Year Ender 2024: ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన 2024 - కొత్త స్టార్ పవన్ కల్యాణ్ - జగన్ బిగ్గెస్ట్ లూజర్ !
Flashback 2024: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2024 ఊహించని మార్పులు తీసుకువచ్చింది. రాజకీయ ముఖ చిత్రాన్ని సంపూర్ణంగా మార్చేసింది.
2024 Andhra Pradesh Politics : 2024 కొత్త సంవత్సరం వచ్చినప్పుడు ఎన్నికల ఏడాది కావడంతో సంచలనాత్మక పరిణామాలు ఉంటాయని అందరూ ఊహించారు. కానీ ఆ పరిణామాలు ఎటు వైపు ఉంటాయో ఊహించలేకపోయారు. హోరాహోరీ పోరాటం ఉంటుందని అంచనా వేశారు. పోరాటం అలాగే ఉంది. దాడులుతో ఎన్నికలు హోరెత్తిపోయాయి. కానీ ఫలితాలు మాత్రం ఏకపక్షంగా వచ్చాయి. 2024 ఏపీ.. భవిష్యత్ కూడా చర్చించుకునే విధంగా మార్పులు తీసుకు వచ్చింది.
పొత్తులో బీజేపీ చేరిక
చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు రాజమండ్రి జైలు బయటే పవన్ కల్యాణ్ పొత్తు ప్రకటన చేశారు. అది 2023లోన్ అయిపోయింది. అయితే ఈ కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా అన్న సస్పెన్స్ మాత్రం సుదీర్ఘంగా కొనసాగింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత పొత్తులు ఖరారయ్యాయి. అప్పటికి టీడీపీ, జనసేన తొలి జాబితా కూడా ప్రకటించారు. ఈ పొత్తులు ఓ గేమ్ ఛేంజర్ గా మారాయి. ఎన్డీఏ కూటమిగా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే మరో వైపు జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఒంటరి పోరుకు సిద్దమయ్యారు. కమ్యూనిస్టుల్ని కూడా దగ్గరకు తీసుకోలేదు. ఎన్నికల షెడ్యూల్ కు.. నామినేషన్లకు నెల గడువు ఉండటంతో బస్సుయాత్ర చేశారు. మధ్యలో విజయవాడలో రాయిదాడి జరగడం రాజకీయంగా కలకలం రేపింది.
జూన్ 3న ఫలితాల్లో తుడిచి పెట్టుకుని వైసీపీ
పోలింగ్ రోజు ఎన్ని దాడులు ఎన్ని దౌర్జన్యాలు జరిగాయో చెప్పాల్సిన పని లేదు. అయితే ఈసీ కన్నెర్ర చేయడంతో ఎ తర్వాత పూర్తిగా సద్దుమణిగిపోయాయి. మాచర్ల లో ఈవీఎంను అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బద్దలు కొట్టడం దేశవ్యాప్తంగా హైలెట్ అయింది. ఆ తర్వాత కౌంటింగ్ రోజున వైసీపీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. మొత్తగా పదకొండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. వైసీపీ నేతలకు ఏడుపొక్కటే తక్కువ అన్నట్లుగా ఫలితాలు వచ్చాయి. కొంత మంది సర్వేలను నమ్ముకుని వైసీపీ నేతలు వందల కోట్ల మేర బెట్టింగులు కాసి డబ్బులు పోగొట్టుకున్నారు. బెట్టింగుల్లో నష్టపోయి పెద్ద ఎత్తున ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
ఏపీ రాజకీయాల్లో అసలైన పవర్ స్టార్
జూన్ మూడున వచ్చిన ఫలితాలతో ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ సరికొత్త పవర్ స్టార్ గా ఆవిర్భవించారు. జనసేన పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీ సీట్లలో విజయం సాధించింది. రెండు ఎంపీ సీట్లలోనూ గెలిచిది. బీజేపీ పోటీ చేసిన వాటిలో మూడు చోట్ల మినహా అన్ని చోట్ల గెలిచింది. టీడీపీ పోటీ చేసిన వాటిలో ఎనిమిది చోట్ల మినహా అన్ని చోట్ల గెలించింది. ఓ రకంగా ఏపీ పసుపుమయం అయిపోయింది. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత రెండు నెలలు పూర్తిగా పాలనపైనా దృష్టి పెట్టిన పవన్ .. తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం వెలుగులోకి రావడంతో సనాతన ధర్మ పరిరక్షణకు సిద్ధమయ్యారు. వారాహి సనాతన ధర్మ డిక్లరేషన్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ హిందువులకు కష్టం వచ్చినా స్పందిస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం తర్వాత పవన్ కల్యాణ్ జాతీయ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నారు. ఓ రకంగా 2024లో ఏపీలో కొత్త పవర్ స్టార్ రాజకీయంగా ఉద్భవించారని అనుకోవచ్చు. ఏడాది చివరిలో ఆయన సోదరుడు నాగబాబు కూడా మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.
కేసుల ఒత్తిడిలో వైసీపీ - జగన్ చుట్టూ అమెరికా కేసు
అధికారం కోల్పోయిన వైసీపీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఓ వైపు పార్టీకి మనుగడు ఉంటుందా ఉండదా అన్న అనుమానంతో చాలా మంది సీనియర్ నేతలు ఇప్పటికీ బయటకు రావడం లేదు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కూటమి అభ్యర్థలుకు ఎక్కడ చూసినా కనీసం యాభై వేల మెజార్టీ వచ్చింది. దీంతో కూటమిగా ఉన్నంత కాలం టీడీపీ, జనసేన పార్టీలను ఓడించడం అసాధ్యమన్న భావనకు ఎక్కువ మంది వస్తున్నారు. కుదిరితే ఆ రెండు పార్టీల్లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరో వైపు వైసీపీ కీలక నేతలంతా కేసుల ఒత్తిడిలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బ హిరంగంగా దోపిడీ చేశారని టీడీపీ ప్రభుత్వం విచారణలకు ఆదేశాలు జారీ చేసింది. మరో వైపు ఉరుములేని పిడుగులా సెకీ విద్యుత్ ఒప్పందాల విషయంలో అదానీ నుంచి జగన్ రూ. 1750 కోట్లు లంచం తీసుకున్నారని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ కోర్చుకు వెల్లడించడంతో ఇక్కడ దుమారం రేగింది. ఈ కేసు ఇంకా నివురుగప్పిన నిప్పులానే ఉంది.
ఎదిగేందుకు షర్మిల ప్రయత్నాలు !
మరో వైపు దాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కు ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల ఎన్నిక అవడం 2024లో మరో కీలకమైన పరిణామం. తెలంగాణ నుంచి ఏపీ రాజకీయాల్లోకి వచ్చిన ఆమె తన పార్టీని కనీస ఓటు బ్యాంక్ సంపాదించి పెట్టేందుకు చేయని ప్రయత్నం లేదు. ఎన్నికల్లో సరైన ఫలితాలు రానప్పటికీ కొన్ని చోట్ల వైసీపీ ఓటమికి కారణం అయ్యారు. ఆ ధైర్యంతో రానున్న కాలంలో పార్టీని బలోపేతం చేసుకునేందుకు విస్తృతంగా పర్యటిస్తున్నారు.
మొత్తంగా 2024 ఏపీ రాజకీయాల్లో సమూల మార్పులుతీసుకు వచ్చింది. వచ్చే ఏడాది రాజకీయంగా మరిన్ని సంచలనాలు ప్రజల ముందు ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.