Parashakthi Title Controversy : 'పరాశక్తి' టైటిల్ పంచాయతీకి ఫుల్ స్టాప్ పెట్టిన శివ కార్తికేయన్, విజయ్ ఆంటోనీ- ఎవరికి దక్కిందంటే?
Parashakthi Title Controversy : తమిళ హీరోలు శివ కార్తికేయన్, విజయ్ ఆంటోనీల మధ్య 'పరాశక్తి' అనే టైటిల్ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదం సద్దుమణిగింది. టైటిల్ ఎవరి సొంతమైందంటే ?

సినిమా ఇండస్ట్రీలో టైటిల్ వివాదం నెలకొనడం అనేది కొత్తేమీ కాదు. కానీ ఇద్దరు ప్రముఖ హీరోలు ఒకేసారి, ఓకే టైటిల్ తో సినిమాలను అనౌన్స్ చేయడం వల్ల వచ్చే వివాదాలు మాత్రం అరుదే. కోలీవుడ్ స్టార్స్ విజయ్ ఆంటోనీ, శివ కార్తికేయన్ కొత్త సినిమాలకు సంబంధించిన టైటిల్ అప్డేట్ మూవీ లవర్స్ ని గందరగోళంలో పడేసిన సంగతి తెలిసిందే. ఇద్దరు హీరోలు ఒకే టైటిల్ తో, రెండు సినిమాలను, ఒకే టైంలో అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత టైటిల్ నాదంటే నాదంటూ సోషల్ మీడియా వేదికగా వార్ మొదలు పెట్టారు. ఈ టైటిల్ పంచాయతీకి తాజాగా ఫుల్ స్టాప్ పడినట్టుగా తెలుస్తోంది.
వివాదం ఏంటంటే?
'పరాశక్తి' అనే టైటిల్ వివాదం గురించి ఇండస్ట్రీలో తీవ్ర చర్చ జరుగుతుంది. కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తన 25వ సినిమాను 'పరాశక్తి' అనే టైటిల్ తో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. సుధా కొంగర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను డాన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. శివాజీ గణేషన్ తొలి చిత్రం టైటిల్ అయిన 'పరాశక్తి'ని ఉపయోగించుకోవడానికి ఏవీఎం సంస్థ ఇప్పటికే అనుమతిని కూడా ఇచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ టైటిల్ ను గత ఏడాది తన సినిమా కోసం నమోదు చేశానని మరో హీరో విజయ్ ఆంటోనీ చెప్పుకొచ్చారు.
అరుణ్ ప్రభు దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ నటిస్తున్న 25వ తమిళ సినిమాకు 'శక్తి తిరుమగన్' అనే టైటిల్ ని పెట్టారు. తెలుగులో మాత్రం ఈ మూవీకి 'పరాశక్తి' అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు వెల్లడించారు. దానికి సంబంధించిన పత్రాన్ని కూడా రిలీజ్ చేశారు. బుధవారం ఈ మూవీ పోస్టర్ ను విజయ్ ఆంటోని రిలీజ్ చేసిన వెంటనే, శివ కార్తికేయన్ కూడా 'పరాశక్తి' అనేటైటిల్ తో మరో పోస్టర్ ను రిలీజ్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఇద్దరూ వెనక్కి తగ్గకుండా సోషల్ మీడియా వేదికగా ఆ టైటిల్ నాదంటే నాదని వాదించుకున్నారు. విజయ్ ఆంటోని ఇంస్టాగ్రామ్ లో "విజయ్ ఆంటోనీ పిక్చర్స్ బ్యానర్ పై గత ఏడాది జూలైలో ఈ టైటిల్ ని రిజిస్టర్ చేయించుకున్నాను. తెలుగులో నా 25 మూవీకి పరాశక్తి అనే టైటిల్ని పెట్టుకుంటాను అని సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళ దగ్గర నుంచి అనుమతి కూడా తెచ్చుకున్నాను" అంటూ దానికి సంబంధించిన డాక్యుమెంట్ ను షేర్ చేశారు. అలాగే శివ కార్తికేయన్ సినిమా షూటింగ్ దశలో ఉండగా, ఆయన కూడా ఇదే టైటిల్ ని అనౌన్స్ చేయడంతో వివాదం మొదలైంది. మరి ఇద్దరిలో ఎవరు వెనక్కి తగ్గుతారు అనే విషయం ఆసక్తికరంగా మారింది.
వెనక్కి తగ్గిన విజయ్ ఆంటోనీ...
ఈ నేపథ్యంలోనే విజయ్ ఆంటోని తన సినిమా అందరి దృష్టిలో పడడానికే ఇలా చేశారని విమర్శలు కూడా వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం విజయ్ ఆంటోనినే టైటిల్ విషయంలో వెనకడుగు వేసినట్టుగా తెలుస్తోంది. ఈ టైటిల్ వివాదంలో ఇద్దరు హీరోలు రాజీ పడడంతో, విజయ్ ఆంటోనీ 'పరాశక్తి' టైటిల్ ని శివ కార్తికేయన్ కి ఇచ్చేసారట. తమిళంతో పాటు తెలుగులో కూడా శివ కార్తికేయన్ మూవీకి 'పరాశక్తి' అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేయగా, విజయ్ ఆంటోనీ సినిమాకు మాత్రం 'శక్తి తిరుమగన్' అనే టైటిల్ ను తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పెడుతున్నారు. తెలుగులో మాత్రం కొత్త టైటిల్ ని వెతికి త్వరలోనే వెల్లడించబోతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

