CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Telangana News: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తునకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు అసెంబ్లీ వేదికగా గురువారం కీలక ప్రకటన చేశారు. ఓఆర్ఆర్‌ను అప్పనంగా ఎవరికో అప్పగించారని అన్నారు.
SIT Investigation Of ORR Lease Tenders: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అసెంబ్లీ వేదికగా గురువారం కీలక ప్రకటన చేశారు. ఔటర్ రింగ్ రోడ్డును (ORR) అప్పనంగా ఎవరికో అప్పగించారని.. టెండర్లపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేస్తామని స్పష్టం చేశారు. 'హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా రాణించడానికి కారణం. కృష్ణా - గోదావరి నదీ జలాలు, ఓఆర్ఆర్, అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు, మెట్రో రైలు, ఐటీ, ఫార్మా కంపెనీలు, శాంతిభద్రతలను కాపాడడం, మత సామరస్యాన్ని పెంపొందించడం.
తెలంగాణకు మణిహారంగా ఉన్న హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (#ORR) ను ప్రైవేటు సంస్థకు అప్పగించిన టెండర్ ప్రక్రియలో సరైన విధి విధానాలను అవలంభించకుండా అప్పనంగా, గత ప్రభుత్వంలో కొందరికి ఆయాచిత లబ్దిచేకూర్చారన్న ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం #SIT ద్వారా విచారణ జరిపించనున్నట్టు… pic.twitter.com/Cq4dRfy8Cz
— Telangana CMO (@TelanganaCMO) December 19, 2024
హైదరాబాద్ విశ్వనగరంగా ఎదుగుతుందంటే అందుకు కారణం కాంగ్రెస్. ఓఆర్ఆర్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వల్ల రాష్ట్ర ఆదాయం పెరిగింది. వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్ర ముఖచిత్రమే మారిపోయింది. కాంగ్రెస్ తీసుకున్న విధానపరమైన నిర్ణయాల వల్లే ఆదాయం పెరిగింది. ఎన్నికల ముంగిట ఓఆర్ఆర్‌ను 30 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడంపై రాష్ట్రంలో తీవ్ర చర్చ జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు లీజు టెండర్లపై విచారణ జరిపించేందుకు సిట్ ఏర్పాటు చేస్తాం.' అని సీఎం వెల్లడించారు. రూ.వేల కోట్ల ఓఆర్ఆర్ ఆస్తిని అప్పనంగా అమ్ముకున్నారని బీఆర్ఎస్‌పై రేవంత్ ధ్వజమెత్తారు. దేశం విడిచిపెట్టి పోవాలనే ఉద్దేశంతోనే ఓఆర్ఆర్ ఆస్తులను గత ప్రభుత్వాధినేతలు అమ్మేసుకున్నారని పేర్కొన్నారు.
స్పందించిన హరీష్ రావు
ఓఆర్ఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి సిట్ విచారణకు ఆదేశించడంపై హరీశ్ రావు స్పందించారు. ఓఆర్ఆర్ టెండరుపై తాను విచారణ కోరలేదని.. అయినా కూడా విచారణను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ముందు టెండర్ రద్దు చేసి విచారణకు ఆదేశించాలని కోరారు.