YS Jagan Comeback: పులివెందుల పులి జగన్ పంజా విసిరే టైమొచ్చింది! ఇక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు చుక్కలేనా!
Andhra Pradesh News | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ లండన్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరిగి రానున్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఎండగడుతూ మళ్లీ యాక్టివ్ అవుతారని వైసీపీ కేడర్ చెబుతోంది.

YSRCP Chief YS Jagan | ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు ఎక్కడున్నారు. చాలా మంది రాష్ట్ర ప్రజలకు, కొందరు వైసీపీ ఫ్యాన్స్ కి సైతం జగన్ నిన్నటి వరకూ లండన్ పర్యటనలోనే ఉన్నారని తెలియదు. ఎన్నికల తరువాత జగన్ చాలా అంటే చాలా సైలెంట్ కావడమే అందుకు కారణం. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అనుకున్నారో... లేదో వై నాట్ 175 అన్న ఆయనకు కేవలం 11 సీట్ల తీర్పు నుంచి ఇంకా కోలుకోన్నారో లేదో. ఏదో అడపా దడపా ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప ఆయన ఈ 7 నెలల కూటమి పాలనపై పెద్దగా స్పందించిందేమీ లేదు. జగన్ అసమర్థతనో, ఆయన వైఫల్యాలు అంటూ ప్రశ్నించడం కాదు. ప్రజాసామ్యంలో ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించడం, హామీల అమలుపై పోరాటం చేసేందుకు ఓ బలమైన ప్రతిపక్షం కావాల్సిన అవసరం ఉందని దానర్థం.
వైసీపీలో ఎన్నో ఒడిదుడుకులు
ఈ ఆరేడు నెలల కాలంలో వైసీపీ అధినేత జగన్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అత్యంత ఆప్తులు అనుకున్న వాళ్లంతా ఒక్కొక్కరుగా పార్టీకి దూరం అయిపోతున్నారు. కొందరు పదవీ కాంక్షతో టీడీపీ, జనసేనల్లో చేరితే.. మరికొందరు కూటమి ప్రభుత్వంలో చేరి సైలెంట్ అయిపోయారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాటల దాడి చేసిన గుడివాడ కొడాలి నాని శీతాకాల సుప్తావస్థలో ఉన్నారా అనిపిస్తుంది. మరోవైపు మాజీ మంత్రి పేర్ని నాని పీడీఎస్ బియ్యం స్కామ్ (Ration Rice Missing) లో లాక్ అయిపోయారు. మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, ఆర్కే రోజా మాట్లాడితే భారీ ట్రోలింగ్ ను ఎదుర్కోవాల్సి వస్తోంది. అన్నింటికంటే పెద్ద షాక్ ఈ వారం తగిలింది. పార్టీలో నెంబర్ 2 గా ఉన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీనే కాదు రాజకీయాలనే వదిలేశారు. పార్టీలో ఉన్న ఒక్క సీనియర్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం తన అనుభవంతో మండలిలో ఏదో విధంగా వైసీపీ బండిని లాక్కొస్తున్నారు. ప్రతిపక్షం హోదా ఇవ్వలేదు కాబట్టి అసెంబ్లీలో వైసీపీ ప్రాతినిథ్యం ఏమాత్రం కనిపించడం లేదు.
వైసీపీలో ప్రశ్నించే నాథుడే లేరా?
పరిస్థితి ఇలా ఉంటే... సూపర్ సిక్స్ (Super Six) హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చేస్తాం అన్నవన్నీ చేసేస్తాం అని చెప్పే పరిస్థితులు లేవు. రీసెంట్ ఎగ్జాంపుల్స్ రెండు పరిశీలిస్తే.. దావోస్ సదస్సు (World Economic Forum)లో పెట్టుబడులే లేకుండా ఉత్తి చేతులతో సీఎం చంద్రబాబు (Chandrababu), ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తిరిగొచ్చినా ఇదేంటని ప్రశ్నించే నాథుడే లేడు వైసీపీలో. జగన్ లండన్ లో ఫ్యామిలితో టైమ్ స్పెండ్ చేస్తుంటే... మాట్లాడటానికి నోరెత్తిన గుడివాడ అమర్నాథ్ ని దావోస్‌లో -5 డిగ్రీలంటూ కూటమి నాయకులు ఆడేసుకున్నారు. ఇక నగరి ఆర్కే రోజా సంగతి సరేసరి. ఆవిడ చిత్రంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్లలేదు దావోస్ కి అని క్వశ్చన్ చేశారు. రూరల్ డెవలప్మెంట్, అటవీ శాఖ మంత్రి దావోస్ కి వెళ్లి పెట్టుబడులు తీసుకురావాలంట. ఇట్స్ ఓకే.
నీతి ఆయోగ్ రిపోర్టుపై సైతం అంతంతమాత్రమే
రెండో ఉదాహరణ చంద్రబాబు మూడునాలుగు రోజుల క్రితం సైలెంట్ గా ఓ ప్రెస్ మీట్ పెట్టారు. నీతి ఆయోగ్ ఫిస్కల్ హెల్త్ రిపోర్ట్ ఇచ్చింది. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాల హెల్త్ ఎంత బాగుంది ర్యాకింగ్ చేస్తే 18 రాష్ట్రాలు ఉంటే అందులో ఏపీ ఏకంగా 17వస్థానంలో ఉంది. మన కంటే మంచి పొజిషన్ లో బీహార్ కూడా ఉంది. మన పరిస్థితే దారుణం గతే ఐదేళ్ల కాలంలో వైసీపీ చేసిన విధ్వంసానికి ఇదే ఉదాహరణ అని చెప్పారు చంద్రబాబు. పనిలో పనిగా మేం ఇస్తామన్న ప్రభుత్వ పథకాలు అమలు చేయటానికి వీలు లేనంత స్థాయిలో ఈ అప్పుల భారం మీద పడింది కాబట్టి పథకాల అమలు సాధ్యపడటం లేదు అన్నారు. చంద్రబాబు ఆ డైలాగ్ వేసింది సూపర్ సిక్స్ అమలు చేయటం మా వల్ల కాదు అనా...ప్రస్తుతానికి కాదు అనా...క్వశ్చన్ చేసే నాధుడే లేడు వైసీపీలో.
ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షాలు ఉండాలి
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఫర్ఫెక్ట్‌గా రన్ అవ్వాలంటే బలమైన ప్రతిపక్షాలు ఉండాలి. మాకు అసెంబ్లీలో అపోజిషన్ రోల్ ఇవ్వండో అని 11 సీట్లతోనే హోదా పేచీ పెట్టిన జగన్...అసెంబ్లీకి వెళ్లటం మానుకున్నారే కానీ...తనకు బలమైన మరో దారి ఉందని ఎందుకు మర్చిపోయారో తెలియటం లేదు. ఇన్ ఫాక్ట్ అర్థం కావటం లేదు. జగన్ గ్రాఫ్ చూస్తే రాష్ట్ర విభజన పూర్తై ఇక్కడ పాలన ప్రారంభించే టైమ్ కి ఆయన పార్టీ కి అంతకు ముందు ఉన్న చరిత్ర కేవలం ఇద్దరు. వాళ్లమ్మ పులివెందుల ఎమ్మెల్యే, ఆయన కడప ఎంపీ అంతే. అక్కడ నుంచి మొదలైన వైసీపీ ప్రస్థానం.. 2014లో కీలక ప్రతిపక్ష పాత్ర పోషించి 2019 వచ్చేసరికి 151 సీట్లు గెల్చుకుని చరిత్ర సృష్టించే స్థాయికి ఎదిగింది. ఎవరు అవునన్నా కాదాన్నా అదంతా జగన్ చరిష్మానే.
జిల్లాల పర్యటనతో వైసీపీలో జోష్ తెస్తారా?
టీడీపీలో లాగా వైసీపీకి లీడర్లు ఉండరు. ఉండే వాళ్లంతా జగన్ ఫోటో పట్టుకుని గెలిచిన వాళ్లే. సీమలో పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి... ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ లాంటి వాళ్లు తప్ప ఇంకెవ్వరూ జగన్ కు చెప్పకుండా మాట కూడా మాట్లాడలేని పరిస్థితి. ఆ స్థాయిలో వైసీపీపై జగన్ పట్టుంటుంది. మరి అంత పట్టున్న నాయకుడు ఇప్పుడు ఈ స్థాయిలో సైలెంట్ అయిపోవటానికి కారణాలేంటో తెలియక సగటు వైసీపీ కార్యకర్త ఆవేదన అంతా ఇంతా కాదు. సరే జరిగిందేదో జరిగింది. ఈ ఫిబ్రవరి జగన్ 2.0 ను చూస్తారని.. ఆయన జిల్లాల పర్యటన చేసి మరోసారి పాదయాత్ర టైమ్ ఊపుతో జనాలతో మమేకమవుతారని వైసీపీ ప్రచారం చేసుకుంటోంది.
మరి లీడర్లు దూరం అయినా జగన్ మళ్లీ పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇస్తారా. ప్రజల్లోకి వెళ్లి చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రజల గొంతుక గా మారి అడుగుతారా. పులివెందుల పులి అని అభిమానులు పిలుచుకునే పిలుపునకు న్యాయం చేస్తూ తనదైన శైలిలో దూసుకెళ్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఢీకొడతారా...పులివెందుల పులి పంజా విసిరే టైమ్ ఫిబ్రవరి నుంచి మొదలు కానుందా...ఏపీ రాజకీయం ఎంత రంజుగా మారనుందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

