Telangana Alert: కరోనాపై తెలంగాణ అలర్ట్! వీలైతే మాస్కులు ధరించండి- మంత్రి దామోదర రాజనర్సింహ
Telangana News: కొత్త సబ్ వేరియంట్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్న కేంద్రం సూచనలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వీలైతే మాస్కులు ధరించాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు.
JN1 variant cases: హైదరాబాద్: ఆసియా దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతున్న జేఎన్1 వేరియంట్ కేసు కేరళలో ఇటీవల గుర్తించారు. అయితే పొరుగు దేశాలలో వేగంగా కోవిడ్ వ్యాప్తితో పాటు దేశంలోనూ యాక్టివ్ కేసులు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం సోమవారం నాడు రాష్ట్రాలను అలర్ట్ చేసింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కొత్త సబ్ వేరియంట్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్న కేంద్రం సూచనలతో తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) అప్రమత్తమైంది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సూచన మేరకు వైద్య శాఖ అప్రమత్తంగా ఉంటూనే, అన్నిరకాలుగా సంసిద్ధంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Raja Narasimha ) అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో డిసెంబర్ 8న కొవిడ్ కొత్త సబ్ వేరియంట్ జేఎన్.1 కేసు గుర్తించారు. మరోవైపు పలు రాష్ట్రాల నుంచి అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్లే సమయం ఇది కావడంతో మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సిహ సూచించారు. రాబోయే రోజులు పండుగల సీజన్ కావడంతో ప్రజలు శ్వాసకోశ పరిశుభ్రతను పాటించాలని, అవసరమైన మేరకు మాస్కులను ధరించాలని సూచించారు. వృద్ధులు, శ్వాసకోస సంబంధిత సమస్య ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. అవసరమైన ప్రజారోగ్య చర్యలు, ఇతర ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఆదేశించారు.
కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు తెలంగాణ యంత్రాంగం పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు. తగినన్ని కోవిడ్19 వ్యాధి నిర్ధారణ పరీక్షలకు కావాల్సిన కిట్స్, చికిత్సకు అవసరమైన మందులు ఆక్సిజన్ అందుబాటులో ఉన్నాయని మంత్రి దామోదర రాజనర్సింహ వివరించారు. కేంద్రం సూచనలతో రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందవద్దని, చలికాలం సమస్యలు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, సమస్యలు తలెత్తం సహజమేనన్నారు. అయితే కరోనా కేసులు వ్యాప్తి చెందుతున్నందున పరిశుభ్రత పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రజలకు మంత్రి సూచించారు.
లక్షణాలివే..
కరోనా కొత్త సబ్ వేరియంట్ (Covid Variant JN.1 Symptoms) లక్షణాలు జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి. ఇప్పటి వరకూ ఈ వైరస్ సోకిన వాళ్లలో ఈ లక్షణాలు కనిపించాయి. కొందరిలో శ్వాస సంబంధిత సమస్యలు వచ్చాయి. నాలుగైదు రోజుల పాటు ఈ లక్షణాలు కనిపిస్తాయి. రద్దీగా ఉన్న చోటుకు వెళ్తే మాస్కులు ధరించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. మిగతా వైరల్ ఇన్‌ఫెక్షన్లలోనూ ఇవే లక్షణాలు కనిపిస్తున్నాయి. కొత్త వేవ్ వచ్చేస్తోందని భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. పరిశుభ్రత పాటించడం, సోషల్ డిస్టెన్సింగ్, మాస్కులు ధరించడం లాంటి జాగ్రత్తలతో కరోనా కేసులకు చెక్ పెట్టవచ్చునని వైద్యులు అంటున్నారు. శ్వాస సంబంధిత సమస్య అధికమైతే కోవిడ్ టెస్టులు చేపించడం బెటర్. గొంతు నొప్పి మొదలైనట్లుగా ఉంటే గోరువెచ్చని నీటిని తాగాలని, వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.