Hyderabad News: విలాసవంతమైన ఇళ్లు కొనుగోలులో హైదరాబాద్ టాప్- ఐదేళ్లలోనే భారీగా పెరిగిన అమ్మకాలు
Hyderabad News: హైదరాబాద్ లో ఇళ్లు, ఫ్లాట్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దేశంలోని అన్ని నగరాలతో పోలిస్తే.. హైదరాబాద్ లో గత ఐదేళ్లలో మరింత ఎక్కువయ్యాయి.
Hyderabad News: హైదరాబాద్ లో ఇళ్ల ధరలు భారీగా పెరిగిపోయాయి. కరోనా అనంతరం ప్రజలంతా విలాసవంతమైన ఇళ్లు కొనుక్కునేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇళ్ల, ఫ్లాట్ల ధరల పెరుగుదల దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే.. హైదరాబాద్ లో అధికంగా ఉంది. మధ్యశ్రేణి, ప్రీమియం విభాగాల్లో ఇళ్ల ధరల పెరుగుదల 23 శాతంగా ఉండగా.. విలాసవంతమైన గృహాల సగటు ధరలు (1.5 కోట్లకుపైగా సెగ్మెంట్) 42% శాతం పెరిగాయని తెలుస్తోంది.
దేశంలోని 7 ప్రధాన నగరాల్లో రూ.1.5 కోట్లకు మించి ధర ఉన్న విలాసవంతమైన ఇళ్ల ధరలు గత ఐదేళ్లలో సగటున 24 శాతం పెరిగాయని స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్ వెల్లడించింది. 40 లక్షల లోపు ఇళ్లు, ఫ్లాట్ ధరలు 15 శాతం పెరిగాయని చెప్పింది. అలాగే 40 లక్షల రూపాయల నుంచి రూ.1.5 కోట్ల వరకు ఉన్న మధ్యశ్రేణి ప్రీమియం విభాగాల్లో ధరల పెరుగుదల సగటున 18 శాతం ఉందని తెలిపింది. 2018లో ఏడు నగరాల్లో విలాసవంతమైన ఇళ్ల ధర చదరపు అడుగుకు సగటు రూ.12,400గా ఉందని.. ఇప్పుడు రూ.15,350కి పెరిగిందని మంగళవారం విడుదల చేసిన నివేదికలో సంస్థ పేర్కొంది.
అందుబాటు ధర ఇళ్ల చదరపు అడుగు ధర 2018లో రూ.3,750 ఉండగా.. ప్రస్తుతం రూ.4,310గా ఉందని తెలిపింది. అలాగే మధ్య, ప్రీమియం ఇళ్ల విభాగంలో ఐదేళ్ల క్రితం చదరపు అడుగు సగటు ధర రూ.6,050 కాగా.. ఇప్పుడు రూ.7,120కి చేరిందన్నారు. ఐదేళ్ల క్రితం విలాసవంతమైన ఇళ్ల చదరపు అడుగు సగటు ధర రూ.7,450 నుంచి 10,580కి పెరిగాయి. అయితే మొదటి ఏడు నగరాల్లో 2018లో చదరపు అడుగులకు 12,400 నుంచి 15,350కి అంటే 24 శాతం పెరిగింది. నగరాల వారీగా చూస్తే.. రూ.1.5 కోట్లు, ఆపై విలువ ఉన్న ఇళ్ల ధరలు 2018 నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ లో 42 శాతం పెరిగాయని చెప్పింది.
ఢిల్లీలో 22 శాతం, కోల్ కతాలో 12 శాతం, ముంబయిలో 27 శాతం, పుణేలో 19 శాతం, చెన్నైలో 15 శాతం, బెంగళూరులో 27 శాతం చొప్పున పెరిగాయి. అలాగే రూ.40 లక్షల నుంచి 1.5 కోట్ల మధ్య ఉన్న ఇళ్ల ధరలు హైదరాబాద్ లో సగటున 23 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. మరోవైపు విలాసవంతమైన కేటగిరీలో 27 శాతం సగటు ధరల పెరుగుదలతో హైదరాబాద్ తర్వాత బెంగళూరు, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ రెండవ స్థానంలో ఉంది. హైదరాబాద్ ఇప్పటికే ఇతర రియల్ ఎస్టేట్ చార్ట్ లతో పోలిస్తే అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోందని.. ఇక్కడ విలాసవంతమైన ఇళ్ల కొనుగోలు కోసం ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
నియోపోలిస్ ఫేజ్-2 భూముల రికార్డు వేలం.. ఎకరం రూ.72 కోట్లు
హైదరాబాద్ శివారులోని కోకాపేటని యోపాలిస్ భూముల వేలం సర్కార్ కు కాసుల వర్షం కురిపిస్తోంది. గతేడాది కంటే ఈ సారి వేలంలోరికార్డు స్థాయి ధరకు ప్లాట్లు అమ్ముడుపోయాయి. అత్యధికంగా ఎకరం 72 కోట్లు పలకగా... అతి తక్కువగా 51.75 కోట్లు అమ్ముడుపోయింది. మొత్తంగా నాలు ప్లాట్లకు రూ. 1532.5 కోట్లు పలికింది. కోకాపేటలో ఉన్న 45.33 ఎకరాల్లో ఉన్న 7 ప్లాట్లకు హెచ్ఎండీ వేలం నిర్వహించింది. ఇంకా మూడు ప్లాట్లను వేలం వేయనుంది. ఈ వేలం ద్వారా దాదాపు రూ. 2500 కోట్లు రాబట్టాలని అధికారులు అంచనా వేస్తున్నారు. 2021లో ఇదే ఏరియాలో వేలం నిర్వహించగా కనిష్టంగా ఎకరా రూ. 31 కోట్లు ,గరిష్టంగా రూ. 60 కోట్లు పలికింది.