Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ఆరోపణలు – లెక్కలతో సహా వాస్తవాలు వెల్లడించిన హరీష్ రావు
Telangana News | కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ స్పందించింది. మాజీ మంత్రి హరీష్ రావు లెక్కలతో సహా వాస్తవాలు వెల్లడించారు.

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారాలు – వాస్తవాలు పేరిట తెలంగాణ మాజీమంత్రి హరీశ్ రావు తెలంగాణ భవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మొత్తం 20 లక్షల 33 వేల 572 ఎకరాలకు సాగునీరు అందిస్తే, ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు అని కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కాళేశ్వరం ద్వారా 20 లక్షల పైగా ఎకరాలకు సాగు నీరు అందిందని కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇరిగేషన్ ఇంజనీర్స్ రిపోర్ట్ ఇచ్చారని హరీష్ రావు స్పష్టం చేశారు.
141 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించాలని చూసిన ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా కేవలం 11 టీఎంసీల నీళ్లు మాత్రమే నిల్వకు అవకాశం ఉండేది.కేసీఆర్ ముందు చూపుతో కాళేశ్వరం ద్వారా 141 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా 16 రిజర్వాయర్లు నిర్మించాం. మేడిగడ్డ, అన్నరం, సుందిళ్ల, మేడారం, మల్కపేట, అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, బుస్సాపూర్, గంధమల్ల, కొండం చెరువు, భూంపల్లి, మోతె, ధర్మారావుపేట, కాటేవాడి, ముద్దోజివాడి, తిమ్మక్కపల్లి రిజర్వాయర్లలో 141 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం ఉంది.
ఒక్క మల్లన్న సాగర్ లోనే 50 టీఎంసీల నీటి నిల్వ ఉంటుంది. ఎస్సారెస్పీకి నీళ్లు రానపుడు, కడెం నిండకుండా ఎల్లంపల్లికి కూడా నీళ్లు రానపుడు, మేడిగడ్డలో నీళ్లుంటాయి. ఎక్కడా నీళ్లు లేనపుడు కూడా నీళ్లు లభ్యమయ్యే పాయింట్ మేడిగడ్డ. వర్షాలు బాగా కురిసినపుడు ఎస్సారెస్పీ నుంచి మిడ్ మానేరుకు నీళ్లు తెచ్చుకున్నం. మిడ్ మానేర్ లో పంప్ చేసి నుంచి అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ వరకు నీళ్లు తెచ్చాం. కాళేశ్వరంలో అంతర్భాగమైన వీటి అంతటా లక్షల ఎకరాల్లో పంటలు పండినయి.
కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టిన మోటార్లతోనే అన్నపూర్ణకు నీళ్లు, అన్నపూర్ణలో పెట్టిన మోటార్లతో రంగనాయక సాగర్ కు నీళ్లు, రంగనాయక సాగర్ మోటార్లతో మిడ్ మానేర్ కు నీళ్లొచ్చాయి. మిడ్ మానేర్ మోటార్లతో మల్లన్నసాగర్ కు, అక్కడి మోటార్లతో కొండ పోచమ్మ సాగర్ కు నీళ్లిచ్చాం. ఇదంతా కాళేశ్వరంలో భాగంగానే.. లక్షల ఎకరాల్లో పంట పండింది. కాళేశ్వరం కింద ఒక్క ఎకరా పారలేదని సీఎం రేవంత్ రెడ్డి అంటడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 50 వేల ఎకరాలు మాత్రమే అన్నారు.
98,570 ఎకరాల కొత్త ఆయకట్టు
కాళేశ్వరం నీళ్లతో ఇప్పటి వరకు నేరుగా 98,570 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందింది. కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వల ద్వారా నింపిన 456 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల ద్వారా 39,146 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందింది. కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో ఎస్సారెస్పీ స్టేజీ 1, ఎస్సారెస్పీ స్టేజీ 2 మరియు నిజాంసాగర్ నీటితో నింపిన 2143 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల ద్వారా 1 లక్షా 67 వేల కొత్త ఆయకట్టు సాగయింది. ఎస్సారెస్పీ స్టేజీ 1, ఎస్సారెస్పీ స్టేజీ 2 మరియు నిజాంసాగర్ ప్రాజెక్టులకు కాళేశ్వరం నీరందించి 17 లక్షల 8 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం జరిగింది. కాళేశ్వరం నీళ్లు కూడెల్లి వాగు, హల్దీ వాగుల ద్వారా 66 చెక్ డ్యాములతో మరో 20 వేల 576 ఎకరాలకు సాగునీరందింది.
ఇది వాస్తవమైన రిపోర్ట్..
ఒక ఏడాది కరువు వస్తే, ఎస్సారెస్పీకి కూడా నీళ్లను రివర్స్ పంపింగ్ చేశాం. మిడ్ మానేర్ నుంచి ఎల్ఎండీకి నీళ్లు తెచ్చి, ఎల్ఎండీ ద్వారా ఎస్సారెస్పీ స్టేజ్ 1 కు నీళ్లిచ్చాం. ఎస్సారెస్పీ స్టేజ్ 2లో, తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ దాకా నీరందించాం. కాళేశ్వరం నీళ్లు పంపించి పంటలు కాపాడింది కేసీఆర్ ప్రభుత్వం. ఇది వాస్తవమైన రిపోర్టు. ఎందుకంటే నీటిపారుదలశాఖ అధికారులిస్తున్న రిపోర్టు ఇది అని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ నాయకులు 50 వేల ఎకరాలే పారిందని దుష్ప్రచారం చేస్తున్నరు.
తెలంగాణ ఏర్పడక ముందు గోదావరి జలాల సద్వినియోగానికి ఎవరూ కృషి చేయలేదు. 2007 నుంచి 2014 వరకు కేంద్రంలో, మహారాష్ట్రలో, ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్పప్పటికీ తుమ్మడి హట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం నుంచి ఏ అనుమతి సాధించలేదు. బీఆర్ఎస్ పార్టీలొ ఆలోచన చేసినం, తెలంగాణ పచ్చబడాలంటే గోదావరి జలాలే కావాలనుకున్నం. గోదావరి నది 1465 కిలోమీటర్లు ప్రవహిస్తుంటే, అందులో 750 కి.మీ. తెలంగాణలోనే ప్రవహిస్తుంది.
అక్కడ నీటి లభ్యత ఉండదు
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 1480 టీఎంసీల కేటాయింపులుంటే, తెలంగాణ వాటా 969 టీఎంసీలు. కానీ, వాస్తవంగా అందులో తెలంగాణ వాడకం ఏనాడూ 400 టీఎంసీలు మించలేదు. 2014 వరకు తెలంగాణలో గోదావరిపై కట్టిన ప్రాజెక్టులు ఎస్సారెస్పీ, దేవాదుల మాత్రమే. తెలంగాణ ఉద్యమం ఉప్పెనలా వస్తే, తలొగ్గిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. అక్కడ నీటి లభ్యత ఉండదు, ప్రాణహిత చేవెళ్ల నీటి నిల్వ సామర్థ్యం కేవలం 11 టీఎంసీలు మాత్రమే. కాళేశ్వరం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 141 టీఎంసీలు.. ఎంత తేడా ఉందో మీరు గమనించండి.
2014 వరకు కాంగ్రెస్ నాయకులు సర్వే, మొబిలైజేషన్ అడ్వాన్సుల కింద రూ. 2328 కోట్లు కాంట్రాక్టర్లకు ఇస్తే, పనులు జరగనేలేదు. • ఇందులో తట్టెడు మట్టి కూడా ఎత్తకుండా మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట 1052 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం స్వాహా చేసిందని స్వయంగా కాగ్ తన రిపోర్టులో వెల్లడించింది. ఇట్లా ఆ పైసలు కాంగ్రెస్ నాయకులు తీసుకొని జేబులు నింపుకున్నరు. అప్పుడు మంత్రులుగా ఉన్నది కూడా ఇదే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులే. ఆనాడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ (TDP)లో ఉండి విమర్శించిండు. జలయజ్ఞం కాదు.. ధనం యజ్ఞం అని తీవ్ర ఆరోపణలు చేశారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అవినీతిని వెనకేసుకొస్తున్నడు.
రూ.40,300 కోట్లకు పెంచింది కాంగ్రెస్
ఈ మధ్య ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిండు. ప్రాణహిత చేవెళ్ల కోసం మేం 10 వేల కోట్లు ఖర్చు పెట్టినం, ఇంకో 20 వేల కోట్లు పెడితే అయిపోతుండె అన్నడు. నేను లెక్కలన్నీ తీయిస్తే, 3700 కోట్లు మాత్రమే కాంగ్రెస్ ఖర్చు చేసినట్లు తేలింది. ప్రాజెక్టు ఖర్చు పెరిగిందని ఈ కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నరు. 2007లో రూ.17,875 కోట్లకు జీవో ఇచ్చి, ఏ పని చేయకుండానే ప్రాజెక్టు ఖర్చును రూ.38,500 కోట్లకు పెంచింది కూడా కాంగ్రెస్ మంత్రులే. ఆ తర్వాత కేంద్రానికి పంపినపుడు రూ.40,300 కోట్లకు పెంచింది కూడా ఇదే కాంగ్రెస్ నాయకులు. ఇదీ వీళ్ల నిర్వాకం. అని హరీష్ రావు అన్నారు.
గతంలో తుమ్మిడిహెట్టి వద్ద నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తేద్దామనుకున్నారు. కానీ నీటి లభ్యత లేని కారణంగా తమ్మిటిహెట్టి నుంచి మేడిగడ్డ అక్కడి నుంచి అన్నారం, అటు నుంచి సుందిళ్లకు.. అక్కడి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తరలించాం. కాళేశ్వరానికి మేడిగడ్డ నుంచే నీళ్లు తేవాల్సిన అవసరం లేదు. ఎస్సారెస్పీకి వరద నీరు వస్తే మిడ్ మానేరుకు నీళ్లు వస్తాయి. ఒకటి వరద కాలువ, రెండోది ఎస్సారెస్పీ నుంచి మిడ్ మానేరుకు నీళ్లు వస్తాయి. మిడ్ మానేరు నుంచి మోటర్ల ద్వారా అన్నపూర్ణ, రంగనాయకసాగర్ రిజర్వాయర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ లకు నీళ్లు అందించే అవకాశం ఉందన్నారు.
కొన్నిసార్లు కడెం ప్రాజెక్టు నుంచి ఎల్లంపల్లికి నీళ్లు వస్తాయి. ఎల్లంపల్లి నుంచి మోటార్లు ఆన్ చేసి ఎస్సారెస్సీకి నీళ్లు.. అటు నుంచి మిడ్ మానేరుకు నీళ్లు వచ్చేలా ప్లాన్ చేసినట్లు తెలిపారు.
• 2014 జూన్ 2 న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై, కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. నెల రోజుల్లోనే సాగునీటిశాఖ మంత్రిగా ఉన్న నేను, ఇంజనీర్ల బృందం కలిసి మహారాష్ట్రకు వెళ్లినం. అక్కడ కాంగ్రెస్ ఇరిగేషన్ మంత్రి హసన్ ముష్రఫ్ ను కలిసి ప్రాజెక్టు నిర్మాణం అవసరాన్ని వివరించినం. వారి సీఎం పృద్వీరాజ్ చౌహాస్, ఇరిగేషన్ మంత్రి హసన్ ముష్రఫ్ ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాసిన లేఖను గుర్తు చేశారు.
మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు
ఫుల్ రిజర్వాయర్ లెవల్ 152 మీటర్లకు అనుగుణంగా చేపట్టే ప్రాజెక్టు పనులు నిరుపయోగమని, తాము 148 మీటర్ల ఎత్తులో నిర్మిస్తేనే అంగీకరిస్తామని ఆనాడే తేల్చి చెప్పినట్లు చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం రెండు రాష్ట్రాల అధికారుల మధ్య రెండుసార్లు హైదరాబాదులో చర్చలు జరిగాయి. ఆనాడు దివంగత ఆర్.విద్యాసాగర్ రావు కూడా పాల్గొని మహారాష్ర్ట ప్రభుత్వం నిర్దేశించిన పరిహారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని కూడా హామీ ఇచ్చారు. అయితే తుమ్మిడిహెట్టి వద్దనే 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ తో ప్రాజెక్టు నిర్మించేందుకు బీఆర్ఎస్ ఎంతో ప్రయత్నం చేసింది. కానీ, మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు.
మహారాష్ట్రలో ఎన్నికలు జరిగిన తర్వాత కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వంలో ఆనాటి సాగునీటి మంత్రి గిరీష్ మహాజన్ తో నేను (హరీష్ రావు) ముంబైలో సమావేశమవడం జరిగింది. ఈ సమస్యను ముఖ్యమంత్రుల స్థాయిలోనే పరిష్కరించుకోవాల్సి ఉంటుందని గిరీశ్ సూచించారు. ప్రాణహిత – చేవెళ్లను ఎందుకు రీ ఇంజనీరింగ్ చేయాల్సి వచ్చిందంటే... నీటి లభ్యత లేకపోవడమే కారణం. హైడ్రాలజీ వాళ్లు అక్కడ ప్రాజెక్టుకు సరిపడా నికర జలాలు లేవన్నారు. ప్రాజెక్టుపై పునరాలోచన చేయాలని సెంట్రల్ వాటర్ కమిషన్ సూచించింది.
ఉమ్మడి ఏపీలో 2008న రాసిన లేఖలో ప్రాణహిత చేవెళ్ల డీపీఆర్ పై సీడబ్ల్యూసీ స్పందించింది. ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్ధ్యం కలిగిన బ్యారేజీలు లేవని, అందుకే కృత్రిమ జలాశయాలను గానీ, ఆన్ లైన్ జలాశయాల నిల్వ సామర్ధ్యాన్ని పెంచుకోవాలని సీడబ్ల్యూసీ సూచించింది. తుమ్మడిహెట్టి వద్ద ప్రతిపాదించిన బ్యారేజీ నిర్మాణం కోసం ప్రభుత్వ పరంగా రాజకీయంగా ఎన్నో ప్రయత్నాలు చేసినం. అవేమీ ఫలించకపోవడంతోనే ప్రత్యామ్నయ స్థలం కోసం ఆలోచన చేసినం. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ ఎంపిక చేసిన స్థలమే.. మేడిగడ్డ






















