Dalit Bandhu Scheme: దళిత బంధుపై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు.. కౌంటర్ ఇవ్వబోయి అంతమాట అనేశారే..!
కడియం శ్రీహరి దళిత బంధుపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో అవి తనకే ఎదురు తగినట్లు అయ్యాయని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయాలని చూస్తున్న వేళ.. ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. దళితబంధు పూర్తి స్థాయిలో అమలు చేయకపోతే టీఆర్‌ఎస్‌కే నష్టమని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. ఒకే ఏడాదిలో 15 లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించలేకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దళితబంధు అమలు చేయకపోతే ఎన్నికల్లో ఓటమి తప్పదని కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అసలే హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో కడియం శ్రీహరి వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.
అమలు చేయకపోతే టీఆర్ఎస్‌కే నష్టం
అయితే, అంతకుముందు కడియం శ్రీహరి దళిత బంధుపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ‘దళితబంధు’ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఈ పథకాన్ని విమర్శిస్తున్న ప్రతిపక్షాలు చౌకబారు విమర్శలు మానుకోవాలని సూచించారు. ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోతే నష్టం జరిగేది టీఆర్ఎస్ పార్టీకే కాబట్టి ఆ విషయం తమకు తెలుసని అన్నారు. ఇలా విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో అవి తనకే ఎదురు తగినట్లు అయ్యాయని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Wanaparthy News: గేదెపై వ్యక్తి అత్యాచారం.. నగ్నంగా అక్కడిక్కడే మృతి, అసలేం జరిగిందంటే..
దళిత బంధు పథకం గురించి కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ‘‘ఈ దళిత బంధు పథకం చరిత్ర సృష్టించబోతోంది. దళితులకు ఇది మెరుగైన పథకం. దళితబంధుకు ప్రతి బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తాం. ఏటా దాదాపు రూ.25 వేల కోట్ల వరకూ కేటాయించబోతున్నాం. దళితుల అభివృద్ధి కోసం దేశంలో ఎక్కడైనా దళితబంధు పథకం కంటే మెరుగైన పథకం ఏ రాష్ట్రమైనా అమలు చేస్తుంటే మా దృష్టికి తీసుకురావచ్చు. ఆ పథకాన్ని కూడా మేం అధ్యయనం చేస్తాం. అన్ని సరిగ్గా ఉంటే తెలంగాణలోనూ ఆ పథకాన్ని అమలు చేస్తాం.
సింహంపై స్వారీ
‘‘మేం సింహంపై స్వారీ చేస్తున్నాం. సింహంపై కూర్చున్నంత సమయమే దాన్ని నడిపించగలుగుతాం. దిగితే అది మమ్మల్ని తినేస్తుంది. ఈ పథకాన్ని నీరు గార్చే ప్రయత్నం చేసినా.. పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయినా మా ప్రభుత్వమే తీవ్రంగా నష్టపోతుంది. దళితుల అభ్యున్నతి, భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని దళిత బంధు నిర్ణయాన్ని తీసుకున్నాం. ఆ పథకం అమలు మొత్తం మాపైనే ఉంది. కాబట్టి, రాజకీయ పార్టీలు చౌకబారు విమర్శలు మానుకోవాలి’’ అని కడియం శ్రీహరి వ్యాఖ్యలు చేశారు. కడియం చేసిన ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందనేది చూడాలి.
Also Read: Weather Updates: కొనసాగుతున్న అల్పపీడనం.. రెండ్రోజుల్లో తెలంగాణకు భారీ వర్షాలు.. ఏపీలో కూడా..