MLAs Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తులోకి సీబీఐ ఎంట్రీ- సోమవారం నుంచి విచారణ షురూ!
MLAs Poaching Case: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తుకు సీబీఐ సిద్ధమైంది. ఈ కేసు దర్యాప్తు బాధ్యతను ఢిల్లీ విభాగానికి సీబీఐ డైరెక్టర్ అప్పగించారు.
MLAs Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోల కేసు దర్యాప్తులో మరో టర్న్ తీసుకుంది. సీబీఐకి కేసు విచారణ బాధ్యతలు అప్పగించడంపై కోర్టులో విచారణ సాగుతుండగానే మరో కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఈ కేసు దర్యాప్తును ఢిల్లీ విభాగానికి అప్పగిసస్తూ సీబీఐ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. సిట్ దర్యాప్తును రద్దు చేసిన హైకోర్టు సింగిల్ జడ్జి సీబీఐతో విచారణ చేయాలని ఆదేశించారు.
హైకోర్టు తీర్పు ప్రతిని పరిశీలించిన సీబీఐ డైరెక్టర్.. దర్యాప్తును ఢిల్లీ విభాగానికి అప్పగించారు. ఈ బృందంలోని ఒక ఎస్పీ, డీఎస్పీ, ఇన్ స్పెక్టర్ రెండు రోజుల క్రితమే హైదరాబాద్ వచ్చారు. కోఠిలోని సీబీఐ కార్యాలయం వేదికగా ఢిల్లీ బృందం ఎమ్మెల్యేల కొనుగోలలు కేసును దర్యాప్తు చేయనుంది. తీర్పుతోపాటు ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తును ప్రాథమికంగా పరిశీలించిన సీబీఐ అధికారులు.. ఎఫ్ఐఆర్ నమోదుకు సిద్ధం అయ్యారు. ఈ కేసులో సిట్ నుంచి దస్త్రాలు అందగానే పారదర్శకంగా దర్యాప్తు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు హైకోర్టుకు సీబీఐ తెలిపింది.
సిట్ నుంచి పత్రాలు ఇవ్వాలని ఇప్పటికే సీఎస్ కు లేఖ రాసినట్లు సీబీఐ తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ప్రవీణ్ కుమార్ హైకోర్టుకు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు అందగానే దర్యాప్తు ప్రారంభిస్తామని సీబీఐ తెలిపింది. సీబీఐ అధికారులు కేసు వివరాలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని ఏజీ కోర్టుకు తెలిపారు. సోమవారం వరకు కేసు ఫైల్స్ కోసం ఒత్తిడి చేయొద్దని సీబీఐని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసుపై సోమవారం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో స్పష్టత వచ్చిన తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సీబీఐ భావిస్తుంది.
శుక్రవారమే హైకోర్టులో వాదనలు..
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టులో శుక్రవారం వాదనలు జరిగాయి. సిట్ దర్యాప్తును రద్దు చేసి సీబీఐకి కేసును బదిలీ చేయాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. ఈ కేసును హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులోని ముగ్గురు నిందితులు తరఫున మాజీ అడ్వొకేట్ జనరల్ సీతారామమూర్తి, సీనియర్ న్యాయవాది ఎల్. రవిచంద్ర వాదనలు వినిపించారు. ప్రభుత్వ అప్పీల్‌కు విచారణ అర్హత లేదని వాదించారు. క్రిమినల్ కేసు కాబట్టి సింగిల్ జడ్జి తీర్పుపై అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలన్నారు. అంతేకానీ హైకోర్టులో డివిజన్ బెంచ్ విచారణ జరపకూడదన్నారు. ఈ కేసు దర్యాప్తును ప్రభుత్వం ప్రభావితం చేసేలా ఉందని అందుకే దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వాదించారు.
కేసు దర్యాప్తులో ధర్మాసనం జోక్యం చేసుకోవద్దని కోరారు. బీజేపీ తరఫున సీనియర్ న్యాయవాది దామోదర్ రెడ్డి వినిపిస్తూ ఈ కేసును సీబీఐకి అప్పగించడమే సరైన నిర్ణయం అన్నారు. బీజేపీ లక్ష్యంగా బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నాయని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను కూల్చారని ఆరోపణలు చేస్తున్నారని వాదించారు. ఇలాంటిది దేశంలో ఎక్కడా జరగలేదని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయ అంశాలకు హైకోర్టును వేదికగా చేసుకోవద్దని హితవుపలికింది. రాజకీయ అంశాలను బయట చూసుకోవాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది.