమ్మతి అని ఏదో ప్రచారం జరిగిందని, దానిపై క్లారిటీ ఇచ్చేందుకు మీడియాతో మాట్లాడామని చెప్పారు.
మంత్రి మల్లారెడ్డే టార్గెట్ గా వ్యాఖ్యలు..
మేడ్చల్ జిల్లాకు చెందిన మంత్రి సీహెచ్ మల్లారెడ్డిపై పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అసమ్మతి గళం విప్పారు. తనకు కావాల్సిన వారికే, మేడ్చల్ జిల్లా పదవులను సైతం మేడ్చల్ నియోజకవర్గ నేతలకు ఇప్పిస్తున్నారని ఐదుగురు ఎమ్మెల్యేలు పేరు చెప్పకుండా మంత్రి మల్లారెడ్డిపై ఆరోపణలు చేశారు. మంత్రి ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోతున్నామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆరోపించారు. మైనంపల్లి ఇంట్లో మేడ్చల్ జిల్లాకు చెందిన కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్, శేరిలింగంపల్లి అరికపూడి గాంధీ సోమవారం సమావేశమయ్యారు. పదవుల పంపకం, జిల్లాలో కేవలం మేడ్చల్ నియోజకర్గం వారికే ప్రాధాన్యత ఇవ్వడం, మంత్రి మల్లారెడ్డి సూచించిన వారికే పదవులు రావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.