Telangana Latest News: తెలంగాణలో బీసీలను మరింత దగ్గరయ్యేలా కాంగ్రెస్ మరో మాస్టర్ ప్లాన్!
తెలంగాణలో బీసీలకు ప్రయార్టీ ఇచ్చేందుకు మరో స్కెచ్ వేసింది కాంగ్రెస్. త్వరలో జరిగే మంత్రివర్గంలో బీసీలకు ప్రయార్టీ ఇవ్వడంతోపాు మరో డీసీఎం పోస్టు క్రియేట్ చేయనుంది. అది బీసీలకే ఇవ్వనున్నారు.

Telangana Latest News: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, బీసీల ఓటు బ్యాంకును పూర్తిగా తమవైపు ఉండేలా ప్లాన్‌లు వేస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే రిజర్వేషన్ల పెంపునకు ప్రయత్నాలు చేస్తోంది. ఇది ఇప్పటికీ కోర్టుల్లో పెండింగ్‌లో ఉంది. కొత్త రిజర్వేషన్ల ఆధారంగానే స్థానికసంస్థల ఎన్నికలకు వెళ్లాలని భావించినప్పటికీ న్యాయపరమైన చిక్కులు, కేంద్రం మోకాలు అడ్డేయడంతో వీలు కాలేదు. అందుకే ఇప్పుడు మరో ప్లాన్ వేస్తోంది. రాష్ట్రంలో మరో డిప్యూటీ సీఎం పదవిని క్రియేట్ చేయబోతోంది. అది బీసీలకు ఇవ్వాలని చూస్తోంది.
త్వరలో మంత్రివర్గ విస్తరణ
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే దీని కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే మంత్రి పదవుల్లో ఉన్న వారికి ఉద్వాసన పలికి కొత్త వారికి స్థానం కల్పించాలని భావిస్తున్నారు. వివాదాలను సృష్టిస్తున్న వారి స్థానంలో మరికొందరు సీనియర్లను మంత్రివర్గంలోకి తీసుకుంటారు. అలా తీసుకున్న వారిలో బీసీలతో మ్యాచ్ చేయాలని చూస్తోంది. ఇలా తీసుకున్న బీసీల్లో ఒకరికి ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టనున్నారు.
ఇప్పటికే ఉన్న మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా మల్లుభట్టి విక్రమార్క ఉన్నారు. ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత. ఇప్పుడు కొత్తగా బీసీలకు మరో ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఆయా వర్గాల్లో కాంగ్రెస్ పట్ల ఆదరాభిమానాలు పెరుగుతాయని భావిస్తున్నారు. ఓవైపు ఇప్పటికే ఎస్సీ, ఎస్టీల్లో ఉన్న ఓటు బ్యాంకును బలోపేతం చేసుకుంటూనే బీసీల్లో స్ట్రాంగ్ ఓటింగ్ పెంచుకోవాలని చూస్తున్నారు.
మహేష్ కుమార్‌కు ప్రమోషన్
ఇప్పుడు మంత్రులుగా ఉన్న కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి వాళ్లను తప్పించబోతున్నారు. వారి స్థానంలో కొత్త వారిని కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను నియమించుకోనున్నారు. ఈ క్రమంలో మంత్రివర్గం నుంచి తప్పిస్తున్న వీళ్లకు పార్టీలో గౌరవప్రదమైన పదవులు కట్టబెట్టాలని చూస్తున్నారు. ఈ మార్పులు చేర్పుల్లో భాగంగా పీసీసీ చీఫ్‌గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్‌కు మంత్రి పదవి వరించబోతోంది. ఆయన స్థానంలో పొన్న ప్రభాకర్‌ను నియమించనున్నారు.
ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే?
పీసీసీ చీఫ్‌గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్‌కు మంత్రి పదవితోపాటు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తారనే ప్రచారం జోరుగా పార్టీలో సాగుతోంది. ఇలా చేయడం వల్ల బీసీలకు ప్రయార్టీ ఇచ్చారనే వాదనతోపాటు సీనియర్‌ను కూడా గుర్తించారనే ప్రచారం నేతలకు చేరుతుందని భావిస్తున్నారు. ఇలా అన్ని రంగాల్లో బీసీలకు ప్రయార్టీ ఇవ్వడంతోపాటు, వచ్చే ఎన్నికలకు గ్రౌండ్ ప్రిపేర్ చేసినట్టు ఉంటుందని భావిస్తున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి తెలంగాణలో అమలు చేసిన విధానాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకొనేలా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఇలా అన్ని జాతీయ స్థాయిలో చేసే రాజకీయాలకు తెలంగాణను ఓ మోడల్‌గా మార్చుకోవడానికి ప్రయత్నిస్తోంది.





















