Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం, కోట్లలో ఆస్తి నష్టం
Hyderabad Fire Accident: హైదరాబాద్ లోని ఆరాంఘర్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని సమాచారం.
Fire Accident In Hyderabad: హైదరాబాద్: భాగ్యనగరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆరాంఘర్ లో సోమవారం మధ్యాహ్నం మహీంద్రా షోరూం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షోరూం వెనుక వైపు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతాన్ని దట్టమైన పొగలు కమ్మేశాయి. కోట్ల రూపాయల్లో భారీగా ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని తెలుస్తోంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. దట్టమైన పొగ కమ్ముకోవడంతో శివరాంపల్లి ఆరాంఘర్ చౌరస్తాలో ట్రాఫిక్ కాసేపు నిలిచిపోయింది. వాహనదారులు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి. బస్సుల స్క్రాప్ గోదాంలో మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. దట్టమైన పొగ కమ్మేయడంతో ఆరాంఘర్ ప్రాంత ప్రజలు ఊపిరి తీసుకోలేక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. స్థానికులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అత్తాపూర్ పీఎస్ పరిధిలో అగ్నిప్రమాదం
హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు (Fire Accident In Hyderabad) చోటుచేసుకున్నాయి. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఎం పహాడీలో ఆరాంఘర్ లో ఆర్టీసీ స్క్రాప్ గోదాంలో మంటలు చెలరేగాయి. ఎంఎం పహాడీలోని స్క్రాప్ గోదాంలో సోమవారం మంటలు చెలరేగడంతో.. స్థానికులు ప్రాణ భయంతో అక్కడి నుంచి దూరంగా పరుగులు తీశారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని 2 ఫైరింజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు, పోలీసులు తెలిపారు. ఇలాంటి ఘటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని, చూసిన వెంటనే అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించడం ద్వారా త్వరగా అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పివేసి ప్రమాద తీవ్రతను తగ్గించే అవకాశం ఉందన్నారు.
Also Read: కలెక్టర్‌పై చేయి చేసుకున్న మహిళా రైతు - ఫార్మా కంపెనీ ప్రజాభిప్రాయ సేకరణ రసాభాస