Huzurabad TRS : "దళిత బంధు"గా కేసీఆర్‌ను దళితులు గుర్తించలేదా ? నమ్మలేకపోయారా ?
దళిత బంధు పథకం ప్రకటించి.. ఏకంగా ప్రతి ఇంటికి రూ. పది లక్షలు ఇస్తామని చెప్పినా టీఆర్ఎస్‌ను ఓటర్లు నమ్మలేదు. చివరికి పథకం ప్రారంభించిన గ్రామంలోనూ ఈటలకే మెజార్టీ వచ్చింది.
ఇంటికి రూ. పది లక్షలు ఇస్తామన్నా తెలంగాణ రాష్ట్ర సమితిని హుజురాబాద్ దళిత ఓటర్లు నమ్మలేకపోయారా ?చివరికి దళిత బంధు పథకాన్ని ప్రారంభించిన గ్రామంలోనూ టీఆర్ఎస్‌కు మెజార్టీ రాకపోవడం దీనికి సంకేతమా ?. ముఖ్యమంత్రి కేసీఆర్ హుజురాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి గ్రామంలో దళిత బంధు పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఈ పథకంతో దళితులంతా ఏకపక్షంగా టీఆర్ఎస్‌కు ఓటు వేస్తారని వారు ఆశించారు. అయితే అనూహ్యంగా శాలపల్లి గ్రామంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం సాధించారు. దీంతో దళిత బంధు పథకాన్ని ఓటర్లు నమ్ముతున్నారా లేదా అన్నదానిపై సందేహాలు ప్రారంభమయ్యాయి.
Also Read : హుజూరాబాద్‌లో గుర్తుల గోల.. టీఆర్ఎస్, బీజేపీ కొంప ముంచుతున్న ఆ రెండు సింబల్స్
హుజురాబాద్ ఉపఎన్నికలు ఖాయమని తేలిన తరవాత దళిత బంధు పథకాన్ని ప్రకటించారు. మొదట నియోజకవర్గానికి వంద కుటుంబాలకే ఇస్తామన్న కేసీఆర్ పైలట్ ప్రాజెక్ట్‌గా హుజురాబాద్ మొత్తం ఇవ్వాలనుకున్నారు. అక్కడ ప్రతి దళిత కుటుంబానికి రూ. పది లక్షలు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు. రూ. రెండు వేల కోట్లను విడుదల చేశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఓటర్లు నమ్మలేకపోవడానికి ప్రధాన కారణం .. రెండు నెలలైనా దళిత బంధు యూనిట్లు పంపిణీ చేయకపోవడమేనని అంటున్నారు.
Also Read : "సమైక్య రాష్ట్రంగా మళ్లీ ఏపీ" ! సాధ్యమా ? రాజకీయమా?
దళిత బంధు పథకం ప్రారంభించిన రోజున రెండు నెలల్లో దళిత కుటుంబాలన్నింటికీ రూ. పది లక్షలు ఇస్తామని చెప్పారు. కానీ రెండు నెలలు అయి ఎన్నికల షెడ్యూల్ వచ్చే సరికి ఎవరికీ పంపిణీ చేయలేదు. కేసీఆర్ ఆరంభ సభలో చెక్కులు ఇచ్చిన పదిహేను మందికే యూనిట్లు అందాయి. దీంతో హుజురాబాద్ దళితుల్లో నమ్మకం తగ్గిపోయింది. అదే సమయంలో ఓట్ల కోసం కేసీఆర్ ఎన్నెన్నో చెబుతూ ఉంటారని కానీ ఆయన వాస్తవానికి ఏమీ చేయరని హుజూరాబాద్‌లో అదే పనిగా విపక్షాలు ప్రచారం చేశాయి.
హుజూర్ నగర్, నాగార్జున సాగర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాలా చెప్పారని.. కానీ ఏమీ చేయలేదని అలాగే గ్రేటర్ ఎన్నికలకు ముందు ప్రకటించిన వరద సాయం విషయంలోనూ అదే చేశారని అంటున్నారు. కేసీఆర్ కూడా దళిత బంధు పథకం గురించి ఖచ్చితంగా అమలు చేస్తామని ఓటర్లకు నమ్మకం కలిగించడానికి ఎక్కువ సమయం కేటాయించారు. ఆరు నూరైనా అమలు చేస్తామన్నారు. దళిత జాతిని దేశానికి ఆదర్శంగా మారుస్తామని హామీ ఇచ్చారు. ప్లీనరీలోనూ అదే చెప్పారు. కానీ ఓటర్లలో మాత్రం అంత నమ్మకం కలగలేదని హుజురాబాద్ లో ఎదురుదెబ్బే సాక్ష్యమంటున్నారు.