Australia vs India 4th T20I Match Highlights | నాలుగో టీ20 లో గెలిచిన టీమిండియా | ABP Desam
హమ్మయ్య మొత్తానికి సిరీస్ అయితే నిలబడింది. కంగారూలకు చేతికి సిరీస్ పోకుండా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ లో టీమిండియా ఆస్ట్రేలియాపై 48పరుగుల తేడాతో విజయం సాధించింది. యధావిథిగా టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన భారత్...తడబడుతూ పడిలేస్తూనే బ్యాటింగ్ చేసింది. శుభ్ మన్ గిల్ 46 పరుగులు చేయటం మినహా మిగిలిన బ్యాటర్లంతా అంతగా సక్సెస్ కాలేదు. అభిషేక్ 28, శివమ్ దూబే 22, కెప్టెన్ స్కై 20పరుగులు, చివర్లో అక్సర్ 21 పరుగులు చేసి తలో చేయి వేయటంతో కనీసం భారత్ 8వికెట్ల నష్టానికి 167పరుగులు చేసింది. 168 టార్గెట్ తో బరిలోకి దిగిన ఆసీస్ ను మన బౌలర్లు ఆపగలరా అనిపించింది కానీ మనోళ్లు అద్భుతమే చేశారు. ఓపెనర్లు మిచ్ మార్ష్, మాథ్యూ షార్ట్ కాస్త మన బౌలర్లను ఆడుకున్నట్లు కనిపించినా ఇక ఆ తర్వాత అంతా పేకమేడలా కూలిపోయారు. 30పరుగులు చేసిన కెప్టెన్ మార్షే టాప్ స్కోరర్. రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వికెట్లు టపా టపా తీస్తూ ఆసీస్ ను ఊహించని రీతిలో 119 పరుగులకే కుప్ప కూల్చారు భారత బౌలర్లు. సుందర్ 3 వికెట్లు, అక్షర్ పటేల్ , దూబే రెండేసి వికెట్లు తీసి స్పిన్ ఉచ్చులో కంగారూలను పట్టేశారు. బుమ్రా, వరుణ్, అర్ష్ దీప్ కూడా చెరో వికెట్ నేల కూల్చటంతో భారత్ 48పరుగుల తేడాతో విక్టరీ కొట్టేసి సిరీస్ లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక ఆఖరి టీ20 మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే. ఓడితే డ్రా. కానీ సిరీస్ కోల్పోవటం అయితే ఉండదు టీ20ల నెంబర్ జట్టు అయిన భారత్ కు.






















