KCR : కాళేశ్వరం కమిషన్ ఎదుట రేపు హాజరుకానున్న కేసీఆర్; విచారణపై ఉత్కంఠ
KCR : తెలంగాణ భవన్‌లో పార్టీ సీనియర్ నేతలతో చర్చించిన తర్వాత కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరవుతారని పార్టీ నేతలు చెబుతున్నారు. కమిషన్ ఏం అడుగుతుంది, తానేం చెబుతారన్నదే ఆసక్తికరంగా మారింది.

KCR : జూన్ 11, 2025 (బుధవారం) కాళేశ్వరం కమిషన్ ఎదుట తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ జ్యుడీషియల్ కమిషన్ ఎదుట ఇరిగేషన్ అధికారులు, మాజీ అధికారులు, మాజీ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్, మాజీ ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. ఇప్పుడు రేపు మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. కమిషన్ ఏం ప్రశ్నలు వేస్తుంది? అందుకు కేసీఆర్ ఏం సమాధానాలు చెబుతారు? ఆ తర్వాత ఆయన మీడియా ముందు మాట్లాడతారా? ఒకవేళ మాట్లాడితే ఏం మాట్లాడతారు? అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ వెనుక కథ ఇదే
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలు, రూపకల్పన, నిర్మాణం, నాణ్యతా లోపాలు, నిర్మాణ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు, వాటి వెనుక దాగి ఉన్న అక్రమాలు వంటి విషయాలపై విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్ వేసింది. ఈ కమిషన్‌కు భారతదేశపు మొట్టమొదటి లోక్‌పాల్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన పినాకి చంద్ర ఘోష్ (Justice Pinaki Chandra Ghose) నేతృత్వం వహిస్తున్నారు.
ఈ కమిషన్ ఇప్పటికే వంద మందికిపైగా కాళేశ్వరం ప్రాజెక్టులో పని చేసిన ఇంజనీర్లు, రిటైర్ అయిన మాజీ ఇంజనీర్లు, ఆర్థిక శాఖ అధికారులను, కాగ్ (CAG) అధికారులతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టుతో పరోక్షంగా, ప్రత్యక్షంగా సంబంధం ఉన్న అధికారులను విచారించింది. ఆ తర్వాత మాజీ ఆర్థికమంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ను జూన్ 6, 2025న కమిషన్ విచారణ జరిపింది. జూన్ 9, 2025న మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్ రావును విచారణ జరిపింది. ఇక ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను జూన్ 11, 2025న విచారణకు రావాలని నోటీసులు పంపింది. అయితే, తొలుత కేసీఆర్‌ను జూన్ 5వ తేదీన హాజరు కావాలని నోటీసులు పంపగా, కేసీఆర్ విజ్ఞప్తి చేయగా జూన్ 11వ తేదీకి విచారణను వాయిదా వేసింది. అధికారులను విచారణ జరిపిన సమయంలో, కాళేశ్వరం ప్రాజెక్టు కీలక నిర్ణయాలన్నీ నాటి సీఎం కేసీఆర్ వద్దే జరిగాయని, ఆయన ఆదేశాల మేరకే తాము పని చేశామని చెప్పడంతో కమిషన్ కేసీఆర్‌ను విచారణ జరపాలని నిర్ణయించి, ఆ మేరకు నోటీసులు జారీ చేసింది.
కాళేశ్వరంపై కాంగ్రెస్ - బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్
ప్రపంచంలో అరుదైన ఇంజనీరింగ్ అద్భుతమని బీఆర్ఎస్ ప్రచారం చేయగా, 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రచారం చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మి బ్యారేజీ (మేడిగడ్డ)లోని ఏడో బ్లాక్‌లోని 16 నుంచి 21 పిల్లర్లు కుంగిపోయాయి. దీంతో బ్యారేజీలోని కొంత భాగం దెబ్బతిని, నీరు లీక్ అయ్యింది. దీనిపై విచారణ జరిపిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో కూడా లోపాలు ఉన్నాయని చెప్పింది. మేడిగడ్డ బ్యారేజీలో ఉన్న డిజైన్, నిర్మాణ లోపాలు అన్నారం (సరస్వతి), సుందిళ్ల (పార్వతి) బ్యారేజీలలో కూడా ఉన్నట్లు NDSA గుర్తించింది. ఈ బ్యారేజీలలో కూడా "డిస్ట్రెస్ కండిషన్స్" (నష్టం సూచనలు), లీకేజీలు కనిపించాయని పేర్కొంది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద మానవ నిర్మిత విపత్తు అని ప్రకటన చేసింది. దీనిపై జ్యుడీషియల్ కమిషన్ ద్వారా విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
అయితే, దీనిపై బీఆర్ఎస్ నేతలు ఎదురు దాడికి దిగారు. కాళేశ్వరం తెలంగాణకు జీవనాడి అని, తమ పార్టీని అప్రతిష్ట పాలు చేసే కుట్రగా మాజీ మంత్రి హరీశ్ రావు కమిషన్ ఎదుట హాజరైన అనంతరం వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, కేసీఆర్‌ను అప్రతిష్ట పాలు చేసే కుట్రగా అభివర్ణించారు. భాక్రానంగల్, నాగార్జున సాగర్ వంటి ప్రాజెక్టులను దశాబ్దాలుగా పూర్తి చేయలేకపోయిన కాంగ్రెస్ పార్టీ, అతి తక్కువ కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశారన్న దుగ్ధతో ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు రెండు పార్టీల మధ్య రాజకీయ యుద్ధానికి తెర లేపింది. ఈ క్రమంలోనే కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట ఏం మాట్లాడతారు? ఆ తర్వాత మీడియాతో మాట్లాడతారా? ఏం మాట్లడాతారు? అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
విచారణకు ముందు కేసీఆర్ హోం వర్క్
కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యేందుకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చాలా హోం వర్క్ చేశారు. పలు సార్లు కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఇంజనీర్లు, నీటి పారుదల రంగ నిపుణులు, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్ రావుతో సమావేశమై చర్చించారు. నాడు ప్రాజెక్టు ప్రణాళిక దశ నుంచి పూర్తయ్యే వరకు తీసుకున్న నిర్ణయాలను సమీక్షించుకున్నారు. రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలన్న అంశంపైన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోను, హరీశ్ రావుతోను చర్చించారు. ఇప్పటి వరకు కాళేశ్వరం కమిషన్ చేసిన విచారణ అంశాలు, ఇప్పటివరకు జరిగిన పరిణమాల వివరాలు, కమిషన్ ఎదుట హాజరయినప్పుడు హరీశ్ రావును సంధించిన ప్రశ్నలు- వాటి సమాధానాలపైన చర్చ జరిగినట్లు సమాచారం. విచారణకు హాజరయ్యే ముందు అంటే బుధవారం మరో దఫా తెలంగాణ భవన్‌లో పార్టీ సీనియర్ నేతలతో చర్చించిన తర్వాత బీఆర్‌కే భవన్‌లోని కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరవుతారని పార్టీ నేతలు చెబుతున్నారు.




















