Cantonment Bypoll: కంటోన్మెంట్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Secunderabad Cantonment Bypoll: తెలంగాణలో ఖాళీగా ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఉపఎన్నికకు బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. టీఎన్ వంశా తిలక్‌కు బీజేపీ అవకాశం ఇచ్చింది.
TN Vamsha Tilak-హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఇదివరకే అభ్యర్థుల్ని ప్రకటించాయి. తాజాగా బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించింది. టీఎన్ వంశా తిలక్‌ను తమ అభ్యర్థిగా ప్రకటిస్తూ బీజేపీ కేంద్ర కార్యవర్గం మంగళవారం (ఏప్రిల్ 16న) ఓ ప్రకటన విడుదల చేసింది. మే 13న తెలంగానలో లోక్‌సభ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్ ఉపఎన్నికకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత గెలుపొందారు. కానీ రోడ్డు ప్రమాదంలో ఆమె చనిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత మృతి
కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా నారాయణ శ్రీగణేశ్‌ను ప్రకటించగా.. ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో ఆమె సోదరి నివేదితకు బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ గత ఇద్దరు ఎమ్మెల్యేలు పదవిలో ఉండగానే చనిపోయారు. మొదట కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో సాయన్న కూతురు లాస్య నివేదిత బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. కానీ రోడ్డు ప్రమాదంలో ఆమె సైతం చనిపోవడంతో ఒకే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా సాయన్న కుటుంబసభ్యులు చనిపోయారు.
తెలంగాణలో ఖాళీగా ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ తో పాటు ఉత్తరప్రదేశ్‌లోని నాలుగు అసెంబ్లీ ఉపఎన్నికలకు అభ్యర్థులను బీజేపీ తాజాగా ప్రకటించింది. యూపీలోని దద్రౌల్ నుంచి అరవింద్ సింగ్, లక్నో ఈస్ట్ నుంచి ఓ.పి. శ్రీవాస్తవ్, గైంసారి నుంచి శైలేంద్ర సింగ్ శైలు, ఎస్టీ నియోజకవర్గం దుద్ధి నుంచి శ్రావణ్ గౌడ్‌ను బీజేపీ తమ అభ్యర్థులుగా ప్రకటించింది.