CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Telangana News: సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా సొమ్ము జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే విధివిధానాలు ఖరారు చేస్తామని స్పష్టం చేశారు.
CM Revanth Reddy Comments On Rythu Bharosa: రాష్ట్రంలో రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసా కొనసాగిస్తామని స్పష్టం చేసింది. సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా (Rythu Bharosa) సొమ్ము జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మారీచుల మాటలు నమ్మొద్దని.. సోనియా గాంధీ గ్యారెంటీగా తాను చెబుతున్నట్లు వెల్లడించారు. రైతు భరోసాపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో సబ్ కమిటీ వేశామని.. త్వరలోనే విధివిధానాలు ఖరారు చేస్తామని చెప్పారు. రూ.2 లక్షల రైతు రుణమాఫీ ఎలా పూర్తి చేశామో.. రైతు భరోసా హామీ కూడా అలాగే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అలాగే, రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు.
'అప్పులున్నా సంక్షేమ పాలన అందిస్తున్నాం'
'మాజీ సీఎం కేసీఆర్ రూ.7 లక్షల కోట్ల అప్పుతో మాకు ప్రభుత్వాన్ని అప్పగించారు. సర్కారు ఇంత అప్పుల్లో ఉందని కేసీఆర్, హరీశ్ రావు, ఆర్థిక మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్, అధికారులు ఎవరూ మాకు చెప్పలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర ఆస్తులు, అప్పులపై శ్వేతపత్రం విడుదల చేశాం. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై ప్రతి నెలా రూ.6,500 కోట్ల వడ్డీ చెల్లిస్తున్నాం. భారీగా అప్పు ఉన్నా అధైర్యపడకుండా పాలన సాగిస్తున్నాం. కేసీఆర్ బకాయి పెట్టిన రూ.7,625 కోట్ల రైతు బంధు బకాయిలు మేం అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లించాం. ఇప్పటివరకూ 25.35 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణాలు మాఫీ చేశాం. మిగతా 9 ఏళ్లు కూడా అన్ని కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహిస్తామనే నమ్మకం కలిగింది. రైతులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీయే. ఇది అప్పటి నెహ్రూ నుంచి ఇప్పటివరకూ జరిగింది. రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను పదేళ్ల పాటు మోసం చేసింది.' అంటూ సీఎం రేవంత్ మండిపడ్డారు.
'రైతుల ఆశీర్వాదమే గొప్ప శక్తి'
పాలమూరులో జరిగిన రైతు పండుగలో వేలాది మంది రైతులు పాల్గొని ఆశ్వీరాదం ఇచ్చారని.. రైతుల ఆశ్వీరాదం ప్రభుత్వానికి గొప్ప శక్తిని ఇచ్చిందని సీఎం రేవంత్ తెలిపారు. 'వాస్తవాల ప్రాతిపదికన మా ప్రభుత్వం భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటోంది. రైతును రాజును చేయడమే లక్ష్యంగా మా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. రుణమాఫీ, ఉచిత విద్యుత్, సబ్సిడీ ఎరువులు, మద్దతు ధర, ఉపాధి హామీ పథకం లాంటి వాటితో రైతులను ఆదుకుంటున్నాం. ఇప్పటి వరకు 31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మా ప్రభుత్వం సేకరించింది. వచ్చే సీజన్ కూడా రూ.500 బోనస్ కొనసాగుతుంది. సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు సన్న బియ్యంతో భోజనం పెడతాం. రూ.2 లక్షల వరకు వంద శాంత రుణమాఫీ పూర్తైంది. రేషన్ కార్డు లేని వారికి కూడా రుణమాఫీ అయింది.' అని స్పష్టం చేశారు.