Hyderabad Police: మహిళా పోలీస్‌కు కీలక బాధ్యతలు, చరిత్రలోనే తొలిసారి ఇది - కమిషనర్ సీవీ ఆనంద్ నిర్ణయం
Womens Day 2022: ఉమెన్స్ డే రోజున మంగళవారం హోంమంత్రి మహమూద్ అలీ, సీవీ ఆనంద్ సమక్షంలో ఆ మహిళకు ఈ కీలక బాధ్యతలు అప్పగించనున్నారు.
Hyderabad Police: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి రంగంలోనూ వారికి ప్రత్యేక గుర్తింపునిచ్చేలా ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి. కానీ, హైదరాబాద్ పోలీస్ విభాగంలో ఈ ఉమెన్స్ డే సందర్భంగా మాత్రం నగరంలోనే చారిత్రకమైన కార్యక్రమం జరగబోతోంది. ఓ మహిళా పోలీసుకు శాంతి భద్రతల విభాగ పోలీస్ స్టేషన్‌కు ఎస్ హెచ్ ఓ (స్టేషన్ హౌస్ ఆఫీసర్) బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ నిర్ణయాన్ని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తీసుకున్నారు. ఉమెన్స్ డే రోజున మంగళవారం హోంమంత్రి మహమూద్ అలీ, సీవీ ఆనంద్ సమక్షంలో ఆ మహిళకు ఈ కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. లాలాగూడా ఎస్‌హెచ్‌ఓగా ఆ పోలీసు అధికారిణి బాధ్యతలు స్వీకరిస్తారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసుల నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కేటాయించారు. అప్పటి నుంచి పోలీసుల్లో వీరి సంఖ్య బాగా పెరిగింది. అడిషనల్ డీజీ నుంచి కానిస్టేబుళ్ల వరకు కలిపి ప్రస్తుతం 3,803 మంది మహిళా పోలీసులు ఉన్నారు. వీరు కాక హోంగార్డులు వేరేగా ఉన్నారు. ఇన్‌స్పెక్టర్ హోదాలో ఉన్న వాళ్లు మొత్తం 31 మంది ఉన్నారు. అయినా కూడా వీరిలో శాంతిభద్రతల విభాగం పోలీస్ స్టేషన్‌కు ఎస్ హెచ్ ఓగా లేరు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఇప్పటి వరకు ఇలాంటి బాధ్యతలు ఎవరికీ అప్పగించలేదు.
ఫారెస్ట్, ఎక్సైజ్, ఆర్టీఏ, రెవెన్యూ విభాగాల్లో మాత్రం మహిళలకు వారి అర్హతకు తగ్గట్లుగా సమానమైన హోదాల్లో నియమిస్తున్నారు. కానీ, పోలీసుల్లో మాత్రం జరగడం లేదు. ఇప్పుడు ఉన్న మహిళా పోలీస్ స్టేషన్లు, షీ టీమ్‌లు, భరోసా వంటి స్టేషన్లకే మహిళలు నేతృత్వం వహిస్తున్నారు. అందుకే ప్రతిభ ఉన్న వారికి తమ పనితీరు ప్రదర్శించే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో సీపీ సీవీ ఆనంద్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ స్ఫూర్తితో ప్రస్తుతం డిపార్ట్‌మెంట్‌లో ఉన్నవారు, భవిష్యత్‌లో పోలీసు అయ్యేవారు సమర్థవంతంగా పని చేస్తారనే ఉద్దేశంతో ఈ కీలక బాధ్యతలు మహిళకు ఇవ్వనున్నారు.
ఇలా ఎస్ హెచ్ ఓ బాధ్యతలకు ఎంపిక చేయడం కోసం ఉన్నతాధికారులు చాలా కాలం నుంచి కసరత్తు చేశారు. నగరంలో ఉన్న ఉమెన్ ఇన్‌స్పెక్టర్ల ప్రొఫైల్, వారి ఘనతలు, గతంలో పని చేసిన ప్రాంతాల్లో చేరిన లక్ష్యాలు, వారి సామర్థ్యం వంటి వివరాలను విశ్లేషించి తుది పేరును ఖరారు చేశారు. ప్రతి అధికారిణినీ కమిషనరేట్‌కు పిలిచి లా అండ్ ఆర్డర్ విభాగంలో ఉండే ఛాలెంజ్‌లు, దానికి కావాల్సిన సమర్థత వంటి వాటిని వివరించారు. చివరికి ఓ మహిళను ఎంపిక చేశారు. మహిళా పోలీసుల ప్రతిభ ఆధారంగా ఎస్ హెచ్ ఓలలో కూడా 33 శాతం మహిళలు ఉండేలా చూడాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.