Independence Day 2021 Telangana: అదే జరిగితే దేశమంతా కుప్పకూలుతుంది.. గోల్కొండలో కేసీఆర్ ప్రసంగం హైలెట్స్
గణతంత్ర్య వేడుకలను సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్నారు. ఇవాళ (ఆగస్టు 15) ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ త్రివర్ణ పతాకాన్ని గోల్కొండ వేదికగా ఎగరవేయనున్నారు.
LIVE
Background
75వ స్వాతంత్ర్య దినోత్సవానికి గోల్కొండ కోట ముస్తాబయింది. ఇవాళ (ఆగస్టు 15) ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ త్రివర్ణ పతాకాన్ని గోల్కొండ వేదికగా ఎగరవేయనున్నారు. తెలంగాణ ఆవిర్భావం అయిన నాటి నుంచి స్వాతంత్ర్య దినోత్సవాన్ని గోల్కొండ కోటలో నిర్వహిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. గణతంత్ర్య వేడుకలను సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్నారు. రెండ్రోజుల క్రితమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గోల్కొండను సందర్శించి అన్ని ఏర్పాట్లను పరిశీలించారు. గతేడాది మాత్రం కరోనా ముఖ్యమంత్రి ప్రగతి భవన్‌లోనే జెండా వందనం చేసిన సంగతి తెలిసిందే.
Also Read: Weather Updates: కొనసాగుతున్న అల్పపీడనం.. రెండ్రోజుల్లో తెలంగాణకు భారీ వర్షాలు.. ఏపీలో కూడా..
అదే జరిగితే దేశం కుప్పకూలుతుంది: కేసీఆర్
‘‘కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ దళిత ప్రజలు దుర్భర పేదరికంలో బతుకుతున్నారన్నది నగ్న సత్యం. మన రాష్ట్రంలో కూడా అంతే జరుగుతోంది. దళిత జాతిని దారిద్ర్యం ఒక్కటే కాదు.. సామాజిక వ్యత్యాసం కూడా వారిని వేధిస్తోంది. దేశంలో ఇలాంటి ఒక పెద్ద ప్రజాసమూహాన్ని అణచివేస్తే దేశమంతా కుప్పకూలుతుందనే విషయం గ్రహించాలి. దేశంలో వీలైనంత తొందరగా అసమానతలను రూపుమాపాలి. దళితు ఎదుగుదలకు అది మొదటి సోపానం కావాలి.’’ అని కేసీఆర్ అన్నారు.
త్వరలోనే పెద్దాస్పత్రులకు శంకుస్థాపన: కేసీఆర్
హైదరాబాద్ నలుదిక్కులా టిమ్స్ పేరుతో నాలుగు మల్టి స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తాం. ఎల్బీ నగర్, అల్వాల్, సనత్ నగర్‌లలో కూడా టిమ్స్ ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం భూ సేకరణ పనులు కూడా పూర్తయ్యాయి. రామగుండం, పటాన్ చెరు పారిశ్రామిక వాడలో మల్టి స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించనున్నాం. త్వరలో వీటికి సంబంధించిన శంకుస్థాపన చేస్తాం. వరంగల్‌లో ఇప్పటికే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి చర్యలు ప్రారంభించాం. ఈ ఆస్పత్రుల వల్ల అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు ఒకే గొడుగు కిందికి వస్తాయి’’ అని కేసీఆర్ అన్నారు.
దేశం కంటే తెలంగాణ తలసరి ఆదాయమే రెట్టింపు: కేసీఆర్
‘‘2013 -2014 తెలంగాణ ఏర్పడిన నాడు రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.4,51,580 కోట్లు. కోవిడ్ ఉత్పాతం ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తీవ్ర అవరోధాలను సృష్టించినప్పటికీ 2020-2021 ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.9,80,407 కోట్లుగా నమోదైంది. అదే విధంగా రాష్ట్రం ఏర్పడిన నాడు 2013-2014 ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,12,126 ఉండగా నేడు తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,37,632కు చేరుకుంది. నేడు మన దేశ తలసరి ఆదాయం రూ.1,28,829గా నమోదైంది. దేశ తలసరి ఆదాయం కంటే, తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు స్థాయిలో ఉండటం విశేషం. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశంలో పదికి మించి పార్లమెంట్ స్థానాలున్న పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే.. తలసరి ఆదాయంలో మన రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పడానికి నేను గర్విస్తున్నాను.’’ అని కేసీఆర్ ప్రసంగించారు.
“రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా” తెలంగాణ
‘‘ఉమ్మడి రాష్ట్రంలో మన అవసరాల కోసం కానీ, పేదలకు రేషన్ బియ్యం పంపిణీ కోసం కానీ ఎక్కడెక్కడి నుంచో పంజాబ్ తదితర రాష్ట్రాల నుంచి బియ్యం దిగుమతి అయ్యేది. అవి తినడానికి కూడా పనికొచ్చేది కాదు. కానీ, ఈ రోజు ఇక్కడి రైతన్నలు కేవలం తెలంగాణకే కాదు, దేశంలోని ప్రజలందరికీ కడుపు నిండా అన్నం పెడుతున్నారు. తెలంగాణ “రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా” అవతరించింది.
శ్రీశ్రీ రాసిన పాటను గుర్తు చేసిన సీఎం
‘‘స్వాతంత్రం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయ్.. సాధించిన దానికే సంతృప్తిని చెంది అదే విజయమని అనుకుంటే పొరపాటోయ్’’ అని మహాకవి శ్రీశ్రీ రాసిన పాటను సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇప్పటికీ దీన్ని మనం అన్వయించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మరింత నిబద్ధత నిజాయతీ నిండిన ద్రుక్పథంతో దేశ ప్రజలు పునరంకితం కావాలని కేసీఆర్ కోరారు.