Aroori Ramesh: బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే - రెండ్రోజుల్లోనే ట్విస్ట్!
Telangana News: ఆరూరి రమేష్ బీఆర్ఎస్ కు మార్చి 16న రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు.
Aroori Ramesh Joined in BJP: వర్థన్నపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత ఆరూరి రమేష్ బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆరూరి రమేష్ తో పాటుగా ఉమ్మడి వరంగల్ నుంచి కొంత మంది నేతలు బీజేపీలో చేరారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు.
ప్రధాని మోదీ, బీజేపీ పట్ల సానుకూల వాతావరణం ఉందని అన్నారు. గతంలో ఇలాంటి సానుకూల పరిస్థితి ఏ పార్టీకి లేదని అన్నారు. మూడోసారి కూడా మోదీ ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉండడం చాలా గొప్ప విషయం అని అన్నారు. ఈసారి ఒక్క బీజేపీకే స్వతంత్రంగా 350 స్థానాలు గెల్చుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మూడోసారి కూడా మెజారిటీ పెంచుకోవడం అనేది దేశ చరిత్రలోనే మొదటి సారని కిషన్ రెడ్డి అన్నారు.
ఎన్నికల వేళ ప్రధాని మోదీ తరచూ ఏపీ, తెలంగాణలోనే పర్యటనలు ఎక్కువగా చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. ఈసారి తెలంగాణలో మంచి ఫలితాలు వస్తాయని దీమా వ్యక్తం చేశారు. దిగువ వర్గాలకు చెందిన ఐఏఎస్ అధికారులు కూడా బీజేపీకి ప్రశంసలు కురిస్తున్నారని చెప్పారు.
నిన్న బీఆర్ఎస్ కు రాజీనామా
ఆరూరి రమేష్ బీఆర్ఎస్ కు మార్చి 16న రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్ కు పంపారు. పార్టీలో తనకు ఎన్నో అవకాశాలు కల్పించారని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ తో పాటు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావుకు కూడా ఆరూరి రమేష్ లేఖలో ధన్యవాదాలు తెలిపారు.
నిజానికి మూడు రోజుల క్రితమే ఆరూరి రమేష్ బీజేపీలో చేరేందుకు ప్రయత్నించారు. కానీ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆయన్ను అడ్డుకున్నారు. అలా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వద్దకు తీసుకెళ్లి మాట్లాడించారు. ఆరూరి రమేష్ ను కేసీఆర్ సముదాయించినట్లుగా వార్తలు వచ్చాయి. రెండు వారాలుగా బీఅర్ఎస్ లో ఉంటారా.. బీజేపీలో చేరుతారా అనే ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ ను కలిసిన వెంటనే ఆరూరి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని చెప్పుకొచ్చారు. కానీ, నేడు బీజేపీలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయనకు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నుంచి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా హామీ ఇచ్చినట్లు తెలిసింది.
బీఅర్ఎస్ అధినేత కేసీఆర్ బుజ్జగించినా అరూరి రమేష్ బీజేపీలో చేరేందుకే నిర్ణయించుకున్నాడు. హైదరాబాద్ లో అమిత్ షాతో చర్చలు, ఆ తరువాత ఢిల్లీలో చర్చలు జరిగిన తరువాతే నిన్న (మార్చి 16) బీఅర్ఎస్ కు రాజీనామా చేశారు. నేడు హైదరాబాద్ లో రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి అరూరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.