Etala Rajender: గజ్వేల్‌లో రాజకీయంగా బొంద పెట్టేస్తా! సీఎం భయం, బలహీనతలన్నీ తెలుసు - ఈటల రాజేందర్
హైదరాబాద్‌లో సోమవారం మధ్యాహ్నం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. నిన్న కేసీఆర్ ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలకు నేడు ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు.
ఎల్లప్పుడూ ఫాంహౌస్ లో పడుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రగతి భవన్ కు ఈడ్చుకొచ్చామని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఆయనకు బానిసలు కావాలని అన్నారు. ఉద్యమకారుడిగా తాను ప్రశ్నించినందుకు పార్టీ నుంచి బహిష్కరించారని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్‌లో సోమవారం మధ్యాహ్నం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. నిన్న కేసీఆర్ ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలకు నేడు ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ఏ పథకం తెచ్చినా ముందు ఆయన సన్నిహితులకు, బంధువులకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని అన్నారు.
‘‘సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనే కేసీఆర్‌కు ఉండదు. ఉద్యమకారుడిగా నేను ప్రశ్నిస్తే నన్ను బయటకి తోశారు. కేసీఆర్‌కు కావాల్సింది బానిసలు. నన్ను ఓడించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. మీరంతా ఇది చూశారు. హుజూరాబాద్‌లో ఓటుకు నోటు ఇచ్చారు. ఇప్పుడు కేసీఆర్ దుర్మార్గమైన పాలన అంతం చేసే బాధ్యత నాపైన ఉంది. కేసీఆర్ బలం, బలహీనతలు, భయం అన్నీ నాకు తెలుసు. కేసీఆర్‌ను ఓడిస్తేనే తెలంగాణకు పట్టిన పీడ విరగడ అవుతుంది’ అని ఈటల కౌంటర్ ఇచ్చారు.
‘‘ కేసీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు. నా రాజకీయ జీవితంలో పరుష పదజాలాలు ఏనాడు లేవు. నా గురించి కేసీఆర్ చిల్లరగా మాట్లాడారని ధ్వజమెత్తారు. నాకు సహనం, సంస్కారం, ఓపిక ఉంది. డబ్బుతో గెలవొచ్చనే భ్రమలో కేసీఆర్ ఉన్నారు. ధనవంతులకు, పొలం ఎక్కువగా ఉన్నవారికి రైతు బంధు ఎందుకని నేను ప్రశ్నించాను. ఈ విషయం పదే పదే ముఖ్యమంత్రికి చెప్పాను.
గజ్వేల్ లో బొంద పెట్టేది నేనే - ఈటల
ప్రతీదాన్ని ప్రశ్నించినందుకే నన్ను పార్టీ నుంచి వెళ్లగొట్టారు. నన్ను ఓడించానికి 13 మంది మంత్రులు పనిచేశారు. అధికార యంత్రాంగాన్ని మొత్తం హుజురాబాద్ లో పెట్టించారు. కేసీఆర్ ను ఓడిస్తేనే రాష్ట్రానికి పట్టిన శని పోతుంది. కేసీఆర్ కు విసిరిన చాలెంజ్ కు నేను కట్టుబడి ఉన్నా. గజ్వేల్ ప్రజలు కేసీఆర్ ను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారు. కేసిఆర్ ను రాజకీయంగా బొంద పెట్టేది నేనే. నేను చిన్నోణ్నే కావొచ్చు కానీ. నేను బుల్లెట్ లాంటోణ్ని. బుల్లెట్ కూడా ఇంచంతే ఉంటది.. దింపితే గుండెల్లోకి వెళ్తుంది’’ అని కేసీఆర్ కు ఈటల రాజేందర్ గట్టి కౌంటర్ వేశారు.