CPI Narayana: సీఎం కేసీఆర్ కుమార్తెను కాపాడేది బీజేపీ కాదా?: నారాయణ ఫైర్
CPI Narayana: ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam)లో కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను కాపాడేది కేంద్రంలోని బీజేపీ కాదా అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) ప్రశ్నించారు.
CPI Narayana: ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam)లో కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను కాపాడేది కేంద్రంలోని బీజేపీ కాదా అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) ప్రశ్నించారు. మద్యం కుంభకోణంలో రాజీ ఒప్పందం కుదిరిన తర్వాతనే.. వైసీపీ, కేసీఆర్, బీజేపీ కలిసి ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేయాలని కుట్ర పన్నారని ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు ఆత్మస్తుతి పరనిందలా ఉన్నాయని అన్నారు.
మద్యం స్కాం కేసులో ఆప్ మంత్రి మనీశ్ సిసోదియాను జైల్లో పెట్టారని, కానీ కేసీఆర్ కుమార్తె కవిత, వైసీపీ నాయకులను ఎందుకు జైలులో పెట్టలేదని ప్రశ్నించారు. ఈ స్కాంలో అందరూ కలిసి కుమ్మక్కై సిసోదియాను మాత్రమే ఇరికించారని మండిపడ్డారు. సత్యం రామలింగరాజు మీద సెబీ ఎంక్వెయిరీ వేశారని.. అదానీ కుంభకోణంలో ఎందుకు సెబీ ఎంక్వెయిరీ వేయలేదని ప్రశ్నించారు. పెద్ద కుంభకోణం బయట పెడితే ఆయనను కాపాడుకుంటున్నారని నారాయణ దుయ్యబట్టారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సిసోడియాను మాత్రమే ఎందుకు అరెస్ట్ చేశారని నారాయణ ప్రశ్నించారు? లిక్కర్ స్కాంలో ఉన్న వైసీపీ, బీఆర్ఎస్ నేతలు సేఫ్‌గా బయట ఉన్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలది అండర్ స్టాండింగ్‌తో కూడిన ముద్దులాట, గుద్దులాట మాత్రమే అంటూ విమర్శించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జైలుకు వెళ్లలేదంటే.. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి కాబట్టే వెళ్లలేదని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలు దిగజారుడు తనానికి పరాకాష్ఠ అంటూ ధ్వజమెత్తారు.
సీఎం కేసీఆర్ ఆఫ్ ది రికార్డ్ మాటలను ప్రధాని మోదీ బయట పెట్టడం అనైతికమని నారాయణ మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటి కాదని చెప్పేందుకే మోదీ తాపత్రయం పడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని స్థాయి వ్యక్తి దేశానికి అవమానకరంగా మాట్లాడారని నారాయణ విమర్శించారు. కేసీఆర్ అవినీతిపై మోదీ సర్కార్ ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. జాతీయస్థాయి తరహాలోనే తెలంగాణలోనూ కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు కలిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఏపీలోనూ టీడీపీ, జనసేనతో కలసి పనిచేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
ఎన్నికల కోసమే మహిళా బిల్లు
రెండు రోజుల క్రితం జరిగిన సమావేశంలోను నారాయణ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల కోసమే కేంద్రం మహిళ బిల్లు ప్రవేశ పెట్టిందని ఆరోపించారు. బీజేపీ కి చిత్తశుద్ది ఉంటే 2024 మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం కొనసాగితే దేశం ఉత్తర, దక్షిణ భాగాలుగా విడిపోవడం ఖాయం అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగానే బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చామన్నారు. కానీ సీఎం కేసీఆర్ నుంచి ఇంకా ముందే తెగ దెంపులు చేసుకోవాల్సిందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సిపిఐ కలిస్తే సీఎం కేసీఆర్ కు డిపాజిట్లు కూడా రావన్నారు.
కర్ణాటకలో బీజేపీ ఓటమి ప్రధాని మోదీ ఓటమి చెంప పెట్టులాంటిదని అన్నారు. ఎన్నికల ప్రచారాలు ఎన్నో చూసాం. కానీ ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నవారు కర్ణాటకలో సుదీర్ఘకాలం అక్కడే ఉండి కులాలను మతాలను రెచ్చగొట్టే ఉపన్యాసాల ద్వారా ఓట్లు సంపాదించాలని ప్రయత్నించారని, కానీ అక్కడి ప్రజలు తిరస్కరించారని చెప్పారు. లౌకిక వ్యవస్థకు ప్రతినిధిగా ఉన్నటువంటి ప్రధాని మోదీ ఓట్ల కోసం కక్కుర్తి పడి చివరికి బజరంగ్ జిందాబాద్ అనే స్థాయికి వెళ్లడం ఆయన నైతికతకు నిదర్శనం అన్నారు.