CM Chandrababu: ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు, చిత్తశుద్ధితో పని చేయాలి - ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలతో టెలీకాన్ఫరెన్సులో చంద్రబాబు
MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి గ్యాడ్యుయేట్‌ను కలిసి ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించాలని సూచించారు.

MLC Elections : రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి ఎన్డీయే పక్షాలు సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకుని పని చేయాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్డీయే కూటమి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్న సీఎం.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు దిశానిర్ధేశం చేశారు. ఏ ఎన్నికలొచ్చినా సుస్థిర పాలన ఉంటుందని హామీ ఇచ్చారు. కొత్తగా గెలిచిన, వచ్చిన నేతలు మరింత చిత్తశుద్ధితో పని చేయాలని చంద్రబాబు సూచించారు. ఎవరూ ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉండొద్దని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలు, రాష్ట్రానికి రాబోతున్న పెట్టుబడులను దృష్టిలో ఉంచుకుని తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి
ప్రభుత్వం ఏర్పాటైన 7 నెలల్లో ఇబ్బందులు అధిగమించి సుపరిపాలన వైపు అడుగులు వేస్తున్నాం. ప్రజలకు ఇబ్బంది లేని పాలన సాగిస్తున్నాం. అలా అని రాత్రికి రాత్రే అన్నీ జరిగిపోతాయని చెప్పడం లేదు. కానీ గాడి తప్పిన వ్యవస్థలను సరిదిద్దుతున్నాం. కేంద్ర ప్రభుత్వ సాయంతో విశాఖ స్టీల్ ప్లాంట్, రాజధాని అమరావతికి ఆర్థిక సాయం, పోలవరానికి నిధులు, రైల్వే జోన్‌తో పాటు ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం. మూడు పార్టీల నేతలు సార్వత్రిక ఎన్నికలకు ముందు సమన్వయంతో పని చేసినట్లుగానే ఇప్పుడూ పని చేయాలి. జరిగే ప్రతి ఎన్నికల్లో గెలిచేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
సమన్వయ సమావేశాలతో పని చేయాలి
ఎన్డీయే పక్షాలతో సమన్వయ సమావేశాలు పెట్టుకుని పని చేయాలని చంద్రబాబు అన్నారు. క్లస్టర్, యూనిట్, బూత్, ఇంచార్జ్‌లతో పాటు, జనసేన, బీజేపీ కమిటీల నేతలతో ముందుకెళ్లాలన్నారు. ప్రతి గ్యాడ్యుయేట్‌ను కలిసి ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించాలని, చదువుకున్న వాళ్లంతా కూటమితోనే ఉన్నారని చెప్పారు. ఎవరూ ఓవర్ కాన్ఫిడెన్స్‌లో ఉండొద్దని సూచించారు. ఈ ఎన్నికలు ఏపక్షంగా జరగాలని, ఏ ఎన్నిక వచ్చినా గెలిచినప్పుడే సుస్థిర పాలన ఉంటుందని, అప్పుడే ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతుందని సీఎం అన్నారు. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నేతలు మరింత చిత్తశుద్ధితో పని చేయాలని చెప్పారు.
త్వరలోనే టీచర్ పోస్టులకు నోటిఫికేషన్
త్వరలోనే 16,347 టీచర్ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని చంద్రబాబు తెలిపారు. జాబ్ ఫస్ట్ విధానంతో నూతన ఇండస్ట్రియల్ పాలసీలు తీసుకొచ్చామన్న ఆయన.. కూటమి ప్రభుత్వం వచ్చాక దాదాపు రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చామని చెప్పారు. ఈ పెట్టుబడుల ద్వారా 4,10,125 ఉద్యోగాలు మన యువతకు వస్తాయని ఆకాంక్షించారు.
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు
రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా-గుంటూరు నియోజకవర్గాలు, శ్రీకాకుళం - విజయనగరం - విశాఖపట్నం నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు 3న నోటిఫికేషన్, 27న ఎన్నికలు, మార్చి 3న జరగనుంది. కాగా ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా-గుంటూరు జిల్లాల గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖర్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ను కూటమి అభ్యర్ధులుగా పోటీలో దింపింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

