Pawan Kalyan: ఆర్టీవో ఆఫీసుకు పవన్ కల్యాణ్, ఆరు కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ - డ్రైవింగ్ లైసెన్స్ కూడా
పవన్ కల్యాణ్ ప్రచార రథం వారాహి రథం రిజిస్ట్రేషన్ కొద్ది రోజుల క్రితమే తెలంగాణలో పూర్తయిన సంగతి తెలిసిందే.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురువారం (డిసెంబరు 22) హైదరాబాద్‌లోని ఆర్టీఏ ఆఫీసుకు వచ్చారు. ఆయన కొత్తగా కొనుగోలు చేసిన వాహనాల రిజిస్ట్రేషన్ సహా అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కోసం స్వయంగా పవన్ కల్యాణ్ ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ ఆఫీసుకు వచ్చారు. సాధారణ సమయాల్లో ఆర్టీఏ ఆఫీసుకు వస్తే అప్పటికే అక్కడ ఉండే వందలాది మంది వాహనదారులు, జనాలతో అందరికీ ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి, పని వేళలు ముగిశాక పవన్ కల్యాణ్ ఆర్టీఏ ఆఫీసుకు వచ్చారు. ఆయనకు అధికారులు మధ్యాహ్నం 3 గంటలకు సమయం కేటాయించారు.
పవన్ కల్యాణ్ నేరుగా వచ్చి రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ పాపారావును కలిశారు. ముందస్తుగానే స్లాట్‌లు బుక్ చేసుకోవడంతో వెంటనే ఆయన పనులు పూర్తి చేశారు. తర్వాత పవన్ కల్యాణ్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం కూడా అప్లై చేశారు.
పవన్ కల్యాణ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాహనాల్లో ఒక మెర్సిడిస్ బెంజ్ కారు, రెండు మహీంద్రా స్కార్పియోలు, ఒక జీపు, టయోటా వెల్‌ఫైర్ కారుతో పాటుగా ఒక గూడ్స్ కేరియర్ వెహికిల్ కూడా ఉందని డిప్యూటీ కమిషనర్ పాపారావు తెలిపారు.
వారాహి రిజిస్ట్రేషన్ కూడా పూర్తి
పవన్ కల్యాణ్ ప్రచార రథం వారాహి రథం రిజిస్ట్రేషన్ కొద్ది రోజుల క్రితమే తెలంగాణలో పూర్తయిన సంగతి తెలిసిందే. జనసేన అధినేత ఆ వాహనంతో దిగిన ఫోటోలను తమ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. వారాహి వాహనం రంగు విషయంలో నిబంధనలకు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ వ్యవహరించలేదని, అన్ని రూల్స్‌కు అనుగుణంగా ఉండటంతో వాహనానికి రిజిస్ట్రేషన్ చేశామని అధికారులు తెలిపారు. వాహన రిజిస్ట్రేషన్‌లో ఎలాంటి అభ్యంతరాలు లేవు అని తెలంగాణ ఆర్టీవో అధికారులు స్పష్టం చేశారు. వారాహి రంగు ఆలివ్ గ్రీన్ కాదని, ఎమరాల్డ్ గ్రీన్ అని గుర్తించడంతో రిజిస్ట్రేషన్ చేశామని తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం వాహనం తమ వద్దకు వచ్చినప్పుడు అన్ని నిబంధనలు పక్కాగా పరిశీలించామని.. నిబంధనల ప్రకారం వాహనం రంగు ఉండటంతో రిజిస్ట్రేషన్ పూర్తి చేసేందుకు అంగీకరించారు. రెండు వారాల క్రితమే TS 13 EX 8384 నెంబరుతో రిజిస్ట్రేషన్ పూర్తి అయిందని.. ట్రాన్స్‌పోర్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ తెలంగాణ పాపారావు మీడియాకు తెలిపారు.
ఏపీలో బస్సు యాత్ర కోసం పవన్ కల్యాణ్ సిద్దం చేసిన వాహనం రంగుపై ప్రత్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మిలిటరీ వాహనాలకు వేసే రంగును ఉపయోగించవద్దని, ప్రభుత్వ విధానాలకు, నిబంధనలకు ఎలా వ్యతిరేకంగా వ్యవహరిస్తారని అధికార పార్టీ నేతలు ప్రశ్నించారు. మొత్తానికి తెలంగాణలో వారాహి వాహనానికి రిజిస్ట్రేషన్ కావడంతో ఏపీలోని నేతలకు ఝలక్ ఇచ్చినట్లయింది.
వారాహి వాహనానికి చంద్రన్న పంది అనే పేరు పెట్టుకుంటే బాగుంటుందని మంత్రి అంబటి రాంబాబు కూడా కొద్ది రోజుల క్రితం సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ తనపై చేసిన అవినీతి ఆరోపణలను వెంటనే నిరూపించాలని, అలా చేసినట్లయితే తాను మంత్రి సహా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అంబటి సవాల్ విసిరారు.