Emaar Revanth Reddy: వివాదాలను పరిష్కరించాలని ఎమ్మార్ విజ్ఞప్తి - లీగల్ ఏజెన్సీకి రేవంత్ ఆమోదం
Emaar Properties: హైదరాబాద్ లో కోర్టు కేసులతో ఆగిపోయిన ఎమ్మార్ ప్రాపర్టీస్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. కోర్టు కేసులతో నిలిచిపోయిన తమ ప్రాజెక్టులకు విముక్తి కల్పించాలని కోరుతోంది.

Telangana: వివిధ కేసులతో పెండింగ్ లో ఉన్న తమ ప్రాజెక్టుల వివాదాలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మార్ ప్రాపర్టీస్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మార్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎమ్మార్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ మహమ్మద్ అలబ్బర్, భారత్ లో యూఏఈ మాజీ రాయబారి డాక్టర్ అహ్మద్ అల్ బన్నా, ఎమ్మార్ గ్రూప్ సీఈవో అమిత్ జైన్, ఆ కంపెనీ ఇంటర్నేషనల్ అఫైర్స్ హెడ్ ముస్తఫా అక్రమ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
హైదరాబాద్ లో భారీగా పెట్టుబడులు పెట్టిన ఎమ్మార్ ప్రాపర్టీస్
2001లో ఉమ్మడి రాష్ట్రంలో దుబాయ్‌కు చెందిన ఎమ్మార్ ప్రాపర్టీస్ హైదరాబాద్లో కన్వెన్షన్ సెంటర్, హోటల్, గోల్ఫ్ కోర్సు, విల్లాలు తదితర ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు అప్పటి ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంది. ఏపీఐఐసీతో ఆ సంస్థ చేసుకున్న ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయని అప్పట్లో సీబీఐ, ఈడీ కేసులు నమోదయ్యాయి. ఏజెన్సీల దర్యాప్తులు, కోర్టుల్లో విచారణలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2015 అక్టోబర్ లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మార్ ప్రాపర్టీస్ కు సంబంధించిన ప్రాజెక్టుల వివాదాల పరిష్కారానికి ఛీప్ సెక్రెటరీ సారధ్యంలో అయిదుగురు సెక్రెటరీల కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు కేంద్ర విదేశాంగ శాఖ, సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాకూడా ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు.
ఎమ్మార్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రికి పూర్తి వివరాలు
ఎమ్మార్ ప్రతినిధులతో జరిగిన చర్చల సందర్భంగా ఈ అంశాలన్నింటినీ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వివిధ దర్యాప్తు ఏజెన్సీల కేసులు, ఛార్జీ షీట్లు, న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉన్నందున ఎమ్మార్ ఒప్పందాల డాక్యుమెంట్లు, కోర్టు కేసుల వివరాలతో పాటు కేంద్ర ప్రభుత్వ సూచనలన్నీ క్షుణ్నంగా పరిశీలించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారాన్ని పరిష్కరించేందుకు 2015లో చీఫ్ సెక్రటరీ నేత్రుత్వంలో అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి అదనంగా న్యాయ నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
పరిష్కారం కోసం లీగల్ ఏజెన్సీ
న్యాయ వివాదాలను అధ్యయనం చేయడానికి, సామరస్య పూర్వక పరిష్కారం చేసుకోవడానికి యూఏఈ ప్రభుత్వ ఆమోదంతో ఒక లీగల్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తామని సంస్థ ప్రతినిధులు ప్రతిపాదించగా, వారి ప్రతిపాదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమోదించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీ వారితో సంప్రదింపులు జరిపి తదుపరి సూచనలు, సలహాలు అందిస్తుందని చెప్పారు. ఇప్పుడు ఎమ్మార్ ప్రాజెక్టుల విలువ కొన్నివేల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
2003లో గచ్చిబౌలిలో 535 ఎకరాల్లో బౌల్డర్ హిల్స్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం, ఎమార్ మధ్య ఒప్పందం జరిగింది. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టును కొనసాగించింది. తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు, ఇతర వెసులుబాట్లకు తోడు మరిన్ని ప్రోత్సాహకాలను ఇచ్చింది. ఏపీఐఐసీ వాటాను 26 శాతం నుంచి 4 శాతానికి తగ్గించింది. తద్వారా ప్రభుత్వానికి అప్పట్లోనే రూ.5వేల కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా వేశారు. క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారని కేసులు నమోదయ్యాయి. ఇప్పుడీ కేసుల విచారణ జరుగుతోంది.





















