KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Telangana News: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో చర్చకు పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సమాధానం చెప్పేందుకు సిద్ధమన్నారు.
KTR Responds On Fromula E Car Race ACB Case: ఫార్ములా ఈ కార్ రేస్ (Formula E Car Race) వ్యవహారంలో ఏసీబీ తనపై కేసు నమోదు చేయడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ వ్యవహారంపై శాసనసభలో చర్చ పెట్టాలని అన్నారు. సమాధానం చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు సవాల్ విసిరారు. 'నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి, దైర్యం, ప్రజలకు వాస్తవాలు తెలియాలని ఉంటే ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలి. ఫార్ములా ఈ రేస్‌లో కుంభకోణం జరిగిందని అంటున్నారు. చర్చ జరిగితే అన్ని విషయాలు క్షుణ్ణంగా వివరిస్తా.' అని కేటీఆర్ స్పష్టం చేశారు. కాగా, ఫార్ములా - ఈ కార్ రేస్‌కు సంబంధించిన కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అర్వింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిపై తెలంగాణ ఏసీబీ గురువారం కేసు నమోదు చేసింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారన్న అభియోగాలపై కేటీఆర్‌పై విచారణ జరిపేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇటీవల అనుమతించారు. దీంతో కేటీఆర్‌పై 13(1) A, 13 (2) పీసీ యాక్ట్, 409, 120 B కింద ఏసీబీ కేసు నమోదు చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలన్న ధైర్యం ఉంటే ఫార్ములా - ఈ రేసింగ్ పై అసెంబ్లీలో చర్చ పెట్టాలి.
— BRS Party (@BRSparty) December 19, 2024
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @KTRBRS pic.twitter.com/6N9dw93jKt
ప్రభుత్వంపై హరీష్ రావు ఆగ్రహం
మరోవైపు, మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని శాసనసభలో ప్రస్తావిస్తూ.. 'మేము ఏదైనా ప్రశ్నిస్తే మమ్మల్ని దబాయించి విచారణ పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోంది. ఇదే కదా మీరు చేసేది. రాష్ట్ర ఇమేజ్ కోసం ప్రయత్నిస్తే కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టారు.' అని మండిపడ్డారు. అటు, ఈ అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సైతం స్పందించారు. రాజకీయంగా ఎదుర్కోలేక బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం బనాయిస్తోన్న అక్రమ కేసుల డ్రామాను తెలంగాణ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని అన్నారు. కేటీఆర్‌పై అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం రాజకీయ అమాయకత్వమే తప్ప మరొకటి కాదని కవిత పేర్కొన్నారు.
ఫార్ములా ఈ - కార్ రేసింగ్ తో ప్రపంచ వ్యాప్తంగా రాష్ట్రం, హైదరాబాద్ ఇమేజ్ ను పెంచిన కేటీఆర్ గారిపై అక్రమ కేసులు పెట్టిన రేవంత్ సర్కార్.
— BRS Party (@BRSparty) December 19, 2024
మీరు పెట్టిన కేసు నిజమే అయితే, దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలి.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish pic.twitter.com/Be0wBoY6CV
అసలేంటీ ఈ ఫార్ములా రేస్ వ్యవహారం
గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేస్‌లో అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనిపై విచారించేందుకు ఏసీబీకి అనుమతి ఇచ్చింది. ఈ రేస్ వ్యవహారంలో ఎలాంటి అనుమతులు లేకుండా రూ.55 కోట్లు తరలించినట్లుగా ప్రాథమిక విచారణలో తేలిందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఆర్బీఐ అనుమతి కూడా తీసుకోకుండా విదేశీ కంపెనీకి తరలించారని పేర్కొంటున్నారు. విదేశీ కంపెనీకి భారతీయ కరెన్సీ చెల్లించడంపైనా ఆర్బీఐ రూ.8 కోట్ల ఫైన్ వేసిందని వెల్లడించారు. కాగా, ఈ వ్యవహారానికి సంబంధించి అక్టోబరులోనే ఏసీబీ గవర్నర్‌కు అనుమతి కోసం పంపింది. న్యాయసలహా తీసుకున్న అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఇటీవల అనుమతి ఇచ్చారు.
Also Read: Manchu Issue: అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !