CM Revanth Reddy : హైదరాబాద్ లో చార్లెస్ స్క్వాబ్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్.. అధికారులతో చర్చలు జరిపిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : ఆర్థిక కార్యకలాపాల్లో అంతర్జాతీయ సంస్థగా పేరుగాంచిన చార్లెస్ స్క్వాబ్ తో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని సంస్థ ప్రతినిధులను కోరారు.
Telangana CM Revanth Reddy America Tour: తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా పలు ప్రముఖ కంపెనీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమవుతూ బిజీగా గడుపుతున్నారు. ఈ పర్యటనలో భాగంగానే ఆర్థిక కార్యకలాపాల్లో అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన డల్లాస్ లోని చార్లెస్ స్క్వాబ్ కేంద్ర కార్యాలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సందర్శించారు. హైదరాబాదులో ఈ సంస్థ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిందని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. ఈ చర్చల్లో చార్లెస్ స్క్వాబ్ సంస్థ ఎగ్జిక్యూటివ్స్ డెన్నిస్ హౌవార్డ్, రామ బొక్క పాల్గొన్నారు.
ముఖ్యమంత్రితో సంస్థ ప్రతినిధులు జరిపిన చర్చలు ఫలవంతమైనట్లు ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు. భారత్ లో ఈ సంస్థ తొలి టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. సిఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రతిపాదనల పట్ల సంస్థ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ సంస్థ కార్యకలాపాలను హైదరాబాదులో నెలకొల్పేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడంతోపాటు వసతులు కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంస్థ ప్రతినిధులకు హామీ ఇచ్చారు.
ప్రభుత్వం నుంచి వచ్చిన సానుకూల స్పందనల పట్ల స్క్వాబ్ సంస్థ ప్రతినిధులు హర్షాన్ని వ్యక్తం చేశారు. సెంటర్ ను హైదరాబాదులో ఏర్పాటుకు సంబంధించి తుది అనుమతులు రావాల్సి ఉందని, ఈ మేరకు చర్యలను వేగవంతం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డికి సంస్థ ప్రతినిధులు హామీ ఇచ్చారు. కొద్దిరోజుల్లోనే భారత్ కు ప్రతినిధుల బృందాన్ని పంపిస్తామని ఈ సందర్భంగా సీఎంకు హామీ ఇచ్చారు. ఆర్థిక సేవల్లో చార్లెస్ స్క్వాబ్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.
Also Read: తెలంగాణలో ఫార్మా గ్లాస్ ట్యూబ్ ల తయారీ కేంద్రం, కార్నింగ్ కంపెనీతో సీఎం రేవంత్ ఒప్పందం
ప్రపంచానికి గమ్య స్థానంగా హైదరాబాద్
హైదరాబాద్ ప్రపంచానికి గమ్యస్థానంగా ఉందని, పెట్టుబడులు పెట్టేందుకు అనువైన ప్రదేశమని సీఎం రేవంత్ రెడ్డి చార్లెస్ స్క్వాబ్ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో పేర్కొన్నారు. సంస్థ ఏర్పాటుకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం నుంచి అందిస్తామని, త్వరితగతిన అన్ని రకాల అనుమతులను ఇస్తామని వెల్లడించారు. చార్లెస్ స్క్వాబ్ సంస్థ తమ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు హైదరాబాదును కేంద్రంగా ఎంపిక చేసుకోవడం పట్ల ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
వరుస భేటీలు నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి
వరల్డ్ బ్యాంకు సీఈవోతో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సమావేశమయ్యారు. ట్రైజిన్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ విస్తరణకు అమెరికన్ ప్రతినిధులు ఎప్పటికీ అంగీకరించారు. 1000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు బయో ఫ్యూయల్స్ సంస్థ స్వచ్ఛ బయో అంగీకారం తెలుపునట్లు ప్రభుత్వ ప్రతినిధులు చెబుతున్నారు. కాగ్నిజెంట్ కంపెనీతోను సీఎం ఒప్పందం చేసుకున్నారు. అసెట్ మేనేజ్మెంట్ టెక్నాలజీ సర్వీసెస్, అడ్వాన్స్ డేటా ఆపరేషన్స్ లో ప్రముఖ కంపెనీ ఆర్సిసీఎం హైదరాబాదులో తమ కంపెనీ ఏర్పాటుకు అంగీకరించింది. ఆర్సిసీఎం విస్తరణతో 500 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అమెరికాకు హైదరాబాద్ సారూప్యత ఉందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా కంపెనీలు పారిశ్రామికవేత్తలకు వెల్లడించారు. తెలంగాణను చూడాలంటూ ఇన్వెస్టర్లకు ఆయన పిలుపునిచ్చారు. చైనాతో పోటీపడి తెలంగాణను నెంబర్ వన్ గా నిలుపుదామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read: హైదరాబాద్ లో ట్రైజిన్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్, అమెరికాలో ఒప్పందం - 1000 మందికి ఉద్యోగాలు