TS Tourism: రూ. 1000 కోట్ల విలువైన 2 స్థలాల లీజులు రద్దు, ఆ రెండు ల్యాండ్స్ స్వాధీనం
లీజ్ రూల్స్ పాటించకుండా, ప్రాజెక్టులు చేపట్టని సంస్థలకు లీగల్ నోటీసులుభూములను తిరిగి తీసుకోవడానికి టూరిజం శాఖ న్యాయపరమైన చర్యలు
ఉమ్మడి రాష్ట్రంలో లీజుకిచ్చిన టూరిజం భూముల అక్రమాలపై తెలంగాణ సర్కారు సీరియస్‌గా దృష్టి సారించింది. లీజ్ రూల్స్ పాటించకుండా, ప్రాజెక్టులు చేపట్టకుండా ఆయా సంస్థల ఆధీనంలో ఉన్న లాండ్స్‌ని తిరిగి స్వాధీనం చేసుకునే పనిలో పడింది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ సమీపంలో కొన్ని విలువైన పర్యాటక భూములను అప్పటి ప్రభుత్వాలు కొన్ని సంస్థలకు లీజుకిచ్చాయి. అయితే లీజు నిబంధనలు పాటించకుండా ప్రాజెక్టులు చేపట్టకుండా ఉన్న సదరు సంస్థల భూములను తిరిగి తీసుకోవడానికి టూరిజం శాఖ న్యాయపరమైన చర్యలు చేపట్టింది.
టూరిజం డిపార్ట్ మెంట్ భూములను ఏ అవసరాలకు తీసుకున్నారో.. ఆ అవసరాలకు ఉపయోగించుకోకుండా ప్రభుత్వానికి లీజులను చెల్లించకుండా, నిబంధనలు పాటించకుండా, చట్టంలోని లోసుగులను అడ్డం పెట్టుకొని కాలయాపన చేస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని మంత్రి. శ్రీనివాస్ గౌడ్ గత సమీక్షా సమావేశంలోనే ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకు టూరిజం శాఖ అధికారులు న్యాయపరమైన చర్యలు చేపట్టారు.
రూ. 1000 కోట్ల విలువైన 2 స్థలాల లీజులు రద్దు, స్వాధీనం
ఈ క్రమంలోనే అధికారులు ఏడాది కాలంలో పాత బకాయిలు రూ. 50 కోట్ల వరకు వసూలు చేశారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. అలాగే, పర్యాటక శాఖకు చెందిన సుమారు రూ. 1000 కోట్ల విలువైన 2 స్థలాల లీజులు రద్దు చేస్తూ, ఆ రెండు స్థలాలను స్వాధీనం చేసుకున్నట్టు మంత్రి వెల్లడించారు. మిగతవాటి మీద లీజు నిబంధనలు లోబడి న్యాయపరమైన చర్యలు తీసుకున్నామన్నారు. పర్యాటక శాఖ అధికారులు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా న్యాయపరంగా వ్యవహరించి, నాలుగేళ్లుగా శ్రమించి రూ. వెయ్యి కోట్ల విలువైన భూమిని ప్రభుత్వానికి అప్పగించడానికి కృషి చేశారని మంత్రి అన్నారు. పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, టూరిజం శాఖ్ MD మనోహర్, OSD సత్యనారాయణ, లీగల్ ఆఫీసర్ ఆదిల్‌ను శ్రీనివాస్‌గౌడ్ ప్రత్యేకంగా అభినందించారు
నిబంధనలు పాటించని సంస్థలకు లీగల్ నోటీసులు
శామిర్‌పేటలోని జవహర్‌నగర్ సర్వే నెంబర్ 12లో సికింద్రాబాద్ గోల్ఫ్ కోర్స్ అభివృద్ధి పేరుతో ప్రజయ్ ఇంజనీర్స్ సిండికేట్ సంస్థ 130 ఎకరాల టూరిజం శాఖకు చెందిన భూమిని 2004లో లీజుకు తీసుకుంది. కానీ నిబంధనలు పాటించని కారణంగా ఆ సంస్థపై న్యాయపరంగా పోరాడి, చర్యలు తీసుకుని, ఆ భూమిని స్వాధీనం చేసుకున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అలాగే, సికింద్రాబాద్ యాత్రి నివాస్ పక్కన ఉన్న 4,600 గజాల భూమిని E- City Giant Scree India Pvt Ltd., అనే సంస్థ లీజుకు తీసుకుని, నిబంధనలు పాటించకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నందున, ఆ లీజును రద్దు చేస్తూ తిరిగి ఆ భూమిని స్వాధీనం చేసుకున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. లీజుకు తీసుకుని ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టకుండా, నిబంధనలు పాటించకుండా, ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టిన సంస్థలకు, పాత బకాయిలు చెల్లించని కంపెనీలకు లీగల్ నోటీసులు జారీ చేశారు.
సీఎం కేసీఆర్ సహకారంతో రాష్ట్రంలో పర్యాటక రంగాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామన్నారు. తెలంగాణ టూరిజం శాఖని దేశంలోనే ఆదర్శవంతమైన టూరిజం శాఖగా తీర్చిదిద్దుతున్నామన్నారు. రాష్ట్రంలో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయన్నారు. రాష్ట్రానికి విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణ చారిత్రక సంపదైన రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు లభించడం గర్వకారణమన్నారు. అలాంటి గుర్తింపు లభించే అరుదైన కట్టడాలు ఇకా ఎన్నో ఉన్నాయని తెలిపారు. వాటి అభివృద్ధికీ చర్యలు చేపట్టామని,రాష్ట్రానికి పర్యాటకులు ఆకర్షించడానికి అంతర్జాతీయ వేదికలపై ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.