Bandi Sanjay : గోపీనాథ్ ఆస్తుల పంపకంలో రేవంత్, కేటీఆర్ మధ్య తేడాలు- బండి సంజయ్ సంచలన ఆరోపణలు
Bandi Sanjay : గోపీనాథ్ ఆస్తులపై రేవంత్ రెడ్డి, కేటీఆర్ కన్నేశారని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఈ పంపకాల్లో వచ్చిన విభేదాలు ఇప్పుడు రచ్చకెక్కాయని తెలిపారు.

Bandi Sanjay : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మరోమారు సంచలన ఆరోపణలు చేశారు. మాగంటి గోపీనాథ్ ఆస్తుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ కన్నేశారని చెప్పారు. ఆస్తి పంపకాల్లో ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయన్నారు. గోపీనాథ్ మరణంపై తల్లే అనుమానం వ్యక్తం చేస్తోందని అయినా ముఖ్యమంత్రిసహా కాంగ్రెస్ నేతలెవరూ స్పందించడం లేదని అన్నారు. సీఎంకు నిజంగా చిత్తుశుద్ధి ఉంటే గోపీనాథ్ మరణంతోపాటు ఆస్తిపాస్తులపై సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.
బీజేపీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ జూబ్లిహిల్స్ ఉపఎన్నికలో ఎన్నికల కమిషన్, పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదన్నారు. "కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ఈసీ, పోలీసులు, కొమ్ముకాస్తున్నారు. తెలంగాణలో అధికార, ప్రతిపక్షాలు కలిసి పని చేస్తున్నాయి. కూడబలుక్కునే తిట్టుకుంటున్నారు. మేం ప్రచార సభలకు అనుమతి కోసం దరఖాస్తు చేస్తే జాప్యం చేస్తూ చివరి నిమిషంలో రద్దు చేస్తున్నారు. ఈరోజు రహమత్ నగర్‌లో సాయంత్రం సభకు పర్మిషన్ ఇవ్వాలని ఈనెల 4న దరఖాస్తు చేసుకున్నాం. నిన్నటిదాకా దీనిపై స్పందించలేదు. కానీ పొద్దున ఫోన్ చేసి అనుమతి ఇవ్వడం లేదని, వేరేచోట పెట్టుకోవాలని చెబుతున్నారు. మేం ఎక్కడ సభ పెట్టుకోవాలో కూడా వాళ్లే మాకు చెబుతున్నారంటే ఏమనాలి?. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ఎక్కడ అడిగితే అక్కడ మీటింగ్‌కు అనుమతి ఇస్తున్నారు. చివరి నిమిషంలో ఎక్కడైనా అనుమతి ఇచ్చినా కండీషన్లు పెడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు డీజేలు పెట్టుకోవడానికి, హంగామా చేయడానికి మాత్రం అనుమతి ఇస్తారు. ఇదేం ద్వంద్వ వైఖరి?. బీజేపీ సభలకు అనుమతిస్తే... ఒక వర్గం ఓట్లు రావనే భయం కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు పట్టుకుంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు సీట్లను బీజేపీ గెలుచుకుంది. జూబ్లిహిల్స్‌లో బీజేపీ గెలవకూడదనే కుట్రతోనే మా సభలకు అనుమతి ఇవ్వడం లేదు. దొంగ సర్వేల పేరుతో బీజేపీ పోటీలో లేదంటూ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు." అని ఆరోపించారు.
ప్రజల ఆలోచన మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు గుణపాఠం చెప్పాలని ఉందన్నారు బండి సంజయ్. ఈ విషయం తెలిసే కాంగ్రెస్ పార్టీ ముస్లింల మెప్పు పొందేందుకు యత్నిస్తోంది. జూబ్లిహిల్స్ ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ మధ్యే పోటీ అన్నారు. కాంగ్రెస్‌కు ముస్లిం ఓట్లు కోసం మాత్రమే యత్నిస్తోంది. హిందువులంతా సత్తా ఏంటో చూపించాలన్నారు. "బీఆర్ఎస్ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ముందే చేతులెత్తేసింది. జూబ్లిహిల్స్ ప్రజలారా... అభివృద్ధి కావాలా? అరాచక కావాలా? తేల్చుకోండి. కాంగ్రెస్ గెలిస్తే మజ్లిస్ గెలిచినట్లే...అరాచకాలు, అక్రమాలకు తావిచ్చినట్లే. సీఎం రేవంత్ రెడ్డి ఓట్ల కోసం దిగజారి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ అంటేనే ముస్లింలు అని చెబుతున్నారు. దేశ జవాన్లను అవమానించేలా, హేళన చేసేలా మాట్లాడారు. మాగంటి గోపీనాథ్ మరణం విషయంలో ఆయన తల్లిని మానసిక క్షోభకు గురి చేశారు. కన్న కొడుకును కూడా కొడుకు గోపీనాథ్ ముఖం చూడనీయకుండా చేయడంపై అనేక అనుమానాలున్నాయి. నా కొడుకు మరణం ఒక మిస్టరీ అని గోపీనాథ్ తల్లే చెబుతోంది. అసలు గోపీనాథ్ చనిపోయింది ఎప్పుడు? ముందే చనిపోయారని చెబుతున్నారు. ఎవరి కోసమే ఆపారని చెబుతున్నారు." సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
గోపీనాథ్ మరణంపై సమగ్ర విచారణ జరపాలని సంజయ్ అన్నారు. "గోపీనాథ్ కుటుంబ సభ్యులు, ఆసుపత్రి యాజమాన్యం స్టేట్‌మెంట్లను రికార్డు చేయాలి. తన తండ్రిని చూడటానికి రావొద్దంటూ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి పువ్వాడ అజయ్ బెదిరించినట్లు గోపీనాథ్ కొడుకే ఆరోపించారు. అయినా సీఎం రేవంత్ రెడ్డి గుండె మాత్రం కరగడం లేదు. స్పందించడం లేదు. ఎందుకంటే గోపీనాథ్ ఆస్తులపై సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి ట్విట్టర్ టిల్లు మధ్య పంపకాల యవ్వారం ఉంది. అందుకే కేసీఆర్ కుటుంబంపై ఉన్న కేసులపై విచారణ జరగడం లేదు. అరెస్టు చేయడం లేదు. గోపీనాథ్ ఆస్తిపాస్తుల పంపకాల్లో కేటీఆర్, రేవంత్ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. వీటి కోసమే వీరిద్దరి మధ్య పగలు, పట్టింపులు ఎక్కువయ్యాయి. గోపీనాథ్ చనిపోయాక ఆయన ఆస్తులను వీళ్లద్దరూ పంచుకున్నారు. దమ్ముంటే గోపీనాథ్ ఆస్తులెన్ని? అవన్నీ ఎటుపోయాయో చెప్పే దమ్ముందా? గోపీనాథ్ మరణం, ఆస్తుల వ్యవహారంపై విచారణ జరిపించే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా?. గోపీనాథ్ మరణంపై స్వయానా తల్లి ఆరోపణలపై ఇంతవరకు కాంగ్రెస్ ఎందుకు స్పందించడం లేదు?." అని నిలదీశారు.





















