Mla Jaggareddy: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి సమైక్య రాగం... ఆ విషయంలో కేసీఆర్ కు మద్దతిస్తానని కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మళ్లీ సమైక్యరాగం ఎత్తుకున్నారు. సీఎం కేసీఆర్ సమైక్య వాదంతో ముందుకొస్తే మద్దతిస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి సమైక్యవాదం వినిపించారు. సీఎం కేసీఆర్ సమైక్య వాదంతో ముందుకొస్తే మద్దతిస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ జగ్గారెడ్డి సమైక్య వాదాన్ని వినిపించారు. అందరూ తనను తెలంగాణ ద్రోహి అన్నప్పటికీ ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. సమైక్యం తన వ్యక్తిగత అభిప్రాయమని ఆయన తెలిపారు. పార్టీకి సంబంధం లేదన్నారు. మళ్లీ ఆంధ్రా, తెలంగాణ నాయకులు సమైక్యాన్ని తెరపైకి తెచ్చారన్నారు. ఈ విషయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అభిప్రాయం వేరు, తన వ్యక్తిగత అభిప్రాయం వేరని వివరించారు. తాను ఏ ప్రాంతానికీ వ్యతిరేకంకాదని జగ్గారెడ్డి అన్నారు. సమైక్య వాదం ప్రజల డిమాండ్ కాదని, నాయకుల అభిప్రాయం మాత్రమే అన్నారు. తెలంగాణ వస్తే మెరుగైన జీవితం ఉంటుందని భావించినా ప్రజల ఆకాంక్ష నెరవేరలేదన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతోనే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడినా ఇంకా ఏ ఒక్కటీ నెరవేరలేదన్నారు. రాష్ట్ర విభజన జరిగినా ఆంధ్రా, రాయలసీమ ప్రజలు కోటిమందికి పైగా తెలంగాణలో ఉంటున్నారన్నారు. ఆంధ్రాలో పార్టీ పెట్టమని కోరుతున్నారని సీఎం కేసీఆర్ ప్లీనరీలో చెప్పారని జగ్గారెడ్డి గుర్తుచేశారు. పార్టీ పెట్టడం ఎందుకు రాష్ట్రాన్ని కలిపేద్దామని ఏపీ మంత్రి పేర్ని నాని ప్రతిపాదించారన్నారు.
Also Read: ఇప్పుడు ఏపీలో చీకట్లు.. తెలంగాణలో వెలుగులు ! తెలంగాణ దేశంకన్నా ముందు ఉందన్న కేసీఆర్ !
టీఆర్ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు
తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను తమకు అమలు చేయకపోతే.. తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలని మహారాష్ట్రలోని నాందేడ్ వాసులు, కర్ణాటకలోని రాయచూర్ వాసులు కోరుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పెద్ద ఎత్తున తమ పార్టీని అక్కడ కూడా పోటీ చేయాలని విజ్ఞప్తులు వస్తున్నాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను తమకూ కావాలని ఏపీ ప్రజలు కోరుతున్నారన్నారు.
Also Read: అలా అయితే రాష్ట్రాలను కలిపేస్తే సరిపోతుందిగా ? కేసీఆర్‌కు ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ !
పేర్ని నాని కౌంటర్... రేవంత్ రెడ్డి హెచ్చరికలు
ఆంధ్రప్రదేశ్‌లోనూ పార్టీ పెట్టాలని.. గెలిపించుకుంటామని కొన్ని వేల మంది తనకు ఫోన్లు చేస్తున్నారని టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. రెండు రాష్ట్రాల్లో పార్టీ ఎందుకు? రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేస్తే సరిపోతుందని వ్యంగ్యంగా మాట్లాడారు. ఏపీలో పార్టీ పెట్టే ముందు తెలంగాణ కేబినెట్‌లో తీర్మానం పెడితే బాగుంటుందని ఆయన సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాలను కలపాలనే తీర్మానాన్ని కేసీఆర్ పెడితే.. ఆ తర్వాత ప్రత్యేకంగా పార్టీ పెట్టాల్సిన అవసరం ఉండదన్నారు. ఏ ఇబ్బంది లేకుండా పోటీ చేయవచ్చని గుర్తు చేశారు. పేర్ని నాని వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణ జోలికొస్తే ఖబడ్డార్ అంటూ రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కేసీఆర్ రాజ్య విస్తరణ కాంక్షకు తెలంగాణను బలిచ్చే కుట్ర చేస్తున్నారన్నారు. ప్లీనరీలో తెలుగుతల్లి ప్రత్యక్షం కావడం, మంత్రి పేర్ని నాని సమైక్య రాష్ట్ర ప్రతిపాదన... కేసీఆర్, జగన్‌ల ఉమ్మడి కుట్ర అని ఆరోపించారు. వందల మంది ఆత్మబలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ విషయంపై మంత్రి పేర్ని నాని మళ్లీ స్పందించి తెలంగాణలో రాజకీయ శూన్యత ఉందని అందుకే కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయన్నారు.