Cab Booking: అలర్ట్! క్యాబ్ బుక్ చేసుకోవాలా? అందులో ఇక ఈ సౌకర్యం దొరకదు, డ్రైవర్ల కొత్త డిమాండ్
Uber, Ola Cabs News: పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నా ఈ క్యాబ్ బుకింగ్ సంస్థలు కమీషన్ పెంచక పోవడాన్ని డ్రైవర్లు వ్యతిరేకిస్తున్నారు.
Cab Bookings: అసలే ఎండాకాలం.. అందరూ చల్లదనం కోసం తపించిపోతుంటారు. ఇక ఈ కాలంలో ప్రయాణాలు మరీ చిరాగ్గా ఉంటాయి. కాబట్టి, వీలైనంతగా అంతా ఏసీ ప్రయాణాలవైపే మొగ్గు చూపుతారు. బస్సు ప్రయాణాలైనా, క్యాబ్‌లైనా ఏసీ ఉంటే అంత త్వరగా అలసట రాదు. ఇలాంటి పరిస్థితుల్లో క్యాబ్‌లలో వెళ్లాలనుకునే వారికి మాత్రం కాస్త చేదు వార్త. వాటిలో ఇక ఏసీ ఆన్ చేయరట. కావాలనుకుంటే మాత్రం అదనంగా డబ్బు చెల్లించాల్సిందే. ఎందుకంటే క్యాబ్ డ్రైవర్లందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 29 నుంచి ఇది వర్తించనుంది.
ఓలా, ఊబర్ లాంటి సంస్థలకు చెందిన క్యాబ్‌ల్లో ప్రయాణించేవారు ఏసీ కావాలనుకుంటే రూ.50 అదనంగా చెల్లించాల్సిందే. పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నా ఈ క్యాబ్ బుకింగ్ సంస్థలు డ్రైవర్లకు ఇచ్చే కమీషన్ పెంచక పోవడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ ఈ ‘నో ఏసీ’ నిర్ణయాన్ని తీసుకుంది. ఇందులో భాగంగా డ్రైవర్లు రైడ్ చేసే సందర్భంలో ఏసీ ఆఫ్ చేస్తున్నారు. ఏసీ కావాలంటే 25 కిలోమీటర్ల వరకూ అదనంగా రూ.25 నుంచి రూ.50 ఇవ్వాలని కోరుతున్నారు. కొందరు డ్రైవర్లు 25- 50 కిలోమీటర్ల మధ్య ప్రయాణానికి రూ.100 ఇవ్వాలని షరతులు పెడుతున్నారు. ప్రయాణికులు కూడా తమ డ్రైవర్ల ఇబ్బందులను అర్థం చేసుకోవాలని కోరుతున్నారు.
ఇంధన ధరల పెరుగుదల వల్లే
రెండేళ్ల కాలంలో పెట్రోలు, డీజిల్ ధరలు బాగా పెరిగాయి. డ్రైవర్లపై అది భారమే. దానికి అనుగుణంగా ఓలా, ఉబర్ సంస్థలు డ్రైవర్లకు ఇచ్చే బేస్ ఫెయిర్ మాత్రం పెంచలేదని వారు ఆరోపిస్తున్నారు. రెండేళ్ల నాటి ధరలనే ఇప్పటికీ అమలు చేస్తున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం ఒక్కో డ్రైవర్‌కు బేస్ ఫేర్ రూ.12-13 వరకూ ఇస్తున్నారని, పెరిగిన ఇంధన ధరల ప్రకారం రూ.24 నుంచి 25 వరకూ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇలా ధరలు పెంచితే ప్రయాణికులకు ఏసీ ఆన్ చేసేందుకు సిద్ధమని చెబుతున్నారు. క్యాబ్‌లలో ‘నో ఏసీ’ ప్రచార కార్యక్రమం తొలుత కోల్‌కతాలో ప్రారంభమైంది. అనంతరం దిల్లీ, ముంబయి, లఖ్‌నవూలో టాక్సీ డ్రైవర్లు దీన్ని అనుసరించాయి. తాజాగా హైదరాబాద్ డ్రైవర్లు దీన్ని ప్రారంభించారు.
నేడు, రేపు సమ్మెకు మద్దతు
మార్చి 28, 29 తేదీల్లో దేశవ్యాప్త కార్మిక సమ్మెకు రాష్ట్రంలోని క్యాబ్‌లు, ఆటోల సంఘాలు మద్దతు పలికాయి. ఈ సోమవారం బంద్ పాటిస్తున్నట్టు తెలంగాణ ఆటో డ్రైవర్ యూనియన్ల జేఏసీ ప్రకటించింది. ఉదయం 11 గంటలకు ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయం ముందు యూనియన్ నేతలు, డ్రైవర్లతో ధర్నా నిర్వహిస్తామని, మంగళవారం దిష్టిబొమ్మలు దహనం చేసి నిరసన తెలుపుతామని ప్రకటించింది.