Kamareddy Master Plan : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై హైకోర్టు విచారణ, ప్రభుత్వ నిర్ణయాన్ని తెలపాలని ఆదేశాలు
Kamareddy Master Plan : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై కేఏ పాల్ వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారించింది. ఫిబ్రవరి 13లోపు ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేయాలని ఆదేశాలు జారీచేసింది.
Kamareddy Master Plan : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేఏ పాల్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యి వాదనలు వినిపించారు. రైతులను సంప్రదించకుండానే మాస్టర్ ప్లాన్ రూపొందించారని కోర్టుకు తెలిపారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేసినట్టు కౌన్సిల్ ప్రకటించిందన్నారు. అయితే కౌన్సిల్ కు నిర్ణయం తీసుకునే అధికారం లేదని, మాస్టర్ ప్లాన్ రద్దు పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కేఏ పాల్ అన్నారు. ఇప్పటి వరకు మాస్టర్ ప్లాన్ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. మాస్టర్ ప్లాన్ పై ప్రభుత్వ నిర్ణయాన్ని ఫిబ్రవరి 13 లోపు సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను ఫిబ్రవరి 13 కు వాయిదా వేసింది. కామారెడ్డిలోని కొన్ని గ్రామాల పొలాలను ఇండస్ట్రియల్ జోన్ పరిధిలోకి తెచ్చారని బాధిత రైతులు ఇటీవల ఆందోళన చేశారు. మాస్టర్ ప్లాన్‌లో సాగు భూములను పరిశ్రమల జోన్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలు కూడా చేశారు.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ నోటిఫికేషన్
కొద్ది రోజులుగా తీవ్ర ఉద్రిక్తతలకు కారణం అవుతున్న కామారెడ్డి మాస్టర్ ప్లాన్ అంశానికి ఇటీవల మున్సిపల్ కమిషనర్ ముగింపు పలికారు. ఈ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కౌన్సిలర్లు అందరూ రాజీనామా చేయాలని రైతులు ఒత్తిడి చేస్తుండటంతో ఒక్కొక్కరుగా రాజీనామాలు చేశారు. దీంతో అందరూ రాజీనామా చేసే అవకాశం ఉండటంతో.. అధికారులు వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు మాస్టర్ ప్లాన్ ముసాయిదా రద్దు చేశారు.
వివాదం ఏంటి?
కామారెడ్డి పట్టణానికి మున్సిపల్ అధికారులు ఓ మాస్టర్ ప్లాన్ ముసాయిదా రూపొందించారు. దానిపై ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. అయితే ఈ మాస్టర్ ప్లాన్ కారణంగా భూములు పోతున్నాయన్న ఆందోళనతో 8 గ్రామాల రైతులు ఉద్యమం ప్రారంభించారు. డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ను 2022 నవంబర్ చివరిలో ప్రకటించారు. ఇందులో చూపెట్టిన ఇండస్ర్టియల్ జోన్, గ్రీన్ జోన్, రీక్రియేషన్ జోన్, 100 ఫీట్లు, 80 ఫీట్ల రోడ్ల ప్రతిపాదనలపై ఆయా గ్రామాలకు చెందిన రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కామారెడ్డి మున్సిపాల్టీ పరిధిలోని అడ్లూర్, ఇల్చిపూర్, టెకిర్యాల్, లింగాపూర్, పాతరాజంపేట, రామేశ్వర్పల్లిలో పాటు సదాశివనగర్ మండలం అడ్లూర్ఎల్లారెడ్డికి చెందిన రైతులంతా రైతు ఐక్య కార్యచరణ కమిటీగా ఏర్పడ్డారు. రైతులు వివిధ రూపాల్లో నిరసనలు, ఆందోళనతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. రైతుల ఉద్యమానికి రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. భూములు పోతాయన్న ఆందోళనతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నారు. మరో రైతు ఆత్మహత్యాయత్నం చేశారు. ఇటీవల జిల్లా కేంద్రంలో రైతుల భారీ ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట ధర్నా, జిల్లా కేంద్రం బంద్ పోగ్రాములు సక్సెస్ అయ్యాయి. దీంతో రైతుల ఉద్యమం రాష్ర్ట వ్యాప్తంగా చర్చగా మారింది. దీంతో అధికార పార్టీపై ముఖ్యంగా స్థానిక లీడర్లపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
బీఆర్ఎస్ నేతలకు నిరసన సెగ
మున్సిపాలిటీలో విలీనమైన లింగాపూర్, టెకిర్యాల్, అడ్లూర్, రామేశ్వర్పల్లి, ఇల్చిపూర్, పాతరాజంపేట గ్రామాలతో పాటు, సదాశివనగర్ లో బీఆర్ఎస్ కు పట్టుంది. కానీ, మాస్టర్ ప్లాన్ పై ఈ గ్రామాల నుంచే వ్యతిరేకత రావడంతో బీఆర్ఎస్ నాయకులు ఇరకాటంలో పడ్డట్టైంది. మాస్టర్ ప్లాన్ ను కంప్లీ్ట్ గా రద్దు చేయించేందుకు ఒత్తిడి తెచ్చేందుకు కౌన్సిలర్లు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి చేస్తామని ప్రకటించారు. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తో సమావేశమయ్యారు. ఆ తర్వాత గ్రామాలకు వెళ్లి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ రైతులు ససేమిరా అన్నారు. ఏ రైతుకు కూడా నష్టం జరగకుండా మాస్టర్ ప్లాన్ ను మారుస్తామని, డీటీసీపీ, కన్సల్టెన్సీ తప్పిదంతో మాస్టర్ ప్లాన్ వివాదానికి కారణమైందని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. కానీ రైతులు అంగీకరించలేదు.