తీరం దాటిన తుపాను, కొద్దిగంటల్లో ఏపీ, తెలంగాణకు బిగ్ అలర్ట్!
బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఫెంగల్ తుఫాను కారణంగా దక్షిణాదిన చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు ఈదురు గాలులు వీచాయి. ఇది మహాబలిపురం దగ్గరలో శనివారం రాత్రి తీరం దాటిందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. తుపాను ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా శుక్రవారం చెన్నైకి వెళ్లే పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విమానయాన సంస్థలు తమ సేవలకు సంబంధించి సర్వీసు రద్దు ప్రకటనలను కూడా జారీ చేశారు. ఇంకా తుఫాను కారణంగా సంభవించిన భారీ వర్షాలు రైలు సేవలకు కూడా అంతరాయం కలిగించాయి. దక్షిణాది రైల్వే జోన్లు కూడా పలు రైళ్లను రద్దు చేశాయి. ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇవాళ, రేపు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. ఇప్పటికే పుదుర్చేరి నీట మునిగింది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దక్షిణ కోస్తాలో గరిష్ఠంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని స్పష్టం చేసింది. ఇప్పటికే వేటకు వెళ్లిన వారు వెంటనే తీరానికి చేరుకోవాలని సూచించింది. తుపాను నేపథ్యంలో, ఏపీలోని కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇండియాకు చెందిన ఇన్సాట్-3డీఆర్, ఈవోఎస్ -06 శాటిలైట్ల ద్వారా ఎప్పటికప్పుడు పెంగల్ తుపాను స్థితిని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్రో అందిస్తోంది.