Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Andhra News: 'ఫెంగల్' తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం స్కూళ్లు, కాలేజీలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు.
Schools Holidays Due To Fengal Cyclone: ఏపీలో 'ఫెంగల్' తుపాను (Fengal Cyclone) ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం కూడా భారీ వానలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. చిత్తూరు జిల్లా (Chittor District) వ్యాప్తంగా అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. వానల నేపథ్యంలో ముందస్తుగా సెలవు ఇచ్చారు. అటు, అన్నమయ్య జిల్లాలోనూ అన్ని విద్యా సంస్థలకు కలెక్టర్ చామకూరి శ్రీధర్ సోమవారం సెలవు ప్రకటించారు. జిల్లాలోని అన్నీ ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇచ్చారు. కాగా, నెల్లూరు, తిరుపతి, వైఎస్ఆర్ జిల్లాల్లోనూ విద్యా సంస్థలకు సెలవు ఇవ్వాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. అటు, తుపాను ప్రభావం రాష్ట్రంలో మరో 24 గంటల పాటు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ప్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
అటు, నెల్లూరు జిల్లాలోనూ భారీ వర్షాలతో పంటలు నీట మునిగాయి. సిటీలోని పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. ముత్తుకూరు, ఇందుకూరుపేట, విడవలూరు, కొడవలూరు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. వర్ష తీవ్రత దృష్ట్యా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లాలోనూ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.
తిరుపతిలో విరిగిన కొండ చరియలు
'ఫెంగల్' ప్రభావంతో తిరుపతిలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే రెండో ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో సిబ్బంది జేసీబీలతో బండరాళ్లను తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు. భారీ వర్షాలతో తిరుమలలో జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి.
వరద నీటి ప్రవాహంతో మొత్తం 5 జలాశయాల్లోకి నీరు చేరుకుంటోంది. గోగర్భం డ్యామ్ పూర్తిగా నిండిపోవడంతో 2 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుత నీటి నిల్వలు తిరుమలకు 200 రోజుల తాగునీటి అవసరాలకు సరిపోతాయని అధికారులు తెలిపారు. మరోవైపు, విశాఖ - తిరుపతి విమాన సర్వీసులను సైతం రద్దు చేశారు. అటు, అన్నమయ్య జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రైల్వేకోడూరు నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సమీపంలోని గుంజన నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పరీవాహక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
ముందుకొచ్చిన సముద్రం
తుపాను ప్రభావంతో ప్రకాశం జిల్లా కొత్తపట్నం సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. సముద్రం 20 మీటర్లు ముందుకు వచ్చినట్లు మెరైన్ పోలీసులు తెలిపారు. మత్స్యకారులను సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు, భారీ వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కోతల సమయం కావడంతో ధాన్యం తడిచిపోతుందని.. వరి చేలు నేలకొరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అలల ఉద్ధృతి ఉప్పాడ - కాకినాడ బీచ్ కోతకు గురైంది. మాయపట్నం, అమీనాబాద్, సూరాడపేట, జగ్గరాజుపేట, కొత్తపట్నం, సుబ్బంపేటల్లో మత్స్యకారులకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.