Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Andhra Fibernet: ఫైబర్‌నెట్‌లో గత ప్రభుత్వంలో భారీ స్కాం జరిగిందని చైర్మన్ జీవీ రెడ్డి ప్రకటించారు. చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు అంశాలపై సమీక్షలు చేసి ఆయన మీడియాతో మాట్లాడారు.
Fibernet Andhra Pradesh: వివాదాస్పద సినీ దర్శకుడు ఆర్జీవీ మరో వివాదంలో ఇరుక్కునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన తీసిన వ్యూహం సినిమాకు పే ఫర్ వ్యూ పద్దతిలో ఏపీ ఫైబర్ నెట్ కు ఇచ్చారు. మొత్తం మీద ఆ సినిమాకు 1863 వ్యూస్ మాత్రమే వచ్చాయి. కానీ ప్రభుత్వం ఆయనకు ఫైబర్ నెట్ నుంచి రూ. రెండు కోట్ల పదిహేను లక్షలు చెల్లించింది. ఈ విషయాన్ని కొత్తగా ఫైబల్ నెట్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న జీవీరెడ్డి ప్రకటించారు. అంటే ఒక్కో వ్యూకు రూ. 11వేలకుపైగా చెల్లించారని అన్నారు. ఇలా అనేక అవకతవకలు జరిగాయని నిర్ధారణ అయ్యిందని జీవీ రెడ్డి తెలిపారు.
ఫైబర్ నెట్‌ను దివాలా స్థితికి తెచ్చిన వైసీపీ ప్రభుత్వం
ఇంటర్నెట్ కేబుల్ సర్వీసులను ప్రజలకు తక్కువ రేట్లకే అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2014 లో ఎపి ఫైబర్ నెట్ ను ప్రారంభించారని, ఇది సర్వీస్ ప్రొవైడర్ కేబుల్ నెట్ వర్క్ అని ఎపి ఫైబర్ నెట్ సంస్థ ఛైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో ఉన్న ఫైబర్ నెట్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ ఫైబర్ నెట్ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. వాటి ఫలాలను ప్రజలు, ఉద్యోగులు చూశారన్నారు.. 2019 నాటికి పది లక్షల కనెక్షన్లు ఉండగా 2024 నాటికి కేవలం ఐదు లక్షల కనెక్షన్లు కు పడిపోయాయన్నారు. పది రెట్లు పెరగాల్సిన కనెక్షన్లు సగానికి తగ్గి దివాళా అంచుకి సంస్థ ను తెచ్చారన్నారు. ఇంత మంది ఉన్నా ఎందుకు కనెక్షన్లు తగ్గాయో అర్థం కావడం లేదన్నారు.
వేల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో కూడా తెలియని పరిస్థితి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాలంలో 108 మంది ఉద్యోగుల కి నెలకు రూ. 40 లక్షలు చెల్లించగా గత ప్రభుత్వం లో 1,360 మంది ఉద్యోగులకు నెలకు రూ. 4 కోట్లు చెల్లించారన్నారు. గతంలో జీతాలపై చేస్తున్న ఖర్చు 10 రెట్లు పెరిగాయన్నారు. ఈ ఐదేళ్లల్లో ఫైబర్ నెట్ సేవలను నిర్వీర్యం చేశారన్నారు.. పురోగమనం లేకపోగా తిరోగమనం దిశగా గత పాలకలు ఫైబర్ నెట్ సంస్థ ను మార్చారన్నారు. సంస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు. ప్రభుత్వ కార్పొరేట్ ఆఫీసులో ఒక పద్దతి అనేది లేకుండా గతంలో సంస్థను నడిపారన్నారు.. ఐదేళ్లల్లో జరిగిన అవినీతి పై విజిలెన్స్ విచారణ జరుగుతుందన్నారు.. నివేదిక వచ్చిన పిదప పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.. గతంలో కేబుల్ ఆపరేటర్లను ఇబ్బందులకు గురి చేసినట్లు అంతేకాకుండా వారి నుంచి డబ్బులు కూడా వసూలు చేసి కనెక్షన్లు ఇవ్వలేదన్నారు.. రూ. 1,262 కోట్ల రూపాయల అప్పు నేడు ఫైబర్ నెట్ సంస్థ పై ఉందని, ఆదాయం వచ్చే సంస్థ ను కూడా అప్పుల ఊబిలోకి నెట్టారన్నారు. ఫైబర్ నెట్ సంస్థను 2016 లో రూ. 3,580 కోట్ల తో అన్ని విధాలా ఏర్పాటు చేసి మొదలు పెట్టారన్నారు. అంతా సిద్దం చేసిన సంస్థ కు గత పభుత్వ హయాంలో 6,800 కోట్ల రెట్టింపు ఖర్చు చేశారన్నారు. అన్ని విధాలా నెలకొల్పిన సంస్థ కు ఇన్ని వేల కోట్లు ఎలా ఖర్చు చేశారన్నారు. కేవలం మెయింటెనెన్స్ కు అన్ని వేల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో తెలియడం లేదన్నారు. అన్ని విషయాలపై విచారణ జరుగుతుందన్నారు.
నియామక పత్రాలు లేకుండానే ఉద్యోగాలు
నియామక పత్రాలు లేకుండా ఫైబర్ నెట్ సంస్థ లో ఉద్యోగాలు ఇచ్చారని, వారు ఎక్కడ పనిచేస్తున్నారో తెలయకుండా ఉందని, ఒక్క వాట్సప్ మెసేజ్ తో ఉద్యోగం, వేల రూపాయలు జీతం ఇచ్చారన్నారు. ఇలా వేలాది మందికి ఉద్యోగాలు కల్పించారని, వీరంతా వేరే చోట పనిచేస్తూ, సంస్థలో మాత్రం జీతాలు తీసుకున్నారన్నారు. విచారణ మొత్తం పూర్తి అయ్యాక గత ప్రభుత్వం చేసిన అవకతవకల మొత్తాన్ని బయట పెడతామన్నారు. కేబుల్ ఆపరేటర్ లను స్థానికంగా ఉన్న విద్యుత్ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని, పోల్ కి వైర్లు ఉంటే తొలగించడం సరి కాదని, మీకు ఇబ్బంది ఉంటే మా దృష్టి కి తీసుకురమ్మని, ఇటువంటి చర్యలు చేయవద్దని విద్యుత్ శాఖ అధికారులను కోరుతున్నామన్నారు. అనేక ఆరోపణలు వచ్చిన ఓ మహిళా ఉద్యోగినిని ఉద్యోగం నుంచి తొలగించామన్నారు.ఆమె ఫైబర్ నెట్ ఫైళ్లను విజయసాయిరెడ్డికి ఇచ్చారని జీవీ రెడ్డి ఆరోపించారు.