NVSS Prabhakar On KCR: "కేసీఆర్ ను వ్యతిరేకించి, మోదీపై విశ్వాసం ఉన్నవారు బీజేపీలో చేరండి"
NVSS Prabhakar On KCR: సీఎం కేసీఆర్ ను వ్యతిరేకించే వారు మోదీపై నమ్మకం ఉన్నవారు బీజేపీలో చేరవచ్చని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు.
NVSS Prabhakar On KCR: కేసీఆర్ ను వ్యతిరేకించే వారు, మోదీపై విశ్వాసం ఉన్నవారు బీజేపీలో చేరవచ్చని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ఈ కామెంట్లు చేశారు. అక్రమాల కేసులో నోటీసులు వచ్చిన వారు ప్రగతి భవన్ కు ఎందుకు వెళ్తున్నారని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. ప్రగతి భవన్ లోనే ఎమ్మెల్యేలకు ఎరపై స్క్రిప్టు తయారు చేశారని ఆరోపించారు. పన్నులు ఎగ్గొట్టిన వారికి ప్రగతి భవన్ రక్షణగా మారిందంటూ ధ్వజమెత్తారు. ఈడీ, సీబీఐ విచారణను ఎదుర్కునే వారికి ప్రగతి భవన్ లో ముందు రక్షణ కల్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తానని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వివరించారు. హైకోర్టు జోక్యం చేసుకుని ప్రగతి భవన్ ను వెంటనే సీజ్ చేయాలని కోరుతున్నట్లు వివరించారు. కేసీఆర్ ను వ్యతిరేకించే వారు, మోదీపై విశ్వాసం ఉన్నవారు బీజేపీలో చేరవచ్చని ప్రకటించారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే ఆ పార్టీ కనీసం ఒక్కరోజు కూడా మాట్లడలేదని అన్నారు.
ఇద్దరు సీఎంలు దోచుకుంటున్నారు: బండి సంజయ్
తెలంగాణ తల్లికి ద్రోహం చేసిన వ్యక్తి కేసీఆర్ అని, ఇప్పుడు BRS పేరుతో దేశాన్ని దోచుకుందామని చూస్తున్నారని కరీంనగర్ ఎంపీ ఆరోపించారు. దందాలు, కబ్జాల పేరుతో లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు లిక్కర్, స్యాండ్, గ్రానైట్, డ్రగ్స్.. ఇలా అన్ని దందాలు, స్కామ్ లు వాళ్ల కుటుంబానివే అంటూ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. తెలంగాణ అభివృద్ధి కి కేసీఆర్ సహకరించడం లేదని, మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం లేదన్నారు. ఉదయం లేచినప్పటినుంచి 24 గంటలు ప్రధాని మోదీని తిడుతూ... ఏపీతో కుమ్మక్కై, సెంటిమెంట్ రగిల్చి, రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు సీఎంలు కలిసి తెలుగు రాష్ట్రాలను దోచుకోవాలని చూస్తున్నారని, ఏ వర్గం సంతోషంగా లేదన్నారు.
‘మీ వల్లనే కరీంనగర్ లో పింక్ కలర్ జెండాను పాతిపెట్టి, కాషాయ జెండాను రెపరెపలాడించాం. కరీంనగర్ గడ్డపై, ఎంపీగా లక్ష ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపించారు. కార్యకర్తల కష్టం, ప్రజల అభిమానంతోనే గెలిచాను. ఏ లక్ష్యంతో బీజేపీ అధిష్టానం నన్ను రాష్ట్ర అధ్యక్షుడిని చేసిందో అందుకు అనుగుణంగానే పనిచేస్తున్నాను. మీ కోసమే పాదయాత్ర చేస్తున్న. పచ్చ జెండాను, పింక్ జెండాను పీకేసి, కాషాయ జెండా ఎగరేయాలి. 2001లో సింహగర్జన పేరుతో టీఆర్ఎస్ పెట్టిన సభకు కూడా ఇంతమంది రాలేదు. సింహగర్జన పేరుతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఇప్పుడు ఏమైంది?. తెలంగాణ రాష్ట్ర సమితి లో తెలంగాణను తీసేసిండు కేసీఆర్. తెలంగాణతో బంధం తొలగించుకున్నాడు. దాంతో మనకు కేసీఆర్ పీడ విరగడయింది’ అన్నారు బండి సంజయ్.
మోడీ సింహం... సింగిల్ గానే వస్తారు
ప్రధాని మోదీ ఎప్పటికీ సింహమేనని, ఆయన ఎన్నికలకు సింగిల్ గానే వస్తారన్నారు. తన పాదయాత్ర ద్వారానే 8 సంవత్సరాలు ఫామ్ హౌజ్ లో పండుకున్న కేసీఆర్, ఇప్పుడు బీజేపీకి భయపడి బయటికొచ్చిండన్నారు. TRS పార్టీ దుకాణం మూసేసి, ఢిల్లీలో బీఆర్ఎస్ దుకాణం తెరిచిండని ఎద్దేవా చేశారు. BRS అంటే... బంధిపోట్ల రాష్ట్ర సమితి, బార్ & రెస్టారెంట్ సమితి అని.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ భరతం పడతామన్నారు బండి సంజయ్.