Eatala Rajender: రేవంత్ నోరు, ఒళ్ళు దగ్గర పెట్టుకో - ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు: ఈటల రాజేందర్
Telangana News: నాచారం డివిజన్ లో కాలనీ సంఘాలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Eatala Rajender warns Revanth Reddy: బీజేపీ నేత ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ప్రధాని మోదీ గురించి ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. లేదంటే గత పాలకులకు పట్టిన గతే పడుతుందని అన్నారు. నాచారం డివిజన్ లో కాలనీ సంఘాలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
‘‘ఈమధ్య కాలంలో నడమంత్రపు సిరిలాగా ముఖ్యమంత్రి పదవి వచ్చిన రేవంత్ నెలరోజుల్లోనే రెండు నాల్కలధోరణితో మాట్లాడుతున్నారు. మోదీగారు మా పెద్దన్న, ఆయన ఆశీర్వాదం ఉంటేనే రాష్ట్రం అభివృద్ది చెందుతుంది అని చెప్పారు. ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న కొంపల్లి, అల్వాల్ ఫ్లై ఓవర్ కోసం 175 ఎకరాల రక్షణ రంగ భూమిని కేటాయించారు అని చెప్పిన సీఎం.. మళ్లీ మోదీ ఏంది అని మాట్లాడుతున్నారు. కేసీఆర్ కూడా అలానే మాట్లాడారు. ఆయనకు పట్టిన గతే మీకు పడుతుంది. నోరు, ఒళ్ళు దగ్గర పెట్టుకో. అధికారం ఉందని ఎది పడితే అది మాట్లాడితే సహించడానికి ప్రజలు సిద్ధంగా లేరు.
కేసీఆర్ ఫోన్ టాపింగ్ చేస్తున్నారు అని విమర్శించిన వీరు కూడా ఫోన్ టాపింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అప్రజాస్వామికం వ్యవహరిస్తే ఖబర్థార్. పిల్లి కళ్ళు మూసుకొని పాలుతాగినట్టు వ్యవహరిస్తున్నారు..
రాహుల్ గాంధీకి ఫండ్స్ పంపించడానికి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులను ఎంత వేధిస్తున్నది, ఎంత బ్లాక్ మెయిల్ చేస్తున్నది రికార్డ్ అవుతుంది. ఒక్క రాష్ట్రంలో ఉండి నేనే అన్నీ అనుకుంటున్నావు. నిన్ను వీక్షించే వారు కూడా ఉన్నారు అని మర్చిపోకు. మల్కాజిగిరిలో ఎవరు వచ్చిన ఎన్ని డబ్బులు ఖర్చుపెట్టిన గెలిచేది బీజేపీనే అని ప్రజల ఆశీర్వాదం మాకే ఉంటుంది’’ అని ఈటల రాజేందర్ అన్నారు.
అతుకుల బొంతకు స్వస్తి
‘‘మోదీ గారు మంత్రి కాకుండానే.. ఎమ్మెల్యే అవ్వగానే సీఎం అయ్యారు. ఇలా అయినవారు చాలా అరుదు. 12 సంవత్సరాల పాలన తరువాత గుజరాత్ మోడల్ దేశమంతా అడాప్ట్ చేయాలని బీజేపీ నిర్ణయించి ప్రధాని అభ్యర్థిని చేసిన తరువాత ఆయన మొదట మీటింగ్ హాజరైంది హైదరాబాద్ లోనే. ఆనాటి ప్రేమ ఆప్యాయత మర్చిపోలేనిది అని మోదీ గారు ఇప్పటికీ చెప్తారు. మొదటిసారి పోటీలోనే 273 సీట్లు సాధించారు. రెండవసారి పోటీ చేస్తే 303 సీట్లు గెలిపించి.. అతుకులబొంత ప్రభుత్వాలకు స్వస్తి పలికారు. మోదీ ఏనాడు అలవికాని హామీలు ఇవ్వలేదు.
దేశచరిత్రలో ఎక్కడా లేనన్ని హామీలు ఇక్కడ కాంగ్రెస్ ఇచ్చింది. మా పాలన నచ్చితే 370 సీట్లు ఇవ్వాలని, NDA కి చార్ సౌ పార్ అందించాలని మోదీ గారు కోరుతున్నారు. ఎంత మెజారిటీ వచ్చినా తోడుగా వచ్చిన పార్టీలను మాత్రం వదిలిపెట్టడం లేదు. కొంతమంది ఒడ్డు ఎక్కాక బొడ మల్లన్న అని వదిలివేస్తారు కానీ కష్టకాలంలో అండగా ఉన్న వారిని వదిలిపెట్టలేదు’’ అని ఈటల రాజేందర్ మాట్లాడారు.