International Girl Child Day: ప్రభుత్వ చర్యలతో బాలికల నిష్పత్తి గణనీయంగా పెరుగుతోంది: మంత్రి సత్యవతి రాథోడ్
International Girl Child Day: బాలికలందరికీ మంత్రి సత్యవతి రాథోడ్ అంతర్జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యల వల్లే బాలికల నిష్పత్తి గణనీయంగా పెరుగుతోందని అన్నారు.
International Girl Child Day: బాలికలు అందరికీ రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అంతర్జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బాలికల రక్షణ, సంక్షేమం, అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వివరించారు. బాలికల విద్య, వారి రక్షణ కోసం అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు. అంతే కాకుండా బాలికల విద్య ప్రోత్సహాకానికి నగదు పారితోషికాలు అందజేస్తున్నామని స్పష్టం చేశారు. అలాగే బాలికల అభివృద్ధి కోసం వారి తల్లిదండ్రులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ చర్యలు వల్లే బాలికల నిష్పత్తి గణనీయంగా పెరుగుతోందని తెలిపారు. బాలికల పట్ల దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పుకొచ్చారు.
గర్భవతులకు నగదు, నాణ్యమైన ఆహారం
బాలికల రక్షణకు, బాలికల భ్రూణ హత్యల నివారణకు సీఎం కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. మహిళలకు, బాలికలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ వారి సంక్షేమం, అభివృద్ధి కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా పలు కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యే వరకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తోందని వివరించారు. అలాగే ఆరు నెలల పాటు ప్రతీ నెల 2 వేల రూపాయల చొప్పున అందిస్తోందని తెలిపారు. అమ్మాయి పుడితే మరో వెయ్యి రూపాయు అదనంగా ఇస్తుందని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. బాలికల రక్షణ కోసం తీసుకోవాల్సి జాగ్రత్తల గురించి ఎప్పటికప్పుడు టీవీలు, రేడియోలు, అవుట్ డోర్ మీడియా ద్వారా ప్రచారం కల్పిస్తున్నామన్నారు. సైకిల్ ర్యాలీలు, బైక్ ర్యాలీలు నిర్వహిస్తూ క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
సభలు, సమావేశాలు నిర్వహిస్తూ అవగాహనలు..
గ్రామ సభలు, మండల స్థాయిలో మహిళా సభలు నిర్వహిస్తూ భ్రూణ హత్యల నివారణ, బాలికల రక్షణ, విద్యపై తల్లిదండ్రులను చైతన్య పరుస్తున్నామన్నారు. నిరుపేద, అనాథ బాలికల జన్మదినోత్సవాలను నిర్వహిస్తూ వారికి సమాజం పట్ల నమ్మకం కల్పించే చర్యలు చేపడుతున్నామన్నారు. బాలికా విద్యను ప్రోత్సహించడంలో భాగంగా పదో తరగతి, ఇంటర్ లో టాపర్స్ గా నిలిచిన బాలికలకు నగదు ప్రోత్సహకాన్ని అందజేస్తూ.. వారిలో ఆత్మవిశ్యాసాన్ని కల్గజేస్తున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పుకొచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం చర్యల వల్ల రాష్ట్రంలో బాలురు, బాలికల నిష్పత్తిలో గణనీయమైన మార్పులు వచ్చాయన్నారు. గతంలో అమ్మాయిల నిష్పత్తి చాలా తక్కువగా ఉండేదని.. ఇప్పుడు అది పెరిగిందని తెలిపారు. బాలికలు, మహిళలపై అమానుషంగా ప్రవర్తిస్తున్న వారిపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఆడపిల్లలందరికీ మరోసారి అంతర్జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు తీసుకొచ్చి పేదింటి ఆడపిల్లలకు అండగా నిలబడుతున్నామన్నారు. పేదింటి తల్లిదండ్రులకు ఆడపిల్ల భారం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ పథకాలు తీసుకొచ్చినట్లు వివరించారు. ఈ పథకాల వల్ల బాల్య వివాహాలు జరగకుండా అడ్డుకోగల్గుతున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు.